More

    కశ్మీర్ లో స్థానికేతరులను టార్గెట్ చేసిన తీవ్రవాదులు.. హెచ్చరిస్తూ ప్రకటన విడుదల

    జమ్మూ కశ్మీర్ లో తీవ్రవాదులు స్థానికేతరులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంది. జమ్ముకశ్మీర్‌లో స్థానికేతరులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. కశ్మీర్‌లో 24 గంటల వ్యవధిలోనే స్థానికేతరులపై మూడు ఉగ్రదాడులు జరిగాయి. పొట్ట కూటికోసం కశ్మీర్ కు వెళ్లిన వారిపై దాడులకు తెగబడుతూ ఉన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో బీహార్‌కు చెందిన కార్మికులు అద్దెకు ఉంటున్నారు. వలస కూలీలు ఉంటున్న ఇంట్లోకి చొరబడిన ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. మరణించిన ఇద్దరిని జోగిందర్ రేషి దేవ్ మరియు రాజా రేషి దేవ్ గా గుర్తించారు. మూడవ బాధితుడు చుంచున్ రేషి దేవ్ ను ఈ దాడి తరువాత అనంతనాగ్‌లోని ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. బీహార్‌కు చెందిన తేజు దేవ్ కుమారుడు చుంచున్ రేషి దేవ్ కు వెనుక భాగంలోనూ చేయికి గాయమైందని, అతని పరిస్థితి నిలకడగా ఉందని జిఎంసి అనంతనాగ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇక్బాల్ సోఫీ తెలిపారు.

    శనివారం సాయంత్రం ఇద్దరు స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. వీరిలో ఒకరు బీహార్‌కు చెందిన వ్యాపారి, మరొకరు యూపీకి చెందిన కార్పెంటర్. ఈ దాడులు కశ్మీర్‌లో స్థానికేతరుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వలస కూలీలందరినీ సమీపంలోని పోలీసు/మిలిటరీ భద్రతా క్యాంపుల్లోకి తరలించాలని కశ్మీర్‌ ఐజీ పోలీసులను ఆదేశించారనే కథనాలు కూడా వచ్చాయి.

    అక్టోబర్ 17 న జమ్మూ కాశ్మీర్‌లో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్(యు.ఎల్.ఎఫ్.) బీహార్‌కు చెందిన ముగ్గురు హిందువులపై దాడికి పాల్పడింది తామేనని ప్రకటించింది. అందుకు సంబంధించి ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. యు.ఎల్.ఎఫ్. జారీ చేసిన ఈ ప్రకటనలో తమ తీవ్రవాద సంస్థ సభ్యులే ముగ్గురు స్థానికేతరు హిందువులపై దాడి చేసినట్లు తెలిపింది. గత ఒక సంవత్సరంలో బీహార్‌లో 200 మందికి పైగా ముస్లింలను ‘హిందూత్వ తీవ్రవాదులు’ చంపారని యు.ఎల్.ఎఫ్. ఆరోపించింది. ఇటీవల సిఆర్‌పిఎఫ్ చంపిన నలుగురు ఉగ్రవాదులు సాధారణ పౌరులే అని యు.ఎల్.ఎఫ్. ఆరోపించింది. అంతేకాకుండా స్థానికేతర హిందువులకు హెచ్చరిక జారీ చేసింది. హిందువులు కాశ్మీర్‌ని వదిలేయాలని లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాలని యు.ఎల్.ఎఫ్. హెచ్చరించింది.

    హిందువులపై ఇటీవలి కాలంలో దాడులు:

    గత రెండు వారాల్లో హిందువులు మరియు సిక్కులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని అనేక దాడులు జరిగాయి. బీహార్‌కు చెందిన పానీ పూరీ విక్రేత అర్బింద్ కుమార్ సాహ్ అక్టోబర్ 16 న హత్య చేయబడ్డాడు. బీహార్‌కు చెందిన మరో నిరుపేద వీరేంద్ర పాశ్వాన్ అక్టోబర్ 5 న హత్యకు గురయ్యాడు. యు.ఎల్.ఎఫ్. జారీ చేసిన హెచ్చరికతో కూడిన ప్రకటనలో ఉపయోగించిన భాష హిందూత్వకు వ్యతిరేకంగా ఉంది.

    Related Stories