దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కనిపించాయి. క్యాంపస్‌లోని రెండు, మూడు అంతస్థుల్లో ఉన్న స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ విభాగం గోడలు, పలువురు ఫ్యాకల్టీ గదుల డోర్లపై కొందరు అభ్యంతరకరమైన రాతలు రాశారు. ఈ గ్రాఫిటీ వివాదంపై జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పరిపాలన విభాగం విచారణకు ఆదేశించింది. గురువారం నాడు, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లోని గోడలపై స్ప్రే చేసిన “గో బ్యాక్ టు శాఖ” అని పేర్కొంటూ కొంతమంది అధ్యాపకుల తలుపులపై గ్రాఫిటీ స్ప్రే చేసినట్లు అడ్మినిస్ట్రేషన్ గమనించింది. బ్రాహ్మణులు క్యాంపస్ ను విడిచి వెళ్లాలని, బ్రాహ్మణ్-బనియా తమ కోసం వస్తున్నామని రాశారు. ప్రతీకారం తీర్చుకుంటామని.. బ్రాహ్మిన్ భారత్ చోడో వంటి నినాదాలను రాశారు.
వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ శాంతి శ్రీ డీ పండిట్ దర్యాప్తునకు ఆదేశించారు. బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. డీన్, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, గ్రీవెన్స్ కమిటీ విచారణ జరిపి నివేదికను వైస్ ఛాన్సలర్‌కు సమర్పించాల్సిందిగా కోరినట్లు తాత్కాలిక రిజిస్ట్రార్ గురువారం సాయంత్రం నోటీసు జారీ చేశారు. SIS, JNUలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గోడలు, ఫ్యాకల్టీ గదులపై ఇలాంటి రాతలు రాసిన సంఘటనను వైస్-ఛాన్సలర్ తీవ్రంగా పరిగణించారు. క్యాంపస్‌లో ఈ ప్రత్యేక ధోరణులను సహించమని స్పష్టం చేశారు. జేఎన్‌యూ అందరికీ చెందినదని.. ఇలాంటి ఘటనలను సహించబోమని నోటీసులో పేర్కొంది.