జేసీ దివాకర్ రెడ్డి.. పరిచయం అక్కరలేని రాజకీయ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన జేసీ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడానికి హైదరాబాదులోని ప్రగతి భవన్ కు వచ్చిన జేసీకి చేదు అనుభవం ఎదురైంది. అపాయింట్ మెంట్ లేకుండా లోపలకు పంపించమని అక్కడున్న సెక్యూరిటీ అధికారులు ఆయనను ఆపేసారు. కేసీఆర్ ను కాకపోయినా మంత్రి కేటీఆర్ ను కలుస్తానని ఆయన అడిగారు. దానికి కూడా అధికారులు ఒప్పుకోలేదు. అనుమతి ఉంటేనే లోపలకు పంపిస్తామని చెప్పారు.
దీంతో సెక్యూరిటీ అధికారులతో జేసీ వాగ్వాదానికి దిగారు. తనకు అపాయింట్ మెంట్ ఇచ్చేదేమిటని ఆయన ప్రశ్నించారు. తాను లోపలకు వెళతానని వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ ముందస్తు అపాయింట్ మెంట్ లేకుండా లోపలకు పంపలేమని అధికారులు ఆయనకు స్పష్టం చేశారు. అయినా ప్రగతి భవన్ లోకి దూసుకువెళ్లేందుకు జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నించారు. ప్రగతి భవన్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు జేసీ దివాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అక్కడి నుండి ప్రత్యేక వాహనంలో జేసీ దివాకర్ రెడ్డిని ఆయన నివాసానికి తరలించారు.