పాకిస్తాన్ లో ఆ దేశ మాజీ దౌత్యవేత్త కుమార్తెను కొంత మంది దుండగులు అతికిరాతకంగా హతమార్చడం సంచలనంగా మారింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. పాకిస్తాన్‌కు చెందిన శౌకత్ ముకద్దమ్ గతంలో దక్షిణ కొరియా, కజికిస్తాన్‌లకు దౌత్యావేత్తగా పనిచేశారు. కొంత మంది దుండగులు ఆయన కుమార్తె నూర్ ముకద్దమ్‌ను కిడ్నాప్‌చేసి అతి దారుణంగా చంపేశారు. ఆమె మృతదేహన్ని ఇస్లామాబాద్‌లోని ఎఫ్ 4 సెక్టార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. పాక్ పోలీసులు ఆమె మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఈ హత్య కేసులో ఆమె మిత్రుడిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జహీర్ జాఫర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

లవ్ లో బ్రేకప్ కారణంగానే పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త కుమార్తె శిరచ్ఛేదం చేయబడిందని అంటున్నారు. 27 ఏళ్ల నూర్ ముకద్దమ్ ను అత్యంత కిరాతకంగా చంపేశారు. కాల్పులు జరిపిన తరువాత ఆమెను పొడిచి, పదునైన ఆయుధంతో నరికి చంపినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో మరో వ్యక్తి గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ఇస్లామాబాద్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ సీఈఓ కుమారుడు జహీర్ జాఫర్ ఆమెను చంపాడని పోలీసులు తెలిపారు. నిందితుడితో నూర్ బ్రేకప్ చెప్పినందుకే చంపేశాడని పోలీసులు వెల్లడించారు. నూర్ మంగళవారం జాఫర్ ఇంటికి వెళ్ళింది. ఆమె ఉదయం నుండి తన తండ్రితో టచ్ లో లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న జహీర్ మాదకద్రవ్యాలకు బానిస అని, మానసిక సమస్యలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనను పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి జాహిద్ హఫీజ్ చౌదరి ఖండిస్తూ ఆమె మృతికి సంతాపం తెలిపారు. సీనియర్ సహోద్యోగి, పాకిస్తాన్ మాజీ రాయబారి కుమార్తె హత్యకు గురవ్వడంతో తీవ్రంగా కలచివేస్తోందని అన్నారు. ఈ ఘోర నేరానికి పాల్పడిన వ్యక్తికి తగిన శిక్ష పడుతుందని నేను నమ్ముతున్నాను జాహిద్ హఫీజ్ చౌదరి ట్విట్టర్‌లో రాశారు. #JusticeForNoor అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.

ఇక కొన్ని రోజుల క్రితమే పాక్‌లోని అఫ్గాన్ దౌత్యవేత్తగా పనిచేసిన నజిబుల్లా అలిఖిల్ కుమార్తె సిల్‌సిలా అలిఖిల్‌ను ఇస్లామాబాద్‌లో దుండగులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన సిల్‌సిలా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పాక్ లో వరుస దారుణాలు చోటు చేసుకొంటూ ఉన్నా.. ఆ దేశ ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి చలనం లేదని ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు.
