జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ 2023 తర్వాత కనిపించకుండా పోతోంది. ఈ ఉత్పత్తిని 2023లో నిలిపివేయాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. దీని స్థానంలో కార్న్ స్టార్చ్ తో చేసిన పౌడర్ ను ప్రవేశపెట్టనుంది. జాన్సన్ అండ్ జాన్సన్ అమ్ముతున్న బేబీ టాల్కమ్ పౌడర్ కారణంగా వేలాది కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందులోని అస్బెస్టాస్ ఓవేరియన్ కేన్సర్ కు దారితీస్తున్నట్టు పలువురు మహిళలు కోర్టు మెట్లెక్కారు. దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన స్వతంత్ర దర్యాప్తులో తమ ఉత్పత్తి సురక్షితమేనని వైద్య నిపుణులు తేల్చినట్టు జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించింది. అయితే బేబీ పౌడర్ ఉత్పత్తుల తయారీకి కార్న్ స్టార్చ్ కు మారాలని నిర్ణయించినట్టు జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో కార్న్ స్టార్చ్ పౌడర్ ను విక్రయిస్తున్నట్టు పేర్కొంది. ఇప్పటికే జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్ ను 2020లోనే అమెరికా, కెనడాలో నిలిపివేసింది.
“ప్రపంచవ్యాప్త పోర్ట్‌ఫోలియో అంచనాలో భాగంగా, మేము అన్ని కార్న్‌స్టార్చ్-ఆధారిత బేబీ పౌడర్ పోర్ట్‌ఫోలియోకు మారడానికి నిర్ణయం తీసుకున్నాము,” అని కంపెనీ పేర్కొంది. కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో విక్రయించబడుతోంది. 2020లో J&J తన టాల్క్ బేబీ పౌడర్‌ను యునైటెడ్ స్టేట్స్, కెనడాలో విక్రయించడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున సదరు కంపెనీపై విమర్శలు ఎదురయ్యాయి. సదరు కంపెనీ సుమారు 38,000 వ్యాజ్యాలను ఎదుర్కొంటుంది.