భారత్-ఇంగ్లండ్ సిరీస్ నువ్వా..నేనా.. అన్నట్లుగా సాగుతోంది. అయితే ఓ వ్యక్తి గురించి ఈ సిరీస్ లో తెగ చర్చించుకుంటూ ఉన్నారు. అతడు వేరెవరో కాదు.. యూట్యూబర్ డేనియల్ జార్విస్ అకా ‘జార్వో 69’, లార్డ్స్‌లోనూ, హెడింగ్లే టెస్ట్ మ్యాచ్ సమయంలోనూ జార్విస్ పెద్ద రచ్చనే చేశాడు. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఫీల్డింగ్ చేసే సమయంలో వారితో కలిసిపోవాలని అతడు అనుకున్న ప్లాన్ ను సెక్యూరిటీ అడ్డుకుంది. హెడింగ్లే టెస్ట్ మ్యాచ్ లో అయితే ఏకంగా కోహ్లీ బ్యాటింగ్ కు వచ్చే సమయంలో ప్యాడ్స్, హెల్మెట్ పెట్టుకుని బ్యాటింగ్ కు వచ్చేశాడు. దీంతో ఇకపై గ్రౌండ్ లో అడుగుపెట్టనివ్వకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. భద్రతా ఉల్లంఘన ఆరోపణలపై జీవితకాల నిషేధం విధించబడుతుందని ఇంగ్లీష్ కౌంటీ వర్గాలు శనివారం తెలిపాయి. రెండు సార్లు జార్వో గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యి.. చాలా మందిని ఆకర్షించాడు కానీ యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ దీనిని భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తోంది.
తాను ప్రాంక్ చేయబోతున్నా అంటూ జార్వో యూట్యూబ్ లో కూడా వీడియోలను పోస్ట్ చేశాడు. అందులో తాను ఏమి చేయబోతున్నానో చెబుతూ మొత్తం వివరించాడు. ఈ సంఘటనలను యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ చాలా సీరియస్‌గా తీసుకొని అతనిపై జీవిత కాల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఎప్పటికీ లీడ్స్ గ్యాలరీలోకి జార్విస్ అడుగు పెట్టకుండా నిర్ణయం తీసుకుంది. తాము డేనియల్ జార్విస్‌ను హెడింగ్లేలోకి రాకుండా జీవితకాల నిషేధం విధిస్తున్నాం. జరిమానా కూడా వేస్తామని యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ప్రతినిధి వెల్లడించారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా మైదానం చుట్టూ స్టివార్డ్‌లను ఏర్పాటు చేస్తామని, ఎవరైనా మైదానంలోకి రావడానికి ప్రయత్నిస్తే వీళ్లు అడ్డుకుంటారని అధికారులు వివరించారు. శుక్రవారం నాడు రోహిత్ శర్మ వికెట్ పతనమైన తర్వాత, ‘జార్వో 69’ ఒక వైపున ఉన్న గ్యాలరీ నుండి బ్యాటింగ్ ప్యాడ్‌లు, ఫేస్ మాస్క్ ధరించి నీలిరంగు హెల్మెట్ తో మైదానంలోకి వెళ్ళిపోయాడు. అతను మైదానంలోకి ప్రవేశించడానికి ముందు ఒకరు క్రికెట్ బ్యాట్ కూడా అతడికి అందించారు. గ్రౌండ్ సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకోవడంతో.. అతడిని క్రీజ్ దగ్గర నుండి సెక్యూరిటీ లాక్కొని వచ్చేసింది.