More

  శశికళ ఇంత పనిచేసిందా..? జయలలిత మరణంపై సంచలన నివేదిక..!

  తమిళ రాజకీయాల్లో అమ్మగా పేరుగాంచిన జయలలిత మరణం.. అప్పట్లో అన్నాడీఎంకే అభిమానులతో పాటు.. తమిళ ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. ఆమె మరణం ఎంతోమందిని తీవ్రంగా బాధించిచడమే కాదు.. అంతే స్థాయిలో అనుమానాలను కూడా రేకెత్తించింది. తమిళనాట రాజకీయ జీవితాన్ని అప్రతిహతంగా కొనసాగించిన జయలలిత, తన మరణంపై ఎన్నో సందేహాల్ని వదిలి వెళ్ళింది. ఆమె అనారోగ్యంతోనే మృతిచెందిందని అధికారిక ప్రకటన వెలువడినా,.. వైద్యులు గట్టిగా ప్రయత్నించి ఉంటే జయలలిత బతికేదని పలువురు భావిస్తున్నారు. గతంలో అన్నా డీఎంకే మాజీ మంత్రి దిండిగుల్ సి. శ్రీనివాసన్ కూడా జయలలిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. జయలలిత మృతికి శశికళ తో పాటు ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ లే కారణమని ఆరోపణలు గుప్పించారు. ఆమెకు సరైన ఆహారం ఇవ్వకుండా స్లోపాయిజనింగ్ చేసి చంపేశారని ఆరోపించారు. అలా జయలలిత మరణించినా.. ఆమె మృతిపై సందేహాలెన్నో తలెత్తాయి. దీంతో నిజంగా జయలలిత మరణానికి కారకులెవరో తేల్చేందుకు డిఎంకే ప్రభుత్వం ఓ కమిటీ వేసింది.

  అర్ముగస్వామి అధ్యక్షతన ఏర్పడిన కమిటీ జయలలిత సన్నిహితులందరినీ విచారించింది. ఆమె బతికున్నప్పుడు దగ్గరి సంబంధాలు నెరిపిన 159 మందిని కమిటీ విచారించింది. ఇందులో శశికళ, పన్నీర్ సెల్వం కూడా ఉన్నారు. తాజాగా కమిటీ విచారణ పూర్తవడంతో నివేదికను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో కమిటీ జయలలితకు దగ్గరి సంబంధాలున్నవారిపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. శశికళతో పాటు జయలలిత వ్యక్తిగత డాక్టర్ కెఎస్ శివకుమార్, అప్పటి ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌, ఆరోగ్య శాఖ మంత్రి సి.విజయభాస్కర్‌ ల పాత్ర కొంత అనుమానాస్పదంగా ఉందని గుర్తించింది. వీరిపై రాష్ట్రప్రభుత్వం విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికలో జయలలిత మరణానికి ఆమె సన్నిహితుడైన ఓ పన్నీర్ సెల్వం కు ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. జయలలితకు గుండెపోటు రాగానే ఆసుపత్రికి తరలించారని ఆ తర్వాత ఆమెకు చేసిన చికిత్సల గురించి ఓపీఎస్ కు ఏమీ తెలియదని కమిటీ నివేదించింది.

  జయలలిత మరణించే నాటికే ఆమెకు దీర్ఘకాళిక అనారోగ్యసమస్యలు ఉన్నాయి. 2016 సెప్టెంబర్ 22 వ తేదీన ఆమెకు తీవ్రంగా జ్వరంతో పాటు డీహైడ్రేషన్ కు గురైందని హాస్పటల్ లో చేర్పించారు. ఆ తర్వాత నుంచీ జయలలిత మంచానికే పరిమితమైంది. చివరిదశలో వెంటిలేటర్ పై చికిత్స అందించి జయలలిత కోలుకోవడానికి ఆసుపత్రి వర్గాలు తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే ఇక్కడే జయలలిత ఆరోగ్యంపై ఎన్నో అనుమానాలు తలెత్తాయి. ఆమె కోలుకుంటోందని నాటి ఆరోగ్యశాఖ తో పాటు అపోలో ఆసుపత్రి వర్గాలు చెబుతున్నా కూడా ఆమె గురించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ బయటకు రాలేదు. దీంతో శశికలే జయలలితను మెల్లిమెల్లిగా చంపేస్తోందనే విమర్శలు గుప్పుమన్నాయి. ఆమెకు అందాల్సిన వైద్యం సరిగ్గా అందించలేదనే ఆరోపణలు వచ్చాయి. సరైన వైద్య పరీక్షలు చేయించకుండా ఆరోగ్యం పూర్తిగా విషమించేలా చేసినట్టు తెలుస్తోంది. అప్పట్లో తంజావూరు, అరవకురించి బైపోల్ బీఫాంలపై కూడా జయలలిత సంతకం కాకుండా వేలిముద్రలు వేయడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఆమె ఆరోగ్యం అంతబావుంటే కనీసం సంతకం కూడా చేయలేకపోయిందా..? అంటూ పలువురు విమర్శించారు.

  అయితే, జయలలిత మృతిపై ఏర్పాటు చేసిన కమిటీ విషయంలో అధికార డీఎంకేపై ఆరోపణలు వెళ్లవెత్తుతున్నాయి. కేవలం ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు కమిటీని ఏర్పాటు చేశారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

  Trending Stories

  Related Stories