More

  తెలంగాణ పోలీసులపై తీవ్ర ఆగ్రహం.. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు పోరాడుతాం: జేపీ నడ్డా

  రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ మంగళవారం నాడు బీజేపీ శ్రేణులు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ తలపెట్టాయి. ఈ ర్యాలీలో పాల్గొనాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భావించారు. అయితే ఆయన్ను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే, పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీనిపై నడ్డా స్పందిస్తూ, తనను జాయింట్ సీపీ కార్తికేయ కలిశారని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్పారని వివరించారు. అయితే తాము కరోనా నిబంధనలు పాటిస్తామని స్పష్టం చేశారు. తన ప్రజాస్వామ్య హక్కును ఎవరూ అడ్డుకోలేరని, కరోనా మార్గదర్శకాలు పాటిస్తూనే గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తామని అన్నారు.

  సంజయ్‌ అరెస్టుకు నిరసనగా మంగళవారం సాయంత్రం ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్‌ వరకు తాను స్వయంగా ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ మౌన ప్రదర్శన, కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటానని, అరెస్ట్‌కు కూడా భయపడేది లేదని నడ్డా సోమవారం ఢిల్లీలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే..! హైదరాబాద్ కు వచ్చాక తెలంగాణ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు.

  మీడియాతో జేపీ నడ్డా మాట్లాడుతూ, తనను జాయింట్‌ సీపీ కలిశారని.. తెలంగాణలో ర్యాలీలు నిషేధిస్తూ జీవో ఉందని చెప్పారన్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తామని.. ప్రజాస్వామ్య పద్దతిలోనే నిరసన తెలుపుతామని నడ్డా పేర్కొన్నారు. బాధ్యత గల పౌరుడిగా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తానని తెలిపారు. పార్టీ నేతలతో కలిసి నడ్డా ఎంజీ రోడ్డుకు చేరుకున్నారు. సికింద్రాబాద్‌లో మాజీ మేయర్, బీజేపీ నేత బండా కార్తీకరెడ్డి ఇతర నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకున్నారు. చేతుల్లో నల్లజెండాలు ధరించి, నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. సంజయ్‌ను విడుదల చేయాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. సికింద్రాబాద్‌ చేరుకున్న జేపీ నడ్డా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ విగ్రహం నుంచి ఎంజీరోడ్డు మీదుగా బాంబే హోటల్‌ వరకు ర్యాలీ సాగింది. నడ్డా కారులోనే ఉండి ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు క్యాండిల్స్‌ చేత పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.

  ఆ తర్వాతా ఆయన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా జీవో 317 తీసుకువచ్చారని, ఆ జీవోకి వ్యతిరేకంగా బండి సంజయ్ శాంతియుతంగా నిరసన తెలిపారని వెల్లడించారు. అయితే పోలీసులు దురుసుగా వ్యవహరించి, బండి సంజయ్ జాగరణ దీక్షను భగ్నం చేశారని జేపీ నడ్డా ఆరోపించారు. మాది క్రమశిక్షణ గల పార్టీ. కరోనా నిబంధనలు పాటిస్తూ నిరసన తెలిపాం. నన్ను ఎయిర్‌పోర్ట్‌ దగ్గరే అడ్డుకున్నారు. కరోనా నిబంధనలు ఉన్నాయంటూ పోలీసులు చెప్పారు. నిబంధనలు పాటిస్తూనే గాంధీజీకి నివాళులర్పిస్తానని పోలీసులకు చెప్పాను. రెండు రోజులుగా జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయి. తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతోంది. తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందని జేపీ నడ్డా మండిపడ్డారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటముల తర్వాత కేసీఆర్ కు మతిభ్రమించినట్టుందని విమర్శించారు. అవివేకంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిమయం అయిందని, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నాక కొద్దిసేపు ఆయన పార్టీ నేతలతో మాట్లాడారు. ఘట్‌కేసర్‌ సమీపంలోని తారామతిపేట గ్రామంలోని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి గెస్ట్‌హౌస్‌కు రాత్రి బస నిమిత్తం వెళ్లారు. బుధవారం నుంచి మూడురోజుల పాటు అన్నోజిగూడలో జరిగే ఆరెస్సెస్‌ అఖిల భారత కార్యకారణి సమావేశాల్లో నడ్డా పాల్గొంటారు.

  Trending Stories

  Related Stories