సరిగ్గా ఏడాది క్రితం.. కరోనా మహమ్మారి భారత్‌లో అప్పుడప్పుడే కోరలు చాస్తున్న క్షణం. ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తున్న సమయమది. అప్పటికే చైనాతో పాటు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో మరణమృదంగం మోగుతోంది. అప్పటికే కొన్ని నెలలుగా పలు దేశాల్లో కౌంట్ డౌన్ కొనసాగుతంది. జనాభాలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత్ కరోనా మహమ్మారిని ఎలా తట్టుకుంటుందా..? అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. గతేడాది మార్చి మూడోవారంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సైతం సీక్రెట్‌గా లాక్‌డౌన్‌కు ప్రణాళికలు సిద్ధం చేసింది. దానికంటే ముందు అంటే.. గతేడాది మార్చి 21 సాయంత్రం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణ కోసం జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. మార్చి 22 ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంటినుంచి బయటికి రావొద్దని.. స్వీయ నిర్బంధంలో వుండాలని ప్రజలకు విజ్ఙప్తి చేశారు.
ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు యావత్ భారతావని ఇంటికే పరిమితమైంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఇంటి కారిడార్లలోకి.. ప్రజలంతా చప్పట్లు కొట్టారు, ఘంటారావం వినిపించారు. దీపాలు వెలిగించారు. గో కరోనా గో అంటూ నినదించారు. అయితే, అత్యుత్సాహం ప్రదర్శించిన కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీయడం కాస్త వివాదాస్పదమైనప్పటికీ.. జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. కరోనా నియంత్రణకోసం యావత్ భారతావని ఏకతాటిపైకి వచ్చి స్వీయ గృహనిర్బంధం విధించుకోవడం ఆసక్తికరంగా మారింది. సమైక్య భారత నినాదం ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఆ తర్వాత మూడురోజులకు అంటే మార్చి 25న భారత్ లాక్డౌన్లోకి వెళ్లింది.
ఇక, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలిసనవే. కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఆచరించిన ప్రణాళికాబద్ధమైన చర్యలు పెద్ద విపత్తు నుంచి దేశాన్ని గట్టెక్కించాయనంలో సందేహం లేదు. అయితే కొన్ని రాష్ట్రాను కరోనా తీవ్రంగా బాధించింది. అయినా, మెల్లమెల్లగా కరోనా నుంచి దేశం కోలుకోగలిగింది. కానీ, ఇటీవలికాలంలో మళ్లీ కేసులు పెరుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే మహరాష్ట్రలో సెకండ్ వేవ్ నడుస్తోంది. కానీ, ప్రజలు మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అసలు ప్రమాదమే లేనట్టు, కరోనా అంతరించిపోయినట్టు ప్రవర్తిస్తున్నారు. అన్ లాక్ ప్రక్రియతో గత ఏడాది డిసెంబర్ నాటికే జనజీవనం దాదాపు సాధారణ స్థితికి వచ్చింది. ప్రభుత్వాలు కొన్ని కొన్ని పరిమితులతో ప్రజలను నియంత్రించడానికి ప్రయత్నించాయి. అయినా.. మాస్కులు కూడా క్రమంగా మాయమయ్యాయి. కొవిడ్ నిబంధనలు పాటించడంల జనం అలసత్వం ప్రదర్శిస్తుంది. దీంతో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.
కొన్నివారాలుగా కేసుల సంఖ్య లో పెరుగుదల కనిస్తోంది. జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అజాగ్రత్తగా వ్యవహరిస్తే.. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో మనకు కావాల్సింది నాటి జనతా కర్ఫ్యూ స్ఫూర్తి. అదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం వుంది. వ్యాక్సిన్ వచ్చేసింది కదా అని నిర్లక్ష్యం వహిస్తే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.