ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా హామీలు నెరవేర్చని ప్రభుత్వం వైసీపీదేనని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. తమ పార్టీని జనసేన కాదు రౌడీసేన అనడం విడ్డూరంగా ఉందన్నారు. విజయనగరం పర్యటనలో భాగంగా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న నాదెండ్ల మనోహర్ కు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాటం చేసింది జనసేన అని, ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు అందజేస్తున్న ఏకైక పార్టీ మాది అని స్పష్టం చేశారు. దమ్ముంటే ప్రజలు ఎవరి వైపు ఉన్నారో పోలీసుల్ని అడ్డంపెట్టుకోకుండా రావాలని సవాల్ విసిరారు. ప్రజలు మీపై తిరగబడే రోజుల దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. మహిళలను కించపరిచడం ఈ ప్రభుత్వం తీరు అని విమర్శించారు. ఇటీవల ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారని, త్వరలోనే రూట్ మ్యాప్ అంశంపై చర్చించామన్నారు. విశాఖ భూములపై జనసేన పార్టీ నాయకులు చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు.