జనసేన అధినేత రాకతో ఇప్పటంలో హై టెన్షన్

0
865

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం చేరుకున్నారు. పోలీసుల ఆంక్షలు, జనసైనికుల నినాదాల మధ్య ఆయన ఇప్పటానికి చేరుకున్నారు. పవన్ పర్యటనకు అనుమతి లేని కారణంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళగిరి నుంచే పవన్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. దీంతో పవన్ పోలీసుల తీరును నిరసిస్తూ.. మంగళగిరి నుంచి ఇప్పటం వరకు పాద్రయాత్ర ప్రారంభించారు. మధ్య మధ్యలో పోలీసులు ఆంటకాలను దాటుకుంటూ ఆయన ఇప్పటానికి చేరుకున్నారు. పోలీసుల తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటం వెళ్లే దారి అడుగుడునా పోలీసులు మోహరించి ఉండడాన్ని పవన్ తప్పు పట్టారు.

మధ్యలో పవన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పవన్ మాట్లాడుతూ.. రోడ్డు విస్తరించటానికి ఇదేమన్నా కాకినాడ, రాజమండ్రిలాంటి టౌన్ ప్రాంతమా? రోడ్డపై గుంతలు పూడ్చలేరుగానీ రోడ్లు విస్తరిస్తారా? సామాన్యుల ఇళ్లు రోడ్డు విస్తరణ పేరుతో కూల్చేస్తారా? మేం ఇడుపుల పాయలో హైవే వేస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారు. రోడ్డు విస్తరణ పేరుతో ఇందిరాగాంధీ, మహాత్మాగాంధీ విగ్రహాలను కూల్చేస్తున్నారని.. ఏం మాట్లాడదామన్నా అడ్డుకుంటారు. అడుగు ముందుకేస్తుంటే చేతులు అడ్డంపెడతారు…ముందుకెళ్లనివ్వరు అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడతారు? ఇదే పోలీసులు చేసేది? ఇదేనా పాలన అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. ఇలా మమ్మల్ని ఎక్కడ తిరగనివ్వకుండా ప్రభుత్వం ఇటువంటి అవరోధాలు కలిగిస్తుంటే భయపడతామనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్న పవన్ తన వాహనం దిగి రోడ్డుమీద నడుస్తుంగా జనం భారీ సంఖ్యలో వచ్చారు.పవన్ తో కలిసి నడిచారు. దీంతో ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోంది అని భావించిన పవన్ తిరిగి తన వాహనంలోకి ఎక్కి ప్రయాణించారు.