National

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి తీవ్రవాదులకు సమాచారం అందిస్తూ.. వేటు పడింది

ఓ వైపు భారత సైన్యం, పోలీసులు దేశం కోసం ప్రాణాలను అర్పిస్తుంటే.. కొందరు మాత్రం తీవ్రవాదులకు అమ్ముడుపోయి మన రహస్యాలను వారికి చేరవేస్తూ ఉన్నారు. భారత నిఘా సంస్థలు కూడా అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ విషయంలో చిన్న చిన్న తప్పులను కూడా భారత ప్రభుత్వం సహించడం లేదు. ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూకశ్మీర్‌ పాలనా యంత్రాంగం విధుల నుంచి తప్పింది. తాజాగా ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేశామని అధికారులు చెప్పారు. గత 6 నెలల కాలంలో మొత్తంగా 25 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగింనట్లు కశ్మీర్‌ అధికారులు వెల్లడించారు. పాక్‌ కేంద్రంగా పనిచేసే హిజ్బుల్‌ మొజాహిదీన్‌ ఉగ్రసంస్థ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌ ఇద్దరు కుమారులనూ గతంలో ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగింది. శ్రీనగర్‌లో శాసన మండలి సభ్యుని ఇంట్లో ప్రభుత్వ ఆయుధాలను దొంగిలించిన కానిస్టేబుల్‌ షౌకత్‌ ఖాన్‌ను కూడా విధుల నుండి తప్పించారు.

ఇలాంటి ఉద్యోగుల విషయంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగుల పూర్వాపరాలను ధృవీకరించడానికి నియమించబడిన కమిటీ తాజాగా ఆరుగురు ఉద్యోగులను తొలగించాలని సిఫార్సు చేసింది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులను సర్వీస్ నుండి తొలగించాలని సిఫారసు చేసిన కమిటీ ఆదేశాల మేరకు ఆరుగురు ఉద్యోగులను తొలగించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంలో భాగంగా ఉన్న సదరు ఉద్యోగులు తీవ్రవాదులకు కీలకమైన సమాచారాన్ని అందిస్తూ ఉన్నారని గుర్తించారు. రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనల ప్రకారం తొలగింపులు జరిగాయి.

ఎన్ కౌంటర్:

దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లా చిత్రగామ్‌లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. బుధవారం సాయంత్రం చిత్రగామ్‌లో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఓ పౌరుడు గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున గాలింపు బృందాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది చనిపోయాడని జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. అతడిని అనాయత్‌ అహ్మద్‌ దార్‌గా గుర్తించామన్నారు. అతని వద్ద ఒక పిస్తోల్‌, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

Related Articles

Back to top button