ప్రస్తుతం మా పొత్తు బీజేపీతోనే అంటూ తేల్చి చెప్పిన పవన్ క‌ల్యాణ్‌

0
1107

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పొత్తులకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ప్ర‌స్తుతం తాము బీజేపీతోనే పొత్తులో ఉన్నామ‌ని తేల్చి చెప్పారు. జనసేన పార్టీ కార్య‌నిర్వాహ‌క స‌భ్యుల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పొత్తుల‌పై క్లారిటీ ఇచ్చేశారు. ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాల్సి వ‌స్తే, ఒంట‌రిగా నిర్ణ‌యం తీసుకోన‌ని, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించిన త‌ర్వాతే ముందుకు వెళ్తాన‌ని హామీ ఇచ్చారు. పొత్తు పెట్టుకోమని ప‌లు పార్టీలు మ‌న‌ల్ని కోరుతాయ‌ని.. తొంద‌ర ప‌డ‌కుండా, క‌న్ఫ్యూజ్ కాకుండా ఉండాల‌న్నారు. రాష్ట్ర ప‌రిస్థితుల దృష్ట్యా ఆయా పార్టీలు మైండ్ గేమ్ ఆడుతుంటాయ‌ని, ఆ మైండ్ గేమ్‌లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పావులు కాకూడ‌ద‌ని ప‌వ‌న్ అన్నారు. పొత్తుల‌పై ఒక్కో మాట మాట్లాడ‌కూడ‌ద‌ని, అంద‌ర‌మూ ఒకే ప‌ల్ల‌విని ఎత్తుకోవాల‌ని కూడా స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చారు. సంస్థాగ‌తంగా ఇప్పుడిప్పుడే బ‌ల‌ప‌డుతున్నామ‌ని, పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకుందామ‌ని ఆయ‌న అన్నారు. ఆవిర్భావ దినోత్స‌వ స‌భ‌లో పొత్తుల విష‌యాన్ని మ‌రింత లోతుగా చ‌ర్చించుకుందామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.

టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇటీవల మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన క‌లిసి బ‌రిలోకి దిగుతాయ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని అన్నారు. ల‌వ్ వ‌న్‌సైడ్ ఉంటే స‌రిపోద‌ని, రెండు వైపులా ఉండాల‌ని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకోవాల‌ని టీడీపీలోని ఓ వ‌ర్గం బ‌లంగా వాదిస్తున్న సంగతి తెలిసిందే..! త‌మ పార్టీ గతంలో ప‌లు పార్టీల‌తో పొత్తులు పెట్టుకుని గెలిచింద‌ని, పొత్తులు లేకుండా కూడా గెలిచింద‌ని చంద్రబాబు ఇటీవల కుప్పం పర్యటనలో భాగంగా అన్నారు. ఒక్కోసారి పొత్తులు పెట్టుకున్న‌ప్ప‌టికీ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని… పొత్తులు అనేవి రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయని తెలిపారు. ప్ర‌స్తుతంలో ఏపీలో నెల‌కొన్న పరిస్థితుల‌ దృష్ట్యా అందరూ కలవాల్సిన అవసరం ఉందని అన్నారు. జగన్ విధ్వంసక పాలన పోవాలంటే ధర్మ పోరాటం చేయాల‌ని.. ఇందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

చంద్రబాబు నాయుడు పొత్తు రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు చేశారు. చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారని, అవసరం వచ్చిన‌ప్పుడు లవ్ చేయడంలో ఆయ‌న దిట్ట అని అన్నారు. ఆ తర్వాత ఆయ‌న‌ ఏం చేస్తారో త‌న నోటితో తాను చెప్పలేనని సోము వీర్రాజు అన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీని కూడా లవ్ చేశారని అన్నారు. లవ్ చేయడం వదిలేయడం ఆయన నైజం.. మామ నుంచి అందరినీ ప్రేమించారన్నారు. 1996లో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పి.. అప్పటి నుంచి అన్ని పార్టీలతో లవ్ చేస్తున్నారని తర్వాత ఆయనేంటో చూపిస్తారన్నారు. జనసేన పార్టీ త‌మ మిత్రపక్షమే అని సోము వీర్రాజు చెప్పారు.