National

జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్ ను కూల్చేసిన భారత సైన్యం.. అందులో ఏమున్నాయంటే..!

జమ్మూ కాశ్మీర్ లో ఇటీవలి కాలంలో డ్రోన్ల టెన్షన్ ఎక్కువైన సంగతి తెలిసిందే..! చాలా ప్రాంతాల్లో డ్రోన్లు కనిపిస్తూ ఉన్నాయి. భద్రతా దళాలు కూడా ఎంతో అప్రమత్తమై ఉన్నాయి. పాక్ భూభాగం నుండి ఈ డ్రోన్లను పంపుతూ ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. కొద్దిసేపు కనిపించడం.. భద్రతా బలగాలు కాల్పులకు దిగడంతో వచ్చిన ప్రాంతానికే వెళ్లిపోవడం ఇటీవలి కాలంలో చాలా సార్లు చోటు చేసుకుంది. తాజాగా ఓ డ్రోన్ మరోసారి కలకలం సృష్టించింది. అయితే ఈ డ్రోన్ ను భారత సైన్యం కూల్చి వేసింది.

శుక్రవారం తెల్ల‌వారుజామున‌ కనాచక్‌ ప్రాంతంలో డ్రోన్ ఎగురుతూ కనిపించడంతో భద్రతా బలగాలు వాటిని కూల్చి వేశాయి. ఈ డ్రోన్‌లో ఉన్న ఐదు కిలోల పేలుడు పదార్థాలు ఉన్నాయ‌ని, వాటిని స్వాధీనం చేసుకున్నామ‌ని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఐదు కిలోల ఇంప్రొవైజ్డ్ పేలుడు పరికరం (ఐఇడి) తో ప్రయాణిస్తున్న పాకిస్తాన్ డ్రోన్‌ను శుక్రవారం కూల్చి వేశారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఆరు రెక్కల డ్రోన్ ఆరు అడుగుల పొడవు ఉందని.. ఆ డ్రోన్ కు ఐఇడిని పాలిథిన్ తో చుట్టబడిందని తెలుస్తోంది. పేలుడు పదార్థాలను ఉగ్రవాదులు వాడుకోడానికే తరలిస్తున్నట్లు భావిస్తున్నామని అధికారి తెలిపారు. ఉగ్రవాదులకు అప్పగించడానికి ఈ పనికి పాల్పడే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు. పేలుడు పదార్థాలను అక్రమంగా రవాణా చేయడానికి లష్కరే తోయిబా ఈ ఆపరేషన్‌ను ఉపయోగిస్తోన్న విషయాన్ని ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయని ఆ అధికారి తెలిపారు. మరో పోలీసు అధికారి మాట్లాడుతూ ఐఇడికి టైమర్ ఉందని చెప్పారు. డ్రోన్ స్వాధీనం చేసుకున్న ప్రదేశం నుండి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ డ్రోనుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.

గత నెల జూన్ 27న జమ్మూలోని భారత వైమానిక దళం (ఐఎఎఫ్) స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడికి పాల్పడిన సమయం నుండి ఈ ప్రాంతంలో డ్రోన్లు పదేపదే కనిపించాయి. ఆరోజు పేలుడు కారణంగా ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. డ్రోన్ల‌ను రాడార్లు, యాంటీ డ్రోన్‌ సిస్టమ్స్ సాయంతో గుర్తించి భార‌త సైన్యం తిప్పికొడుతోంది. కొన్ని డ్రోన్లు త‌ప్పించుకుని వెన‌క్కి వెళ్లిపోతున్నప్ప‌టికీ కొన్నింటిని మాత్రం భార‌త సైన్యం కూల్చేయ‌గ‌లుగుతోంది. 2019 నుంచి పాక్ భార‌త్‌లోకి డ్రోన్ల ద్వారా పేలుడు ప‌దార్థాలు, డ్ర‌గ్స్ పంపే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదానికి ఆజ్యం పోసేందుకు పాక్ కు చెందిన ఉగ్రవాదులు సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్‌లను ఉపయోగించి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాలు, డబ్బులు వదలడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. 2019 నుండి పాకిస్తాన్ సరిహద్దులో 325 కి పైగా డ్రోన్లు కనిపించాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

three + 4 =

Back to top button