Right Angle

జమ్మూ దాడి వెనుక కీలక రహస్యాలు..?

జమ్మూలోని భారత వైమానిక దళ స్థావరం మీద రోగ్ డ్రోన్ల దాడి కొత్త సవాళ్లను విసురుతోంది. విషమ యుద్ధం పొంచి ఉందన్న సంకేతాలను తాజా దాడి రూఢీ చేసింది. ఐసిస్ అమ్ములపొదిలో, హౌతీ తిరుగుబాటుదారుల హంతక దాడుల్లో, ఉగ్రమూకల సరిహద్దు కుట్రల్లో, మాదక ద్రవ్యాల రవాణాలో ‘డ్రోన్’ సరికొత్త మారణాయుధం. సాంకేతిక ఆవిష్కరణలు మంచికే కాదు, చెడుకీ సాయం చేస్తాయని డ్రోన్ దాడులు రుజువు చేస్తున్నాయి.

సంప్రదాయ యుద్ధ వ్యూహాలకు కాలం చెల్లిందని, భవిష్యత్తు బ్యాటిల్ గ్రౌండ్ లో డ్రోన్లే ప్రధాన ఆయుధాలని భారత సైన్యాధిపతి ఎంఎం నరవణే జూన్ 24న చేసిన హెచ్చరిక సరిగ్గా నాలుగు రోజులకు అంటే 27వ తేదీ ఆదివారంనాడు నిజమైంది! 

రాడార్ల కన్నుగప్పి దూసుకొచ్చిన రెండు చిన్న డ్రోన్లు ప్రస్తుతానికి పెద్ద ప్రమాదమేమీ కలిగించకపోయినా- ఉగ్రవాద భూతానికి మొలుచుకొచ్చిన సాంకేతిక కోరల వాడిని కళ్లకుకట్టాయి. డ్రోన్లతో దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పును కాచుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఏడాది క్రితం లోక్‌సభలో కేంద్రం ప్రకటించింది.

ప్రమాదకర డ్రోన్ల  పీచమణచే ఇజ్రాయిల్  యాంటీ డ్రోన్ రైఫిల్ ‘స్మాష్‌-2000 ప్లస్‌’ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు రక్షణ శాఖ గత కొన్నాళ్లుగా ఇజ్రాయిల్ తో చర్చలు జరుపుతోంది. మరికొద్ది రోజుల్లో ఆధునాతన యాంటీ డ్రోన్ ఆయుధాలు సరిహద్దుల్లో మోహరించేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే తాజా దాడి జరిగింది.

యుద్ధంలో డ్రోన్ ల వాడకం ఎప్పుడు మొదలైంది? అసలు ఈ ‘డ్రోన్’ అనే పదం ఎలా ఆయుధ పరిభాషలోకి ప్రవేశించింది? రోగ్ డ్రోన్ ల రూపకర్త ఎవరు? అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు డ్రోన్ టెక్నాలజీతో పాటు, యాంటీ డ్రోన్ సాంకేతికతను సైతం అభివృద్ధి చేశాయా? వాణిజ్య సామ్రాజ్యంలో, శాస్త్ర విజ్ఞాన రంగంలో, సైనిక వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్న మానవరహిత డ్రోన్లను రాడార్ సాంకేతికత గుర్తించక పోవడానికి కారణమేంటి? ఇలాంటి అంశాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

‘డ్రోన్’ అనే పదం పాత ఆంగ్లభాషలోనిది. మకరందం కోసం గాలింపునకు వెళ్లిన ఆడ తేనెటీగ కోసం వేచిచూసే మగతేనెటీగ పేరే ‘డ్రోన్’.  ‘డ్రోన్’ ఏకైక వ్యాపకం ఆడతేనెటీగ కోసం వేచిచూడటమేనట! 16 శతాబ్దం తర్వాత బద్ధకస్తులను ‘డ్రోన్లు’గా దూషించేవారట. మొత్తంగా కీటకం పేరు ఆయుధానికి నామధేయంగా మారింది.

బంగ్లాదేశ్‌లో పుట్టి, గ్లామోర్గాన్‌లో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చదివి.. 2012 నుంచి ఐసిస్ కోసం పని చేస్తున్న కంప్యూటర్‌ ఇంజనీర్‌ సైఫుల్‌ హక్‌. 2014లో తొలిసారి ‘ఐఈడీ క్యారీయింగ్‌ గైడెడ్‌ డ్రోన్‌’ను రూపొందించాడని ‘’The Atlantic” పత్రిక ఇటీవలే వెల్లడించింది. సైఫుల్ హఖ్ 2015లో సిరియాలో అమెరికా జరిపిన దాడుల్లో హతమయ్యాడు. రోగ్ డ్రోన్ అంటే.. పేలుడు పదార్థాలను మోసుకెళ్లే మానవ రహిత  విమానం. ప్రాణాలు తీసే రోగ్‌ డ్రోన్‌! ఉగ్రమూకలకు కొత్త బలాన్నిచ్చిన ఆయుధమది. అప్పట్నుంచీ ప్రపంచవ్యాప్తంగా  ఉగ్రవాదులు డ్రోన్‌ దాడులకు పాల్పడుతున్నారు. భారత్ కూడా రెండేళ్లుగా ఆ ముప్పు ముంగిట నిలిచింది. అదిప్పుడు జమ్మూ దాడితో నిజమైంది.

డ్రోన్లు పరిమాణంలో చాలా చిన్నవి. హద్దులు దాటి వచ్చేటప్పుడు రాడార్లు వీటిని గుర్తించలేవు. సరిహద్దులకు ఆవల నుంచి రానక్కర్లేదు. మనదేశంలో ఉండే ఉగ్రమూకలు వీటిని ఆపరేట్‌ చేయొచ్చు. 2019 లెక్కల ప్రకారం మన దేశంలో ఆరు లక్షలకుపైగా నియంత్రణ లేని డ్రోన్లు ఉన్నాయని అంచనా.

సిరియాలోని హుమాయ్‌మిమ్‌ వైమానిక స్థావరంపై 2018లో ఈ తరహా డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో రష్యా విమానాలు, ఇతర పరికరాలకు తీవ్ర నష్టం జరిగింది. స్వల్ప శ్రేణి ప్రతి–వైమానిక క్షిపణులు, రేడియో జామర్ల సాయంతో కొన్ని డ్రోన్లను కూల్చినట్టుగా రష్యా ప్రకటించింది.

జమ్మూలో జరిగిన దాడి హుమాయ్‌మిమ్‌ దాడితో పోల్చారు నిపుణులు. వ్యర్థాలు, డక్ట్‌ టేపు ఉపయోగించి, ‘ఐఈడీ’లు అమర్చి తయారు చేసిన వార్ ఫేర్  డ్రోన్లు కోట్ల  విలువ చేసే విమానాలను నేలమట్టం చేస్తాయి.  సంప్రదాయ యుద్ధానికి సవాలు విసురుతున్న డ్రోన్లు వైమానిక దళాల వ్యూహ నిపుణులను ఛాలెంజ్ చేస్తున్నాయి.

ఇక యుద్ధాలు భారీ ఆయుధాలతో గాక చిన్న పాటి డ్రోన్లతో జరిగే శకానికి తెర లేవనుందని స్పష్టమవుతోంది. 1990 యుద్ధంలో అజర్‌బైజాన్‌ను చిత్తుగా ఓడించిన ఆర్మేనియా గత ఏడాది జరిగిన నగార్నో-కరబాక్ యుద్ధ క్షేత్రంలో కేవలం డ్రోన్ దాడుల కారణంగానే ఓటమిని చవిచూసింది. డ్రోన్ల ద్వారా శత్రువులను మట్టుపెట్టడంలో అమెరికా, యూకే, ఇజ్రాయిల్‌లు దశాబ్దం క్రితమే రాటుతేలిపోయాయి.

గడచిన పదేళ్లలో  అమెరికా సిరియా, ఇరాక్ లలో 14 వేలకు పైగా డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారు 17 వేల మంది హతమైనట్టూ అంచనా. ప్రపంచ వ్యాప్తంగా 36 దేశాలు డ్రోన్లను వైరిని నిలువరించడం కోసం వినియోగిస్తున్నాయి. టర్కీలో, ఇజ్రాయెల్‌లో తయారైన అత్యాధునిక డ్రోన్లను ఉపయోగించి ఆర్మేనియాను అజర్‌బైజాన్ మట్టి కరిపించింది. ముందు ముందు అన్ని దేశాలూ డ్రోన్ వార్ ఫేర్ కు సిద్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

జమ్మూలో జరిగిన దాడి నేరుగా వాయు సేన స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నది.  పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలను, బాంబులను పంజాబ్, జమ్మూ కశ్మీర్ భూభాగాల్లోకి పంపించడం దాదాపు ఏడాదిగా సాగుతూనే ఉంది. గత డిసెంబర్‌లో పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లాలో పాక్ వైపు నుంచి ప్రయోగించిన ఒక డ్రోన్ 11 చేతి బాంబులను వదిలి వెళ్లింది.

అంతకు ముందు రోజు అదే జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో చక్రి సైనిక పోస్టు వద్ద ఒక డ్రోన్ కనిపించింది. దానిని వెనక్కి పంపించడానికి సరిహద్దు భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఆ ప్రాంతంలో సాగిన సోదాల్లో కూడా 11 హ్యాండ్ గ్రెనేడ్లు ఉంచిన చెక్క పెట్టె దొరికింది. మానవరహిత  డ్రోన్లు కొంత బరువు గల సామగ్రిని మోసుకొని గమ్యాలకు చేర్చడం లేదా లక్షాన్ని ఛేదించడం చాలా కాలంగా జరుగుతోంది.

ఈ డ్రోన్ల వ్యవస్థను మెరుగుపరిచి యుద్ధ లక్షాలను దెబ్బ తీయడానికి వినియోగించడం మొదలైంది. భారీ ట్యాంకులు, అత్యాధునిక యుద్ధ విమానాలు, సుశిక్షిత అసంఖ్యాక సైనిక పటాలాలు చేయలేని పనిని మానవ రహిత డ్రోన్లు సునాయాసంగా చేస్తున్నాయి.

మధ్య ఆసియాలో జరిగే యుద్ధాల్లో గెలిచిన వారెవరో, ఓడిపోయినవారెవరో ఖచ్చితంగా గిరిగీసి చెప్పుకోలేని రీతిలో ముగుస్తుంటాయి. కాని ఆర్మేనియా అజర్‌బైజాన్ యుద్ధంలో డ్రోన్ల ప్రయోగం వల్ల విజేత అజర్‌బైజానేనని స్పష్టంగా తెలిసింది. టర్కీకి డ్రోన్ల విక్రయంపై అమెరికా, నాటోలు ఆంక్షలు విధించిన తర్వాత అది స్వయంగా వాటిని డిజైన్ చేసి ఉత్పత్తి చేసుకోవడం ప్రమాదకరమైన ధోరణికి సంకేతం.

డ్రోన్లు ఒక యుద్ధాన్ని నిర్ణయాత్మకంగా ముగింపుకి తేవడం మరో చెప్పుకోదగిన పరిణామం. పరిమాణంలో చిన్నవే అయినా మానవ రహిత డ్రోన్ల అవసరాన్ని గుర్తించకుండా ఉండటం యుద్ధరంగాన్ని మరింత ప్రమాదకరంగా మార్చడమే అంటారు సైనిక నిపుణులు. యుద్ధ క్షేత్రంలో డ్రోన్లు బాగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఇతర భారీ ఆయుధాలకు కాలం చెల్లిందనే భావన కూడా సరికాదు.

చాలా దేశాల్లోని  రాడార్‌ వ్యవస్థలు విమానాలను గుర్తించేందుకు తయారైనవి. చిన్న చిన్న వస్తువులను అవి గుర్తించడం అసాధ్యం. ఈ కారణం వల్లే డ్రోన్స్ ను రాడార్‌లు గుర్తించడం అసాధ్యం. డిస్ట్రిబ్యూటెడ్‌ డిటెక్షన్‌ వ్యవస్థ ఉండాలి. ఈ వ్యవస్థలో రాడార్లు, ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌.. ఇలా 9 నుంచి 10 లేయర్లు ఉంటాయి. ఆ స్థాయి అధునాతన సమగ్ర వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే డ్రోన్లను గుర్తించడం సాధ్యమంటారు ‘లీసా పార్క్స్-కెరెన్ కాప్లాన్’’ తమ ‘‘Life in the age of drone’’ పుస్తకంలో.

రేడియో తరంగాల ద్వారా ఓ వస్తువును గుర్తించేందుకు రాడార్‌ వాడతారు. రాడార్‌ నుంచి వెలువడిన రేడియో తరంగాలు.. అవతలి వస్తువును తాకి పరావర్తనం చెందుతాయి. వీటిని విశ్లేషించడం ద్వారా ఆ వస్తువు ఎంత దూరంలో ఉంది? ఏ దిశలో పయనిస్తుందో తెలుసుకునే వీలుంటుంది. రాడార్‌ పరిధి ఎక్కువగా ఉంటుంది. అత్యంత కచ్చితత్వంతో అవతలి వస్తువు గమనాన్ని గుర్తించి గమ్యాన్ని అంచనా వేయగలుగుతాయి.

రాడార్ వ్యవస్థకు ఎన్ని వస్తువులనైనా ఒకే సారి గుర్తించగలిగే సామర్థ్యముంటుంది. అయితే రాడార్లు పెద్ద వస్తువులను మాత్రమే గుర్తించగలవు. రాడార్‌లో డ్రోన్లను గుర్తించే సాంకేతికను అమరిస్తే.. డ్రోన్లను గుర్తిస్తుంది. మరో అవరోధం ఏంటంటే ప్రతి చిన్న వస్తువు తారసపడినపుడు గుర్తించి సమాచారం అందిస్తాయి. అటువంటప్పుడు ప్రతిదాన్ని విశ్లేషించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అంతేకాదు, ఈ తరహా వ్యవస్థ నిర్వహణ వ్యయం చాలా ఎక్కువ.

దేశ పశ్చిమ సరిహద్దులో ఉగ్రవాద సంస్థలు, వాటిని పెంచి పోషించే సైన్యం వద్ద ఇప్పటికే బాంబింగ్‌ డ్రోన్లు ఉన్నాయి. డ్రోన్లను నేలకూల్చే టెక్నాలజీని సైన్యానికి అందించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. అయితే డ్రోన్లను గుర్తించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

ఉదాహరణకు సరిహద్దుల్లోని ఒక సైనికుడి వద్ద రూ.13 లక్షల విలువైన పరికరాలు ఉన్నాయనుకుందాం. అయితే అదే ధరకు సుమారు 12కుపైగా క్వాడ్‌ కాఫ్టర్‌ డ్రోన్లు లభిస్తాయి. అంటే వేల రూపాయల డ్రోన్‌ను కూల్చేందుకు లక్షలు లేదా కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను వాడాల్సి ఉంటుంది. అంటే డ్రోన్లు ఎంతో చౌకైనవే.. అయితే వాటిని వేటాడకపోతే.. అవి మోసుకొచ్చే కిలోల కొద్ది పేలుడు పదార్ధాలు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. మరోవైపు మానవ రహిత విమానాలను కూల్చే యాంటీ యుఎవి వ్యవస్థలు చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్క పశ్చిమ సరిహద్దు రక్షణకే ఇలాంటివి 300 వ్యవస్థలు అవసరమవుతాయి.

సరిగ్గా భారత్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది.  దీన్ని నివారించేందుకు హైదరాబాద్ కు చెందిన ‘గ్రీన్ రోబోటిక్స్’ సంస్థ ‘ఇంద్రజాల్’ సాంకేతికతను తయారు చేసింది. ఆటానమస్‌ డ్రోన్‌ డిఫెన్స్‌ డోమ్‌ సిస్టమ్‌ను తయారు చేసిన గ్రీన్ రోబోటిక్స్  దీనికి ‘ఇంద్రజాల్‌’ అని నామకరణం చేసింది.

డ్రోన్‌ అనేది ఒక చోటు నుంచి, మరో చోటుకి ఎగురుతుంది.  కాబట్టి నిరంతర పర్యవేక్షణకు ఒక అల్గారిథమ్‌ కావాలి. గుంపు డ్రోన్లు వస్తే.. ప్రతి దాన్ని ట్రాక్‌ చేయాలంటే ఆర్టిపీషియల్ ఇంటలీజెన్స్ ఆధారిత సాంకేతికత పరిజ్హానం ఉండాలి. దేన్ని న్యూట్రలైజ్‌ చేయాలో కచ్చితంగా నిర్ణయం కూడా తీసుకోగలగాలి. ఇవన్నీ ఇంద్రజాల్‌ చేస్తుంది.

ఇంద్రజాల్‌ సుమారు 1,000-2,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంపై నిఘా ఉంచుతుంది.ఆయుధ సహిత డ్రోన్లు, సూసైడ్‌ బాంబ్- కార్పెట్ బాంబింగ్‌ డ్రోన్లు, మానవ రహిత విమానాలు, రాడార్‌కు చిక్కని ఆర్‌సీఆర్‌ వాహనాలను ‘ఇంద్రజాల్‌’ ముందే గుర్తించి కూల్చివేస్తుంది. సుమారు దీని తయారీలో 9-10 రకాల టెక్నాలజీలు వాడారు.

ఇరవయ్యో శతాబ్దం తర్వాత యుద్ధ లక్షణాన్ని మార్చి వేసింది సాంకేతిక పరిజ్ఞానం. నూతన ఆవిష్కరణలు రక్షణ వ్యూహాలకు సవాళ్లు విసురుతున్నాయి. దక్షిణాసియాలో ప్రస్తుతం నెలకొన్న అస్థిర పరిస్థితుల్లో డ్రోన్ దాడులు మరింత ఉద్రిక్తతను పెంచుతున్నాయి. ఉగ్రమూకల సాంకేతిక సవాళ్లకు భారత సైన్యం ప్రతివ్యూహ రచన చేస్తుందనడంలో సందేహం లేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

20 − 18 =

Back to top button