విశాఖ విమానాశ్రయం వద్ద వైసీపీ మంత్రులపై జరిగిన దాడి కేసులో జనసేన నాయకులు, కార్యకర్తలు విడుదలయ్యారు. అరెస్ట్ అయిన వారిలో 61 మందిని రూ. 10 వేల పూచీకత్తుపై కోర్టు విడుదల చేయగా, 9 మందికి మాత్రం ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. అరెస్ట్ చేసిన నేతలను ఏడో అదనపు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విశాఖ ఘటనకు సంబంధించి తమ జనసైనికులు 92 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి 70 మందిని అరెస్ట్ చేసినట్టు జనసేన లీగల్ సెల్ తెలిపింది. వీరిలో 61 మందికి బెయిలు లభించిందని, 9 మందికి కోర్టు రిమాండ్ విధించిందని తెలిపింది.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జనవాణి కార్యక్రమం కోసం శనివారం సాయంత్రం 4.30గంటలకు విశాఖ వచ్చారు. ఆయనకు స్వాగతం పలకడానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు రోజా, జోగి రమేశ్ విశాఖ గర్జన కార్యక్రమం ముగించుకొని విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో గొడవ మొదలైంది.