భారతదేశంలో 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్న జపాన్: ప్రధాని మోదీ

0
862

రాబోయే ఐదేళ్లలో జపాన్‌ భారత్‌లో రూ. 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 2014లో నిర్దేశించుకున్న లక్ష్యాలను రెండు దేశాలు సాధించాయని ఆయన అన్నారు. భారత్‌-జపాన్‌ల మధ్య 14వ శిఖరాగ్ర సదస్సు కోసం భారత పర్యటనకు వచ్చిన జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదాతో కలిసి ప్రధాని మోదీ సంయుక్తంగా మీడియా ప్రకటన చేశారు.

“2014లో నిర్దేశించిన 3.5 ట్రిలియన్ యెన్ల పెట్టుబడి లక్ష్యాన్ని అధిగమించినందుకు నేను సంతోషిస్తున్నాను. మా ఆకాంక్షలను సాకారం చేసుకున్నందుకు సంతోషంగా ఉన్నానని” ప్రధాని మోదీ అన్నారు. రాబోయే ఐదేళ్లలో 5 ట్రిలియన్ యెన్ల పెట్టుబడిని అంటే దాదాపు 3.20 లక్షల కోట్ల కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని మోదీ తెలిపారు. “ప్రపంచం ఇప్పటికీ COVID-19 మహమ్మారి దుష్ప్రభావాలతో పోరాడుతోంది. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ ప్రక్రియలో అడ్డంకులు ఉన్నాయి. భౌగోళిక రాజకీయ పరిణామాలు కూడా కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ఈ సందర్భంలో, భారతదేశం, జపాన్ తమ ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతంలోనూ, ప్రపంచంలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది.” అని తెలిపారు.

జపాన్ ప్రధానితో స్నేహపూర్వక సంబంధాలను ప్రధాని మోదీ పంచుకున్నారు. “పీఎం కిషిదా భారతదేశానికి చాలా పాత స్నేహితుడు. జపాన్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో అభిప్రాయాలు పంచుకునే అవకాశం నాకు లభించింది. భారతదేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులలో జపాన్ ఒకటి” అని అన్నారు మోదీ. జపాన్ సహాయంతో ముంబయి-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వేగంగా పూర్తవుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఫ్రైట్ కారిడార్, ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ వంటి ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్‌లలో జపాన్ గణనీయమైన సహకారం అందించిందన్నారు.

సైబర్ సెక్యూరిటీ సహకారంతో సహా ఆరు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారతదేశానికి స్వచ్ఛమైన ఇంధన భాగస్వామ్యం కోసం ఒక స్థిరమైన అభివృద్ధి కార్యక్రమం కూడా ప్రారంభించబడింది. మునుపటి ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ 2018లో టోక్యోలో జరిగింది. 2014లో జపాన్‌ భారత్‌లో 33 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ప్రకటించింది.

అంతకు ముందు ఫుమియో కిషిదా, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులను వెంటనే నిలిపివేయాలని మోదీ, కిషిదా ఓ సంయుక్త ప్రకటన చేశారు. ఉక్రెయిన్ లో హింసకు రష్యా తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ పై రష్యా సేనల దాడులు అంతర్జాతీయ కట్టుబాట్ల మూలాలను కుదిపేశాయని జపాన్ ప్రధాని కిషిద వ్యాఖ్యానించారు. ఏకపక్ష చర్యలతో పరిస్థితులను బలవంతంగా మార్చాలనుకోవడాన్ని తాము అనుమతించబోమని స్పష్టం చేశారు.