More

    టీచర్లను కాల్చి చంపిన తీవ్రవాదులు

    జమ్మూ కశ్మీర్ లో తీవ్రవాదులు సాధారణ ప్రజలపై కాల్పులకు తెగబడుతూ ఉన్నారు. మంగళవారం నాడు శ్రీనగర్‌లో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్ లను ఉగ్రవాదులు హత్య చేశారు. గత ఐదు రోజుల్లో కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏడుగురు మరణించారు. “ది రెసిస్టెన్స్ ఫ్రంట్” (TRF) అనే ఉగ్రవాద సంస్థ ఈ ఘటనకు పాల్పడిందని జమ్మూ కాశ్మీర్ పోలీసు చీఫ్ చెప్పుకొచ్చారు. శ్రీనగర్ శివార్లలోని సంగంలోని హయ్యర్ సెకండరీ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను టార్గెట్ చేసి తీవ్రవాదులు కాల్చి చంపారు. తరగతులు ఆన్‌లైన్‌లో చెబుతూ ఉండడంతో పాఠశాలలో విద్యార్థులు లేరని అధికారులు వెల్లడించారు. “ఉదయం 11:15 గంటలకు, శ్రీనగర్ జిల్లాలోని సంగం ఈద్గా వద్ద ఇద్దరు పాఠశాల ఉపాధ్యాయులను ఉగ్రవాదులు కాల్చి చంపారు” అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టామని, దాడి చేసిన వారి కోసం వేట ప్రారంభించామని చెప్పారు.

    ఇద్దరు ప్రభుత్వ టీచర్లలో మహిళా టీచర్ ఉన్నారు. ఒకరు కశ్మీర్ పండిట్ కాగా..మరొకరు సిక్కు మహిళగా గుర్తించారు. ముస్లిం టీచర్లను గ్రూపు నుంచి వేరు చేసి ముస్లిమేతర టీచర్లను స్కూల్ నుంచి బయటకు లాగారు. అనంతరం వారిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. అక్కడి భద్రతను పర్యవేక్షించడానికి డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాఠశాలకు చేరుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

    జమ్మూ కాశ్మీర్ పోలీసు చీఫ్ దిల్‌బాగ్ సింగ్ మాట్లాడుతూ “ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) కరాచీ నుండి నడుస్తోంది. మేము ఈ గుట్టును త్వరలోనే బహిర్గతం చేస్తాము. ప్రతి ఒక్క పౌరుడిని కాపాడడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం” అని చెప్పారు. మంగళవారం నాడు 70 ఏళ్ల మఖన్ లాల్ బింద్రూ అనే కశ్మీరీ పండిట్ ను కాల్చి చంపారు. ఇక్బాల్‌ పార్క్‌లోని బింద్రూ మెడికేట్‌ ఫార్మశీ యజమాని కాశ్మీరీ పండిట్ అయిన లాల్‌ బింద్రూ అతని ఫార్మశీ దుకాణంలో పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 1990 నాటి వలసల సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోనే ఉండిపోయిన అతికొద్దిమంది కశ్మీరీ పండిట్లలో బింద్రూ ఒకరు. అప్పటి నుండి ఆయన మెడికల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. పోలీసులు, భద్రతా సిబ్బంది వారిని పట్టుకునేందుకు యత్నించగా అయితే అప్పటికే ఉగ్రవాదులు పారిపోయారు. ఫార్మసీలో మందులను పంపిణీ చేస్తుండగా తీవ్రవాదులు ఒక్కసారిగా దుకాణంపై కాల్పులకు తెగబడ్డారు.

    Related Stories