ఆంధ్రప్రదేశ్ లో గడచిన పంచాయితీ ఎన్నికల ఫలితాల మాట ఎలా ఉన్నా తక్కువ అంచనాలతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది జనసేన. మీడియాలో వచ్చే కథనాలతో సంబంధం లేకుండా క్యాడర్ కష్టానికి గ్రామాల్లో తగ్గ ఫలితమే వచ్చింది. దీనిపై జనసేనాని కూడా సంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా ఫోకస్ చేస్తే… రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నాటికి జనసేన మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే గతంలో జనసేనను వీడిన మాజీ ఐపీఎస్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు.. జనసేనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జేడీ లక్ష్మీనారాయణ.. పంచాయతీ ఎన్నికల్లో జనసేన సాధించిన ఫలితాల పట్ల పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు… మళ్లీ జనసేనలోకి వెళతారా అన్న ప్రశ్నకు కూడా ఆయన నుంచి ఆసక్తికరమైన సమాధానం వచ్చింది.
పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే మళ్లీ జనసేనలోకి వెళతానని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. తమ పార్టీని వీడిన నేత.. మళ్లీ తమ పార్టీలోకి వస్తానని ప్రకటించడం జనసేనకు కలిసొచ్చే అంశం. ఇక గతేడాది జనవరిలో పవన్ కళ్యాణ్‌తో విభేదించి జనసేన నుంచి బయటకు వచ్చేశారు లక్ష్మీనారాయణ. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ విధి విధానాలు నచ్చకనే రాజీనామా చేస్తున్నట్టు అప్పట్లో వెల్లడించారు. పూర్తి జీవితం రాజకీయాలకే అని చెప్పిన పవన్.. తిరిగి సినిమాల్లో నటిస్తుండడం చూస్తుంటే .. ఆయనలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోందని జనసేనకు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అందుకే జనసేన పార్టీ నుండి నిష్క్రమించాలని అనుకుంటున్నానని అన్నారు. అయితే అదంతా గతం.. ఇప్పుడు మనసు మారిందేమో జేడీ మాట తీరుకూడా మారిందంటున్నారు.
అయినా ఇవి రాజకీయాలాయే.. కాస్త సమీకరణాలు అటు ఇటుగా మారినప్పుడల్లా నేతల అభిప్రాయాల్లో మార్పులు కద్దు.
అయితే పార్టీలో కార్యకర్తలు మాత్రం దీనికి ఒప్పుకునేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాన్ పై, జనసేన పార్టీపై అనవసర నిందలు మోపడమే కారణమని వారి మాట.
ఈ నేపథ్యంలో మళ్లీ జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించిన లక్ష్మీనారాయణను.. పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానిస్తారా లేక ఆయనను లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి.