విజయవాడలో నూతన న్యాయస్థాన భవనాలను సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో G+7 భవనాలు నిర్మించారు. వీటిలో 29 ఏసీ కోర్టు హాళ్లు, న్యాయవాదులు, కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు, క్యాంటీన్, ఏడు లిఫ్టులు సహా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఏపీలో న్యాయవ్యవస్థకు సహకరిస్తానని సీఎం జగన్ మాటిచ్చారని, సహకరించి నిధులు ఇవ్వడంతో న్యాయస్థానాల నిర్మాణం పూర్తయిందని ఎన్వీ రమణ చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడిన తర్వాత తాను తెలుగులో మాట్లాడకపోతే బాగోదంటూ జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులో ప్రసంగించారు.
అందరూ ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రిగారు, నేను తెలుగులో మాట్లాడటానికి ప్రత్యేకత ఉంటుందని భావిస్తున్నాను. పదేళ్ల క్రితం నూతన కోర్టు భవనాలకు నేనే శంకుస్థాపన చేశాను. ఇప్పుడు వాటిని నేనే ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 11 మే 2013లో ఈ భవనాలకు శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర విభజన సమస్యలు, రాష్ట్ర విభజన, ఆర్థిక సమస్యలు, ప్రభుత్వాలు సరిగా నిధులు ఇవ్వకపోవడం వంటి అంశాలతో ఈ భవనాల నిర్మాణం ఆలస్యమైంది. జాప్యం వల్ల లాయర్లు, జడ్జీలు, బార్ అసోసియేషన్ సభ్యులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వాలను, అధికారులను గట్టిగా ప్రశ్నించి భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించాను. పూర్తయిన భవనాలను సక్రమంగా వినియోగించుకోవాలి. ప్రజలందరికీ సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సత్వర న్యాయం అందించేందుకు దేశవ్యాప్తంగా కోర్టులకు భవనాలతోపాటు న్యాయవ్యవస్థలో జడ్జీల ఖాళీలను భర్తీ చేయాలన్న అంశంపై మాట్లాడుతున్నానన్నారు. దేశంలో ప్రస్తుతం పెండింగ్ కేసుల సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. ప్రజలకు వీలైనంత త్వరగా న్యాయం అందించాలన్న తపన న్యాయమూర్తులకు ఉండాలి. అలా జరిగినప్పుడే న్యాయవ్యవస్థ మనగలుగుతుందన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. న్యాయవ్యవస్థ కుప్పకూలిపోతే, దానిపై ప్రజలకు విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చాలా మంది గొప్ప మనసుతో నన్ను ఆదరించి పైకి తీసుకువచ్చారు. ఈ నెల 27న పదవీ విరమణ చేయబోతున్నా. నా ఉన్నతికి, విజయానికి కారణమైన న్యాయవాదులు, జడ్జీలకు, నా అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలని జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు.