More

  కశ్మీర్ విషయంలో మసూద్ అజర్.. తాలిబాన్లను కలిశాడా..?

  ఆఫ్ఘనిస్తాన్.. తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లడంతో ఎంత ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో వైపు తాలిబాన్లను అడ్డం పెట్టుకుని పాక్ ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంది. జైష్-ఇ-ముహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఆగస్టు మూడో వారంలో కాందహార్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ తాలిబాన్లతో సమావేశం జరిపినట్లు మీడియా సంస్థలు కథనాల వెలువరించాయి. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడంలో మద్దతు కోసం తాలిబాన్‌లను మసూద్ అజార్ కలిసినట్లు తెలుస్తోంది. మౌలానా మసూద్ అజార్ తాలిబాన్ రాజకీయ కమిటీ అధిపతి ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌తో సహా పలువురు తాలిబాన్ నాయకులను కలిసినట్లు నివేదిక తెలిపింది. కశ్మీర్ లోయలో అశాంతిని రేకెత్తించడానికి, భారత కేంద్రపాలిత ప్రాంతంలో జైష్-ఇ-ముహమ్మద్ కార్యకలాపాల కోసం మసూద్ అజార్ తాలిబాన్ల సహాయం కోరినట్లు సమాచారం. ఆగస్టు 15 న తాలిబాన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత.. అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్ వారి నియంత్రణలోకి రావడాన్ని మసూద్ అజార్ తాలిబాన్ “విజయం” గా అభివర్ణించి.. తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని తెలియజేశాడు. తీవ్రవాద బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తాడు.

  తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లోని మార్కాజ్ (ప్రధాన కార్యాలయం) వద్ద జెఎమ్ కార్యకర్తలు సంబరాలు కూడా చేసుకున్నారు. తాలిబాన్లు, జైష్-ఇ-ముహమ్మద్ ఒకే సిద్ధాంతంతో పని చేస్తున్నాయి. 1999 లో మసూద్ అజార్ జైష్-ఇ-మహమ్మద్ ను స్థాపించి జమ్మూ కశ్మీర్, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో తీవ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ‘IC 814’ ను పాక్ ఉగ్రవాదులు హైజాక్ చేసినప్పుడు అజహర్ భారతీయ జైలులో మగ్గుతున్నాడు. వారు విమానాన్ని తాలిబానీ నియంత్రణలో ఉన్న కాందహార్‌కు తీసుకువెళ్లారు. ఖాట్మండు నుండి లక్నోకు వెళ్తుండగా హైజాక్ అయినప్పుడు విమానంలో ఉన్న ప్రయాణీకుల భద్రతకు బదులుగా మసూద్ అజార్ మరియు ఇతర ఉగ్రవాదులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేసిన ఘటనను భారతీయులు ఎప్పటికీ మరచిపోలేరు.

  ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి రావడం భారతీయ భద్రతా నిపుణులలో ఆందోళనను రేకెత్తించింది. పొరుగు దేశంలో తమ సైద్ధాంతిక ప్రతిరూపం పెరగడం వల్ల జెఎమ్ మరియు ఇతర పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. తమ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించడానికి అనుమతించబోమని తాలిబాన్లు ఇప్పటికే చెప్పినా.. నమ్మడానికి వీలు లేదని రక్షణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.

  Trending Stories

  Related Stories