స్థానికేతరులపై తీవ్రవాదుల కాల్పులు.. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న నలుగురి అరెస్ట్

0
745

జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులు మరోసారి స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. పుల్వామా జిల్లాలో ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు లిట్టర్ ప్రాంతంలోని నౌపోరాలో ఇద్దరు కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఛాతికి బుల్లెట్‌ గాయాలైన ఒకర్ని శ్రీనగర్‌లోని ప్రత్యేక ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. మరో వ్యక్తి కాలికి బుల్లెట్‌ గాయమైంది. గాయపడిన వారిని పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన ధీరజ్ దత్, సురీందర్ సింగ్‌గా వీరిని గుర్తించినట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. స్థానిక కోళ్ల ఫారం వాహనం డ్రైవర్‌గా ఒకరు, సహాయకుడిగా మరొకరు పని చేస్తున్నట్లు చెప్పారు. స్థానికేతరులైన ఇద్దరు కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి అదనపు బలగాలను రప్పించి, ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

ఇక బందిపోరా పోలీసులు రెండు టెర్రర్ మాడ్యూళ్లను ఛేదించారు. నిషేధిత సంస్థ లష్కరే తోయిబాకు చెందిన నలుగురు ఉగ్రవాద సహాయకులను అరెస్టు చేశారు. నిందితులు బందిపోరా జిల్లాలో ఉగ్రవాదుల కోసం లాజిస్టిక్స్ రవాణాను చేస్తున్నారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు బందిపోరాలోని అష్టాంగో ప్రాంతంలో ముగ్గురు తీవ్రవాద మద్దతుదారులను గుర్తించారు. ముగ్గురిని ఇర్ఫాన్ అహ్మద్ భట్, సజాద్ అహ్మద్ మీర్, ఇర్ఫాన్ అహ్మద్ జాన్‌గా ధృవీకరించారు. రఖ్ హజిన్‌లోని చెక్‌పోస్ట్ వద్ద భద్రతా బలగాలు కూడా తీవ్రవాదులకు సహాయం చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశాయి. అతడిని ఇర్ఫాన్ అజీజ్ భట్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి చైనా గ్రెనేడ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అజీజ్ భట్ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది ఉమర్ లాలా, మరణించిన ఉగ్రవాది సలీమ్ పర్రేతో టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అజీజ్ భట్, పాకిస్థాన్‌లోని తన సహచరులతో కలిసి హజిన్ ప్రాంతంలో ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.