More

    ఐసిస్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన అమెరికా.. వెంటాడి చంపబోతున్నాం

    కాబూల్ విమానాశ్రయం బయట జరిగిన వరుస ఉగ్రపేలుళ్లపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఘటనలకు ప్రతీకారం తప్పకుండా ఉంటుందని అన్నారు. ఈ ఆత్మాహుతి దాడిలో మరణించిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించిన ఆయన.. ప్రతీకారం తీసుకుంటామని హెచ్చరించారు. పేలుళ్ల కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను వెంటాడి మరీ మట్టుబెడతామన్నారు. ఐసిస్ నేతలను హతమార్చాలని బలగాలను ఆదేశించారు. తమ మిషన్ కొనసాగుతుందని, ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ పౌరులను తరలిస్తామని బైడెన్ స్పష్టం చేశారు. కాబూల్ విమానాశ్రయం బయట జరిగిన ఉగ్రదాడిలో తాలిబాన్లు, ఐసిస్ కుట్ర ఉన్నట్టు ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని బైడెన్ పేర్కొన్నారు. తాము ప్రమాదకర మిషన్‌ను కొనసాగిస్తున్నామని, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అమెరికా తన ప్రాణాలను పణంగా పెడుతోందన్నారు. ఈ నెల 31న గడువు తేదీ నాటికి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటామని బైడెన్ తెలిపారు.

    కాబూల్‌లో ఈ ఘోరమైన దాడులు చేయడంలో ఉగ్రవాద సంస్థ ఐసిస్, తాలిబాన్ల మధ్య కుట్ర ఉందని సూచించడానికి ఎలాంటి ఆధారాలు లేవని జో బిడెన్ చెబుతూ తాలిబాన్లకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ దాడిలో తాలిబాన్లు, ఐసిస్ కుట్ర ఉన్నట్టు ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని.. ఫీల్డ్‌లోని కమాండర్‌లు కూడా ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారని బిడెన్ వైట్ హౌస్ నుండి ఇచ్చిన ప్రసంగంలో తెలిపారు. కాబూల్‌లో పరిస్థితి గురించి తెలుసుకుంటూ ఉన్నామని.. ఉగ్రవాద దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ ఐసిస్-కె యొక్క ఆస్తులు, నాయకత్వం, స్థావరాలను యుఎస్ లక్ష్యంగా చేసుకుంటుందని బిడెన్ చెప్పారు.

    కాబూల్‌లోని ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద జ‌రిగిన బాంబు పేలుళ్ల‌లో 28 మంది తాలిబాన్లు మృతిచెందిన‌ట్లు అధికారులు తెలిపారు. బాంబు పేలుళ్ల వ‌ల్ల అమెరిక‌న్ల క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో త‌మ‌వారిని కోల్పోయిన‌ట్లు తాలిబాన్లు స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్ట్‌పై దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో అమెరికా త‌న ఆగ‌స్టు 31వ డెడ్‌లైన్‌ను పొడించాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా ఓ తాలిబాన్ అధికారి తెలిపారు. కాబూల్‌లో జ‌రిగిన పేలుళ్ల‌లో మరణించిన వారిలో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. పేలుళ్ల‌కు తామే బాధ్యుల‌మ‌ని ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్ర సంస్థ ప్ర‌క‌టించింది. ఐసిస్‌ గ్రూప్‌ కాబూల్‌ విమానాశ్రయంపై దాడులకు పాల్పడవచ్చని తాము ముందుగానే అనుమానించామని, ఇదే విషయాన్ని అమెరికాకు కూడా చెప్పామని తాలిబాన్లు ఓ ప్రకటనలో తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతం అమెరికా దళాల ఆధీనంలో ఉన్నట్టు తాలిబాన్లు తెలిపారు.

    Related Stories