చైనాను ధీటుగా ఎదుర్కొనేందుకు లడఖ్ లో కే9 వజ్ర శతఘ్నులను ఉంచిన భారత్

భారత సరిహద్దుల్లో చైనా మరోసారి తోక జాడిస్తూ వస్తోంది. తూర్పు లడఖ్ ప్రాంతంలో చైనా బలగాలను మోహరిస్తోంది. దీంతో చైనాకు షాకివ్వడానికి భారత్ తన ప్రణాళికలను రచిస్తూ ఉంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద తొలిసారి కే9- వజ్రా హోవిజ్జర్ గన్నులను భారత్ ఆర్మీ ఉంచింది. కే9-వజ్రా గన్ సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శుత్రు టార్గెట్లను ధ్వంసం చేయగలదని భారత ఆర్మీ తెలిపింది. కే9 వజ్రా ఆయుధాలు హై ఆల్టిట్యూడ్ ఏరియాల్లోనూ పనిచేస్తాయి. ఫీల్డ్ ట్రయల్స్ సమయంలో హోవిజ్జర్ గన్నులు చాలా సక్సెస్ రేటును చూపినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. కే9 రెజిమెంట్‌ను పూర్తిగా ఇక్కడ మోహరించడం వల్ల అది మనకు ఎంతో ఉపకరిస్తుందని భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే చెప్పారు.
భారత ఆర్మీ చీఫ్ నరవాణే మాట్లాడుతూ భారత ఆర్మీ అధునాతన కే9 వజ్ర శతఘ్నులను రంగంలోకి దించిందని తెలిపారు. లడఖ్ లోని ఫార్వర్డ్ ఏరియాలో తొలిసారి ఈ శతఘ్నులను మోహరించామని అన్నారు. కే9-వజ్రా హోవిజ్జర్‌కు చెందిన రెజిమెంట్‌ను మొత్తాన్ని లడఖ్‌లో మోహరించినట్లు నరవాణే తెలిపారు. ఇవి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇవి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో కూడా పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని ట్రయల్స్‌లో రుజువైందని అన్నారు. ప్రస్తుతం కే9 వజ్ర రెజిమెంట్ మొత్తాన్ని ఇక్కడే ఏర్పాటు చేశామని..లడఖ్ వంటి ప్రాంతాల్లో ఈ హోవిట్జర్లు చాలా బాగా ఉపకరిస్తాయని నరవాణే తెలిపారు. వీటిని తొలిసారిగా 2018లో భారత ఆర్మీలో ప్రవేశపెట్టారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఎల్ అండ్ టీ సంస్థ వీటిని గుజరాత్లో తయారు చేసింది. ఈ కే9 వజ్ర శతఘ్నులు ఒక్కోటీ 50 టన్నుల బరువు ఉంటాయి. 47 కేజీల బాంబులను విసరగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. కార్గిల్ సెక్టార్లో కూడా భారత్ వీటిని ఇప్పటికే పరీక్షించింది. కే9 వజ్ర, ధనుష్, M777 అల్ట్రా-లైట్ హోవిజ్జర్ ప్రవేశంతో భారత సైన్యం మరింత పటిష్టంగా మారింది.
ఇరు దేశాల దళాల ఉపసంహరణపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు ఉన్నట్లు నరవాణే చెప్పారు. అన్ని సమస్యాత్మక ప్రాంతాలను క్లియర్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. చైనాతో నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చల ద్వారా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని నమ్ముతున్నట్లు నరవాణే తెలిపారు. ఈస్ట్రన్ లడాఖ్, నార్తర్న్ ఫ్రంట్ నుంచి ఈస్ట్రన్ కమాండ్ వరకు చైనా తన సైన్యాన్ని మోహరించిందని, చైనా తన ఫార్వర్డ్ ప్రాంతాల్లో దళాలను పెంచిందని, ఇది కొంత ఆందోళనకరమైన అంశమని నరవాణే తెలిపారు. సరిహద్దు వెంట చైనా దళాల కదిలికలను నిత్యం గమనిస్తూనే ఉన్నామని ఆర్మీ చీఫ్ తెలిపారు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనే రీతిలో సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.