‘అల్లా హు అక్బర్’ అని అరచిన విద్యార్థినికి 5 లక్షల రూపాయల బహుమానం ప్రకటన

0
790

కర్ణాటక రాష్ట్రంలోని కళాశాలల్లో హిజాబ్ పై వివాదం కొనసాగుతూ ఉండగా.. జమియత్ ఉలమా-ఇ-హింద్ సంస్థ ఒక వర్గానికి వ్యతిరేకంగా “అల్లాహు అక్బర్” నినాదాలు చేసిన బురఖా ధరించిన నిరసనకారుడికి రివార్డ్ ప్రకటించి వివాదానికి దారితీసింది. కర్ణాటకలోని మాండ్యాలోని పీఈఎస్ కాలేజీలో విద్యార్థుల బృందం వద్ద బీబీ ముస్కాన్ ఖాన్ “అల్లాహు అక్బర్” అని అరుస్తూ కనిపించిన వీడియో మంగళవారం వైరల్ అయింది. PES కళాశాల క్యాంపస్‌లో ఇస్లామిక్ నినాదాలకు ప్రతిస్పందనగా హిందూ విద్యార్థులు “జై శ్రీ రామ్” అని నినాదాలు చేశారు.

బీబీ ముస్కాన్ ఖాన్ మాట్లాడుతూ బయటి వ్యక్తులు కొందరు తనను ఇబ్బంది పెట్టారని, మాండ్యాలోని పిఇఎస్ కాలేజీలో తన క్లాస్‌మేట్స్, అధికారులు తనకు మద్దతు ఇచ్చారని తెలిపింది. ఈ ఘటన చోటు చేసుకున్న ఒక రోజు తర్వాత, నిరసనల సమయంలో బురఖా ధరించి “అల్లాహు-అక్బర్” అని నినాదాలు చేసినందుకు ముస్కాన్ ఖాన్‌కు రూ. 5 లక్షల నగదు బహుమతిని ప్రకటించడం ద్వారా జమియత్ ఉలమా-ఇ-హింద్ అగ్నికి మరింత ఆజ్యం పోయడానికి ముందుకొచ్చింది. ఒక ట్వీట్‌లో దియోబంద్ ఆధారిత ఇస్లామిక్ సంస్థ తన రాజ్యాంగ, మతపరమైన హక్కుల కోసం తీవ్ర నిరసనల మధ్య బీబీ ముస్కాన్ ఖాన్ ఎదురు నిలబడిందని పేర్కొంది.

కర్ణాటకలో బురఖాల వివాదం మంగళవారం నాడు తీవ్ర రూపం దాల్చడంతో, రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలలు, కళాశాలలను మూడు రోజుల పాటు మూసివేయాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశించారు. “శాంతి, సామరస్యాన్ని కాపాడాలని నేను విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యంతో పాటు కర్ణాటక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే మూడు రోజుల పాటు అన్ని హైస్కూల్స్ , కాలేజీలను మూసివేయాలని ఆదేశించాను. ఇందుకు సంబంధించిన వారందరూ సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం’’ అని బొమ్మై ట్వీట్ చేశారు.

ఇతర రాష్ట్రాలకు పాకిన హిజాబ్ ఇష్యూ:

హిజాబ్ వివాదం రోజు రోజుకు హీట్ ఎక్కుతోంది. ఇతర రాష్ట్రాలకు సైతం ఈ వివాదం విస్తరిస్తోంది. కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలకు కూడా పాకింది. ఆ రాష్ట్రాలు హిజాబ్ వివాదంతో అట్టుడికిపోతున్నాయి. హిజాబ్‌, కాషాయ కండువాల రగడపై నటుడు కమల్ హాసన్‌ స్పందించారు. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయని అని ఆయన ట్విట్ చేశారు. చదువుకునే విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కమల్ కామెంట్‌ చేశారు. కర్ణాటక ఇష్యూ పొరుగు రాష్ట్రాల వరకూ రాకూడదని.. తమిళనాడు సహా అందరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిదంటూ ట్విట్టర్‌లో వెల్లడించారు.

మరోవైపు నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ ట్విట్టర్‌లో ఈ సమస్యపై స్పందించారు. ముస్లిం మహిళలను తక్కువ చేయడాన్ని ఆపాలని భారత దేశంలో ఉండే రాజకీయ నాయకులను ఆమె కోరారు. అమ్మాయిలు తమ హిజాబ్‌లలో పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించడం అన్యాయమన్నారు. భారత నాయకులు ముస్లిం మహిళలను అణగదొక్కడాన్ని ఆపాలని ఆమె కోరారు. అయితే గతంలో పాకిస్థాన్‌ బాలికల హక్కులు అలాగే వారి విద్య గురించి మలాలా మాట్లాడినందుకు 2012లో తాలిబాన్లు ఆమెపై కాల్పులు జరిపారు. ఇక మలాలా పోస్ట్‌కు బీజేపీ నేత మంజీదర్ సింగ్ సిర్సా గట్టి కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్‌లో మైనర్ హిందూ సిక్కు బాలికలను బలవంతంగా మతమార్పిడి చేయడం వంటి ఇతర అంశాలపై ఎప్పుడూ మాట్లాడలేదని విమర్శించారు. ఆమె వాస్తవాలను తెలుసుకోకుండా ట్వీట్ చేస్తోందని ఆయన మండిపడ్డారు.

ఇక విద్యాసంస్థల్లో విద్యార్థులంతా యూనిఫాం ధరించాల్సిందేనని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్పష్టం చేశారు. కొందరు రాజకీయ నాయకులు, మతోన్మాద శక్తులే ఈ అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. కర్ణాటకలో హిజాబ్‌పై నిషేధాన్ని మధ్యప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఇందర్‌సింగ్‌ పారమార్‌ సైతం సమర్థించారు. యూనిఫాంలో హిజాబ్‌ భాగం కాదని స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలో కూడా ఒకేవిధమైన డ్రెస్‌కోడ్‌ను అమలుచేస్తామని తెలిపారు. హిజాబ్‌ ధరించిందన్న కారణంగా ఓ ముస్లిం విద్యార్థినిని టీచర్‌ క్లాసులోకి రానివ్వని ఘటన పుదుచ్చేరిలోని అరియన్‌కుప్పంలోనూ చోటుచేసుకుంది.

గత శనివారం కర్ణాటక ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ఆదేశాలను సైతం జారీ చేసింది. విద్యాసంస్థ యాజమాన్యం యూనిఫాంగా గుర్తించని ఎలాంటి వస్ర్తాలను విద్యార్థులు ధరించరాదని, సమగ్రత, సమానత్వానికి విఘాతం కలిగించేలా విద్యార్థుల వస్త్రధారణ ఉండరాదని ప్రకటించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక వర్గం విద్యార్థులు హిజాబ్‌లు ధరిస్తుండటంతో వారికి వ్యతిరేకంగా మరో వర్గం విద్యార్థులు కాషాయ కండువా వేసుకొని స్కూళ్లు, కాలేజీలకు రావటం ప్రారంభించారు. సోషల్‌మీడియాలో ప్రచారం కావటంతో చుట్టుపక్కల జిల్లాలకు వ్యాపించింది.

హిజాబ్‌ వివాదం కర్నాటకలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో మూడురోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరి నమ్మకాలు వారివని, రాజ్యాంగమే తమకు దైవమని ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అన్నివర్గాల ఆచారసాంప్రదాయాలను తాము గౌరవిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్ధులు రోడ్డెక్కకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. హిజాబ్‌ వివాదం కారణంగా విద్యాసంస్థల్లో హింస చెలరేగడంతో కర్నాటక ప్రభుత్వం స్కూళ్లు , కాలేజ్‌లకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. జనవరి 1న ఉడుపి PU కాలేజీలో హిజాబ్‌ ధరించిన యువతులను కాలేజీలోకి అనుమతించలేదు యాజమాన్యం. వారు హిజాబ్‌ ధరిస్తే మేం కాషాయ కండువాలను వేసుకుంటాం..అంటూ పోటాపోటీ నెలకొంది. కొందరు హిజాబ్‌లు..మరికొందరు కాషాయ కండువాలతో హాజరవడం చినికి చినికి గాలివానలా మారింది. లేటెస్ట్‌గా హింసకు దారితీసింది. లాఠీచార్జ్‌లు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడం వరకు వెళ్లింది.