ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. ఈ పాపంలో అగ్రరాజ్యం అమెరికాదే ప్రధాన పాత్ర అనే నిందలు కూడా మోపబడ్డాయి. అక్కడి పరిస్థితులపై తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పని ఇంకేమీ మిగిలి ఉండలేదని చేతులు దులిపేసుకున్నారు జై బైడెన్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైందేనని.. ఈ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనికులను రప్పించడానికి సరైన సమయం అంటూ లేదని, 20 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని గ్రహించామని.. కానీ అనుకున్నదానికంటే వేగంగా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొట్టారని తెలిపారు. తన ముందు రెండు మార్గాలు ఉన్నాయని, ఈ ఏడాది అమెరికా దళాలను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి రప్పించడం లేదా మరిన్ని సైనిక దళాలను ఆఫ్ఘనిస్తాన్ కు పంపి మూడో దశాబ్దంలో కూడా యుద్ధాన్ని కొనసాగించడమే అని అన్నారు. అయితే గతంలో చేసిన తప్పులను తాను చేయకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం అమెరికాకు సరైందన్నారు.
అమెరికాపై ఉగ్రదాడులను నిరోధించడమే మా లక్ష్యమని.. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా బలగాలను ఇంకా ఉంచాల్సిందని చెబుతున్న వారిని నేను ఒకే ప్రశ్న అడగదలుచుకున్నానని.. ఆఫ్ఘనిస్తాన్ సైనికులే వారి సొంత దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధంలో పోరాడడం లేదు. అలాంటి యుద్ధంలో పోరాడడానికి ఇంకా ఎన్ని తరాల అమెరికన్ల బిడ్డలను పంపాలని అన్నారు. అమెరికా ప్రజలపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర పరిస్థితులు ఉంటాయని బైడెన్ హెచ్చరించారు. అమెరికా చేస్తున్న సుదీర్ఘ యుద్ధంలో తాను నాలుగో అధ్యక్షుడినని, అయితే ఈ బలగాల ఉపసంహరణ పనిని ఐదో అధ్యక్షుడికి బదిలీ చేయదలుచుకోలేనన్నారు. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ సంబంధాలను నిర్మూలించడాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు బైడెన్ తెలిపారు. అంతేకాని ఆఫ్ఘన్ జాతి నిర్మాణం చేయడం తమ లక్ష్యం కాదన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు నిష్క్రమించినప్పటికీ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. అమెరికా దళాలకు సహాయం చేసిన స్థానిక ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను త్వరలోనే అమెరికాకు తరలిస్తామని, వారిపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాబుల్ విమానాశ్రయంలో ఘటనలు తనను కలచివేశాయని జో బైడెన్ అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ సైనికులకు అన్ని రకాల వనరులు కల్పించి శిక్షణ ఇచ్చినప్పటికీ వారు తాలిబన్లతో పోరాడలేకపోయారని.. ఆఫ్ఘనిస్తాన్ పౌర ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి అన్ని అవకాశాలు ఇచ్చామని, అయితే వారికి సంకల్పం బలం మాత్రం ఇవ్వలేకపోయామని బైడెన్ అన్నారు. అఫ్గాన్ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు బిలియన్ డాలర్లను అందించామని.. ఈ విషయంలో చైనా, రష్యా ఏం చేయలేకపోయాయన్నారు. అమెరికా దళాలు, సిబ్బందిపై తాలిబన్లు దాడులు చేస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం ఇక ఏమాత్రం అమెరికా జాతీయ భద్రతాంశం కాదన్నారు. వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామన్నారు.