More

    గుట్కా ముఠా వ్యవహారాన్ని బయటపెట్టిన జర్నలిస్టు దారుణ హత్య..!

    గుట్కా మాఫియా ఓ జర్నలిస్టును కిరాకతంగా హత్య చేసింది. అక్రమ కార్యకలాపాలను ప్రసారం చేయించడంతో కర్నూలు జిల్లా నంద్యాలలో జర్నలిస్ట్ హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసి జర్నలిస్ట్‌ కేశవను హత్య చేశారు దుండగులు. కేశవ ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. అతడి కథనాల కారణంగా ఇటీవల సస్పెండ్‌ అయిన కానిస్టేబుల్‌ హత్య చేయించాడని కేశవ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో జర్నలిస్టుగా ఓ యూట్యూబ్ ఛానల్‌లో కేశవ పని చేస్తున్నాడు. నంద్యాలకు చెందిన కానిస్టేబుల్ సుబ్బయ్య దురాగతాల పై తన యూట్యూబ్ ఛానల్ లో వార్త రాశాడు. నంద్యాల టూ టౌన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుబ్బయ్యకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని ఆధారంగానే తనను ఇటీవల ఎస్పి సస్పెండ్ చేయడంతో కేశవపై కానిస్టేబుల్ సుబ్బయ్య కక్ష కట్టాడు. ఎస్పీ సస్పెండ్ చేయడానికి కేశవ అందించిన కథనాలేనన్న కేశవను హత్య చేయించారని కేశవ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

    హత్య జరిగిన రోజు కేశవ తోటి రిపోర్టర్‌ ప్రతాప్‌తో కలిసి ఎన్జీవోస్‌ కాలనీకి వెళ్లాడు. అక్కడ కేశవతో ప్రత్యేకంగా మాట్లాడాలని సుబ్బయ్య, అతడి తమ్ముడు నాని గదిలోకి తీసుకెళ్లారు. కొద్ది నిమిషాలకే ఆ గదిలోంచి గట్టిగా కేకలు వినిపించటంతో ప్రతాప్‌ వెళ్లాడు. అక్కడ తీవ్రగాయాలతో ఉన్న కేశవను ఆటోలో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. అప్పటికే కేశవ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పదునైన ఆయుధంతో కేశవ వీపు వెనుకభాగంలో తీవ్రంగా పొడిచినట్లు వైద్యులు తెలిపారు.

    Image
    జర్నలిస్ట్‌ కేశవ

    కేశవ్ హత్య ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యారు. జర్నలిస్ట్ హత్యోదంతంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. హత్యకు పాల్పడిన నింధితులను తక్షణమే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. సస్పెండ్ అయిన కానిస్టేబుల్‌తో పాటు జర్నలిస్ట్ కేశవ్ హత్యతో ప్రమేయం ఉన్న అందరినిపైనా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ముద్దాయిలను అరెస్టు చేసి , కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు. కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి హత్య స్థలాన్ని పరిశీలించి కుటుంబీకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేశవను కానిస్టేబుల్ సుబ్బయ్య హత్య చేశాడని ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎస్పీకి తెలిపారు. కేశవ హత్య కేసుకు సంబంధించి కానిస్టేబుల్ సుబ్బయ్య, అతని సోదరుడు నానిలపై హత్య కేసులు నమోదయ్యాయి. హత్య చేసిన వెంటనే ఇద్దరు కూడా పారిపోయారు వారి కోసం ప్రత్యేకంగా రెండు టీములు గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. జర్నలిస్ట్ కేశవ దారుణ హత్యను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

    Related Stories