బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్

0
816

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బల పరీక్షలో నెగ్గారు. JMM, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్‌ల అధికార కూటమికి చెందిన పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలతో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధినేత హేమంత్ సోరెన్ సోరెన్ సభకు వచ్చారు. బలపరీక్ష కోసమే ప్రత్యేకంగా ఒక్కరోజు అసెంబ్లీని నిర్వహించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగానే సంక్షోభాన్ని వినియోగించుకుని, అధికార కూటమి ఎమ్మెల్యేలతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ యత్నిస్తోందని సోరెన్‌ ఇంతకు ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. ఈ విశ్వాస పరీక్షలో సోరెన్‌ మెజారిటీ మార్క్‌ సాధించాలంటే 41మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ అయిన జెఎంఎంకి 30 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 18, రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి)కి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీ లో 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న సోరెన్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. ఓటింగ్ కు ముందు బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. సభ్యుల్లో 48 మంది సోరెన్ కు అనుకూలంగా ఓటు వేశారు. 81 మంది సభ్యులున్న సభలో 48 ఓట్లతో అధికార కూటమి తీర్మానం ఆమోదం పొందింది. బలపరీక్షలో నెగ్గిన తర్వాత హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని అన్నారు సోరెన్. తమ ఎమ్మెల్యేలలో చిచ్చు పెట్టి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. ఎన్నికల్లో గెలుపొందేందుకు అల్లర్లను సృష్టిస్తున్నారని అన్నారు. తమ రాష్ట్రంలో యూపీఏ అధికారంలో ఉన్నంత కాలం ఎలాంటి కుట్రలు సాగవని చెప్పారు. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు చేసిన ప్రయత్నం వెనుక అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా ఉన్నారని ఆరోపించారు.