పక్కనున్నప్పుడు పచ్చడి మెతుకులకు గతిలేదు గానీ.. మళ్లీ వస్తే మటన్ బిర్యానీ పెడతానన్నాడట..! కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరు సరిగ్గా అలాగేవుంది. తాజాగా బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింధియాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్కడ లేని ప్రేమ కురిపించాడు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని… కానీ, బీజేపీలోకి వెళ్లి ఆయన బ్యాక్ బెంచర్ అయిపోయారని తెగ బాధపడిపోయాడు. కాంగ్రెస్ పార్టీ గొప్పదనం గురించి ఆ పార్టీ యూత్ వింగ్ తో మాట్లాడిన రాహుల్.. సింధియాపై సానుభూతిని వ్యక్తం చేశాడు. కాంగ్రెస్లో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసే శక్తి సింధియాకు ఉందని అన్నాడు. ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి అవుతావంటూ సింధియాకు గతంలోనే తాను చెప్పానని.. కానీ, ఆయన మరో మార్గాన్ని ఎంచుకున్నారని అన్నాడు. అంతటితో ఆగకుండా, ఇక జ్యోతిరాధిత్య సింధియా ఏనాటికీ సీఎం కాలేరని.. సీఎం కావాలంటే మళ్లీ కాంగ్రెస్లోకి రావాల్సిందేనని అన్నాడు రాహుల్.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు జ్యోతిరాధిత్య సింధియా సైతం ఘాటుగానే రిప్లయి ఇఛ్చారు. తాను దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన సమయంలో రాహుల్ తన పట్ల ఏమాత్రం శ్రద్ధ తీసుకున్నారని జ్యోతిరాదిత్య సింధియా నిలదీశారు. ఇప్పుడు తన పట్ల ప్రేమ కురిపిస్తున్న రాహుల్ అప్పుడు ఎలా వ్యవహరించారో తెలుసునని వ్యాఖ్యానించారు. అప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. ఆ రోజుల్లోనే శ్రద్ధపెట్టి ఉంటే, పరిస్థితులు వేరుగా ఉండేవని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికొచ్చిన తర్వాత బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో వున్న జ్యోతిరాధిత్య సింధియా.. పార్టీ గెలుపుకోసం శాయాశక్తులా కృషిచేశాడు. యువనేతగా పార్టీని ముందుండి నడిపించాడు.. ఆయన కృషి వల్లే అంతకుముందు 58 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగలిగింది. అంతేకాదు, జ్యోతిరాధిత్యనే సీఎం క్యాండిడేట్ అంటూ కాంగ్రెస్ అధిష్టానం ప్రచారం కూడా చేసింది. తీరా ఎన్నికలయ్యాక జ్యోతిరాధిత్యకు మొండిచేయి చూపి.. కమల్ నాథ్ కు పగ్గాలు అప్పగించింది. పూర్తి మెజారిటీ రాకపోయినా.. హడావుడిగా అడ్డదారిలో సీఎం కుర్చీపై కూర్చోబెట్టింది. ఆ తర్వాత కొద్దిరోజులకు జ్యోతిరాధిత్య 22 ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ నుంచి బయటికి రావడంతో కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం అయ్యారు. అంతేకాదు, రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో నలుగురు మినాహా మిగతావారంతా ఉప ఎన్నికల్లో గెలిచారు. దీంతో పూర్తి మెజారిటీతో మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది.