అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్.జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి కొత్త ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారు. 2024 జూన్ వరకు ఆయనకు సర్వీసు ఉంది. అంటే మరో ఏడాదిన్నర పాటు ఆయన సీఎస్ పోస్టులో కొనసాగే అవకాశం ఉంది.
కొత్త సీఎస్ గా నియమితులైన జవహర్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో జవహర్ రెడ్డి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. ఆయన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన కంటే సీనియర్లయిన నీరభ్‌కుమార్ ప్రసాద్ (1987), పూనం మాలకొండయ్య (1988), కరికాల్ వలెవన్ (1989) సీఎస్ పోస్టును ఆశించినా ముఖ్యమంత్రి జగన్ మాత్రం జవహర్ రెడ్డి వైపే మొగ్గు చూపారు.
మరోవైపు ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. సీఎస్ అశకాశం దక్కుతుందని భావించిన పూనం మాలకొండయ్యకు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లో స్పెషల్ సీఎస్ గా నియమితులయ్యారు. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మధుసూదనరెడ్డి, ఆ శాఖ కమిషనర్‌గా రాహుల్ పాండే నియమితులయ్యారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్, రోడ్లు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రద్యుమ్న నియమితులయ్యారు. పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న బుడితి రాజశేఖర్‌ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.