More

    జస్టిస్ ఫర్ జాహ్నవి.. లేఖ రాసిన సీఎం జగన్

    అమెరికా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనలో సియాటిల్ నగరానికి చెందిన పోలీసు అధికారి ఆమె విలువ చాలా తక్కువ అంటూ చులకనగా మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ప్రవాస భారతీయులు ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషుల ప్రాణాలకు విలువలేదని భావించే పోలీసులు ఎంతో మంది అమెరికా పోలీసు డిపార్ట్మెంట్ లో ఉన్నారంటూ పలువురు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికీ జాత్యహంకారం అంటూ పలువురు పోలీసుల తీరును ఖండిస్తూ ఉన్నారు.

    ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దృశ్యాలపై వెంటనే దర్యాప్తు జరపాలని అమెరికాను కోరింది. ఈ మేరకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం ట్వీట్ చేసింది. ‘జాహ్నవి కందుల మృతి కేసు విచారణలో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన కథనాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. సియాటిల్‌, వాషింగ్టన్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశాం.’ అని దౌత్యకార్యాలయం ప్రకటనలో తెలిపింది. భారత్‌ అభ్యర్థనపై అమెరికా ప్రభుత్వం స్పందించింది. జాహ్నవి మృతి కేసులో త్వరితగతిన పారదర్శక విచారణ జరుపుతామని వెల్లడించింది.

    కర్నూలు జిల్లా ఆదోని ఎంఐజీ కాలనీకి చెందిన 23 సంవత్సరాల కందుల జాహ్నవి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల నిమిత్తం 2021లో అమెరికా వెళ్లింది. ఈ ఏడాది జనవరి 23న కళాశాలకు వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఆమెను ఢీకొనడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సియాటిల్‌ నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి జోకులు వేసుకుంటూ నవ్వుతూ మాట్లాడారు. ఆ మాటలన్నీ బాడీ కెమెరాలో రికార్డయ్యాయి. తాజాగా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అమెరికాలో ఇతర జాతీయుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారనడానికి ఈ వీడియోనే నిదర్శనమని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.

    ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కందుల జాహ్నవి మృతి వ్యవహారం, తదనంతర పరిణామాలపై దృష్టి సారించాలంటూ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కు లేఖ రాశారు. ఈ అంశంలో కేంద్రమంత్రి ఎస్.జై శంకర్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని, జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని సీఎం జగన్ కోరారు. ఆ వీడియోలో సదరు పోలీసు అధికారి విద్యార్థిని జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడాడని సీఎం జగన్ తన లేఖలో తెలిపారు. ఓ నాన్ అమెరికన్ పట్ల ఆ అధికారి అమానవీయ ధోరణిని అందరూ ఖండించాలని, తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్రం తరఫున ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్ కోరారు. ఈ చర్యలు అమెరికాలో ఉన్న భారతీయుల్లో ధైర్యం పెంపొందించేలా ఉండాలని సూచించారు. అమెరికాలో సంబంధిత అధికారులతో దీనిపై చర్చించి, కందుల జాహ్నవి మృతి వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

    Related Stories