విపరీతమైన వాయు శబ్ద కాలుష్యం వెదజల్లడమే దాని నైజం. ప్రజల్ని అనారోగ్యం పాలు చేయడమే దాని లక్షణం. అంతేనా.. తన ధరను పెంచుకుంటూ పోతూ.. ప్రభుత్వాలను, ప్రజల్ని ఇబ్బంది పెడుతూవుంటుంది. దేశాల ఆర్థిక వ్యవస్థల్ని సైతం అతలాకుతలం చేస్తుంది. అది ఏమిటని ఆలోచిస్తున్నారా..? ఎస్.. మీరు ఊహించింది నిజమే..! అదే ఇంధనం. పెట్రోల్, డీజిల్.. రూపమేదైనా ఇవి లేనిదే బతుకు బండి నడవడం కష్టం. కానీ, ఇవే ఇప్పుడు ప్రభుత్వాలకు పెనుభారంగా మారాయి. తరుగుతున్న వనరులు, పెరుగుతున్న ధరలతో ఏటేటా పెట్రోల్ పెనుభారంగా మారుతోంది. దీంతో అభివృద్ధి చెందిన దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లవైపు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు అమెరికా సైతం ఆ దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అమెరికాలో కాలుష్యం పెరిగిపోతుండటం.. ప్రజలు అనారోగ్యం బారిన పడుతుండటంతో.. అధ్యక్షుడు జో బైడెన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకంపై డెడ్ లైన్ విధించారు. 2035 నాటికి పెట్రోల్, డీజిల్ వాహనాల అమ్మకాలను ముగించాలని తయారీ సంస్థలకు అల్టిమేటం జారీ చేశారు. ఎలక్ట్రికల్ వాహనాల తయారీ పుంజుకుంటున్న నేపథ్యంలో.. రాబోయే పది, పదిహేనేళ్లలో పెట్రోల్, డీజిల్ వాహనాల అమ్మకాలు నిలిపివేయాలని కోరారు. ఈ క్రమంలో వాహనాల అమ్మకాల నిలిపివేతపై తయారీ సంస్థలకు బైడెన్‌కు లేఖ రాశారు. ప్రపంచదేశాలన్ని ప్రస్తుతం పర్యావరణంపై దృష్టి సారించాయి. పొల్యూషన్‌ను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ కార్ల తయారీపై మొగ్గు చూపుతున్నాయి. రానున్న పదేళ్లలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఊహించని స్థాయికి చేరుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంధనంతో నడిచే కార్లను నిషేధిస్తూ ఎంతో మేలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అటు, భారత్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల దిశగా తన పయనం మొదలు పెట్టింది. మోదీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలను ప్రోత్సహిస్తోంది. నిజానికి, మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించే విధంగా చర్యలు ప్రారంభించారు. పలు అంతర్జాతీయ వేదికల్లో సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఇప్పుడు దేశంలో ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు సైతం ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. దీంతో మేకిన్ ఇండియాలో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ బైకులు, కార్ల తయారీని వేగవంతం చేశాయి. అటు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టిసారించాయి. తాజాగా టాటా కంపెనీ భారత్ లో తొలి విద్యుత్ కారును విడుదల చేసింది. టాటా గ్రూప్ లోని ప్రముఖ వాహన తయారీ సంస్థ జాగ్వర్ ల్యాండ్ రోవర్ భారత్‌లో తొలి విద్యుత్తు కారును విడుదల చేసింది. ఎస్‌యూవీ జాగ్వార్ ఐ-పేస్‌ను పూర్తిస్థాయి విద్యుత్తు కారుగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.
మోదీ ప్రభుత్వం ఓవైపు ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహిస్తూనే.. మరోవైపు పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటోంది. న్యూ వెహికిల్ పాలసీలో భాగంగా కఠిన నిబంధనలు అమలు చేస్తూ.. పాత వాహనాలను స్క్రాపేజీకి పంపేలా చర్యలు చేపట్టంది. ఇందులో భాగంగా పదిహేనేళ్లు దాటిన వాహనాలపై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇలా మెల్లమెల్లగా పెట్రోల్, డీజిల్ వాహనాలను తగ్గించి.. కాలుష్య రహిత ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజలను ప్రోత్సహిస్తోంది.