జనసేన అధ్యక్షుడు, జనసేనాని పవన్ కల్యాణ్ అధ్యక్షతన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యుడు నాగబాబు, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో.. ఏపీలో శాంతి, భద్రతలపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలుస్తోంది.
ఇటీవల కాలంలో రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, అమలాపురం అల్లర్లు తదితరాలపై సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నట్లు సమాచారం. వీటితోపాటు పార్టీ బలోపేతం, రాష్ట్రంలో కౌౌలు రైతులకు అండగా నిలుస్తూ పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా కార్యక్రమాలపై చర్చిస్తారని సమాచారం. కాగా.. ఇటీవలే జనసేన కౌలు రైతుల కోసం ఓ యాత్ర నిర్వహించి, ఆత్మహత్యలు చేసుకున్నకౌలు రైతుల కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే. కాగా.. గతంలో పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓట్లు చీలకుండా జనసేన గెలుపు ఖాయమని చెప్పారు. ఆ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందించారు.