జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు వెన్నుపోటు పొడిచారు. తీవ్రవాదుల దాడిలో ఇద్దరు ఆర్మీ ఉన్నతాధికారులు, డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ మరణించారు. తామే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు రెసిస్టెన్స్ ఫ్రంట్ తెలిపింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు అనుబంధంగా ఇది పని చేస్తోంది. అనంత్‌నాగ్ జిల్లాలోని కోకెర్‌నాగ్ సమీపంలోని గడోలే ప్రాంతంలో రెసిస్టెన్స్ ఫ్రంట్ టెర్రరిస్టులుతీవ్రవాదులు ఉన్నారనే సమాచారం అందడంతో ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు ఎన్‌కౌంటర్‌కు దిగారు. మంగళవారం మధ్యాహ్నం ఈ కాల్పులు మొదలయ్యాయి. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశీష్ భద్రతాదళాలకు సారథ్యాన్ని వహించారు. ఎదురు కాల్పుల్లో మన్‌ప్రీత్ సింగ్, ఆశీష్‌తో పాటు అనంతనాగ్ డీఎస్పీ హుమయూన్ భట్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. హుటాహుటిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమించడంతో ఎయిర్ అంబులెన్స్ ద్వారా శ్రీనగర్‌కు తీసుకెళ్లారు. అత్యవసర చికిత్సను అందించారు. వారి ప్రాణాలను నిలపడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ముగ్గురూ అమరులయ్యారు.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు భద్రతా అధికారులు మరణించిన ఒక రోజు తర్వాత, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను చుట్టుముట్టినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు గురువారం తెలిపారు. “ఈ ఆపరేషన్‌లో తమ ప్రాణాలను అర్పించిన కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, DSP హుమాయున్ భట్ పరాక్రమానికి నివాళి అర్పిస్తున్నాం. ఉజైర్ ఖాన్‌తో సహా ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులను చుట్టుముట్టాము. ” అని కశ్మీర్ జోన్ పోలీసులు X లో ఒక పోస్ట్ ద్వారా తెలిపారు.
అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, డిఎస్పీ హుమాయున్ భట్ మృతికి నిరసనగా భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు జమ్మూలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన సందర్భంగా దిష్టిబొమ్మలను దహనం చేశారు.