ఏపీ సీఎం జగన్ పాలనపై అటు తులసి రెడ్డి.. ఇటు నాదెండ్ల మనోహర్

0
885

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మేనిఫెస్టోలోని హామీలను వైసీపీ విస్మరించిందని తులసిరెడ్డి అన్నారు. ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశామని జగన్ చెప్పడం హాస్యాస్పదమని.. 5 శాతం మాత్రమే నెరవేర్చామని చెప్పుకోవడం బెటర్ అని అన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని.. మూడేళ్లలో మూడు ఇళ్లు కూడా కట్టించలేదన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటనలో ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. మద్యపాన నిషేధం బదులు మద్యపాన నిషా అమలవుతోందని అన్నారు.

రైతు భరోసా లో కోత విధించారని, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేశారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటనలో ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. చెల్లమ్మలకు పెళ్ళి కానుక విషయంలో అసలు ఉలుకూ పలుకు లేదన్నారు. పిఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం విషయంలో మాట తప్పడం జరిగిందని ఆరోపించారు తులసి రెడ్డి. 35 నెలల్లో బటన్ నొక్కి రూ.1.40 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేశామని ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్పారని.. మద్యం, ఇసుక, సిమెంట్, పెట్రోల్, డీజల్ ధరలు, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా ప్రజల జేబుల్లో నుండి ప్రభుత్వం రూ.3.40 లక్షల కోట్లు దోచుకున్న విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల నెత్తి మీద రూ. 5.40 లక్షల కోట్లు అప్పు పెట్టిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం జేబు దొంగ పాత్ర పోషిస్తోందని ప్రజలకు అర్థం అయిందని ఆయన అన్నారు.

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను జ‌గ‌న్ నెర‌వేర్చ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైందని నిల‌దీశారు. మద్యపాన నిషేధం విధిస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్.. ఇప్పుడు ప్ర‌తి గ్రామంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీపీఎస్ రద్దుపై కూడా హామీని నిలబెట్టుకోవ‌ట్లేద‌ని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల‌కు ఏపీలోని ప్ర‌తి ఊరిలో గడప గడపలో ఛీత్కారాలు ఎదుర‌వుతున్నాయ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. పరిపాలన చేతగాని సీబీఐ దత్తపుత్రుడైన‌ జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైందని ఆయ‌న విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున‌ అందించాల్సిన డ‌బ్బుల‌నూ స‌ర్కారు ఇవ్వ‌ట్లేద‌ని ఆరోపించారు. మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పలికే అర్హత సీఎంకు లేదని అన్నారు. ఎం.ఎస్.ఎన్.ఛారిటీస్ ఆస్తులు వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్న విషయం ఆయనకు తెలియదా? అని నిలదీశారు. గడప గడపలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల చేత ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారన్నారు.