More

    సేద్యం, యుద్ధం కలిసే చేద్దాం..!
    భారత్ – ఇజ్రాయెల్ వ్యూహాత్మక బంధం..!!

    ఆధునిక యుద్ధాలను సంపూర్ణంగా మార్చివేసిన ఘనత ఇజ్రాయిల్ కు మాత్రమే దక్కుతుంటారు నిపుణులు, సీఎన్ఎన్ కాలమిస్ట్ ఫరీద్ జకారియా. రెండో ఇంతిఫదా నేపథ్యంలో చుట్టూ పొంచి ఉన్న శతృవులను నిలువరించేందుకు ఇజ్రాయిల్ ఆధునిక ఆయుధాగారాన్ని అత్యాధునికం చేసింది. వైరిని బదాబదలు చేసే డ్రోన్ ను యుద్ధంలో వాడి, ఆకాశమార్గంలో దూసుకువచ్చే శతఘ్నలను నేలకూల్చే ‘డోమ్’ను కనిపెట్టిన ఇజ్రాయిల్ పెంటగాన్ ను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

    వ్యూహాత్మక భూభాగం ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా పలాయనం చిత్తగించాక, ఆసియా ఖండంలోని  భౌగోళిక రాజకీయాల్లో గుణాత్మక మార్పులు సంతరించుకుంటున్నాయి. ఐరన్ డోమ్ తో పాటు, డ్రోన్ ఆయుధ సంపత్తిని మారిన పరిస్థితుల నేపథ్యంలో భారత్ కూడా దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. పశ్చిమాసియాలో ఇరు దేశాలకూ ఉన్న ప్రయోజనాలను ఇజ్రాయిల్-భారత్ ఇటీవలే చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందం మరింత సుదృఢం చేయనుంది. ఇండో-ఇజ్రాయిల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు ఈ నేపథ్యంలో ఏర్పడిందే. JWG-joint working group తన కార్యాచరణను పదేళ్ల కాలంపాటు కొనసాగే ‘రోడ్ మ్యాప్’ అని నిర్ధారించింది.

    ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో జరిగిన విదేశాంగశాఖ మంత్రి ఎస్.జయశంకర్ ఇజ్రాయిల్ పర్యటన అత్యంత ప్రాధాన్యమైంది. ఇరు దేశాల దశాబ్ద కాల బంధానికి పాదులు వేసింది. భారత రక్షణ విధానాన్ని పరిపుష్ఠం చేసింది. ఆర్థిక పురోగతికి బాటలు వేయనుంది.

    భారత్-ఇజ్రాయిల్ బంధం ఎప్పుడు బలపడింది? మోదీ హయాంలో ఎలా మారింది? ఇజ్రాయిల్ ను గుర్తించడానికే నిరాకరించిన భారత్ 1971-ఇండో-పాక్ యుద్ధ కాలంలో ఎందుకు సాయం చేసింది? JWG-joint working group మౌలిక లక్ష్యాలేంటి? భారత్ కు ఇప్పటికిప్పుడే డ్రోన్ల అవసరం ఎందుకు ఏర్పడింది? ఇజ్రాయిల్ యుద్ధనీతి ఏ ప్రభావాల కారణంగా మారింది? ఇజ్రాయిల్ మనకు చేస్తున్న సాయాల వల్ల భారత సైనిక పొందికలో వచ్చే మార్పులేంటి?

    ఇజ్రాయిల్ ఆవిర్భావాన్ని భారత్ అధికారికంగా గుర్తించింది 1950, సెప్టెంబర్ 17న. ఇరు దేశాల మధ్య దౌత్య బంధం మొదలైంది 1992లో పీవీ హయాంలో మాత్రమే! 1948లో ఇజ్రాయిల్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్య సమితిలో భారత్ ఓటు వేసింది. అధికారిక దౌత్య బంధం లేని కాలంలోనే 1971 లో జరిగిన భారత్-పాక్ యుద్ధ సమయంలో ఇజ్రాయిల్ ఇరాన్ కు పంపాల్సిన ఆయుధ షిప్ మెంట్ ను భారత్ కు పంపింది.

    వాజ్ పేయ్ హయాంలో 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో కేవలం తాను సాయం చేయడమే కాదు, అమెరికా సహా అనేక దేశాలకు ఆయుధ షిప్ మెంట్లు యుద్ధ ప్రాతిపాదికన ఇండియాకు పంపాలని కోరిందని, నిపుణులు శ్రీనాథ్ రాఘవన్ తన పుస్తకం ‘‘India’s War: World War II and the Making of Modern South Asia’’లో చారిత్రక వాస్తవాలను బట్టబయలు చేశారు.

    ఇజ్రాయిల్‌ మిలటరీ పరికరాలకు భారత్‌ అతిపెద్ద కొనుగోలుదారు కాగా, భారతదేశానికి రష్యా తర్వాత రెండో అతిపెద్ద రక్షణ పరికరాల సరఫరాదారుగా ఇజ్రాయెల్‌ నిలిచింది. 1999 – 2009 మధ్యకాలంలో భారత్, ఇజ్రాయెల్‌ మధ్య 9 బిలియన్‌ డాలర్ల విలువైన ‘మిలటరీ’ వాణిజ్యం జరిగింది. రెండు దేశాల మధ్య మిలటరీ, వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధి.. తీవ్రవాద గ్రూపులకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, సంయుక్త మిలటరీ శిక్షణకు బాటలు వేసింది.

    2014లో ఇజ్రాయిల్‌కు సంబంధించి భారతదేశం పదో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. భారత్, ఇజ్రాయిల్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1992లో 200 మిలియన్‌ డాలర్లు కాగా, 2014 నాటికి 4.52బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

    ఇందులో భాగంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, నీటి యాజమాన్యం, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం వంటి అంశాల్లో వాణిజ్య ఒప్పంద చర్చలు విజయవంతమైతే రెండు దేశాల మధ్య వాణిజ్యం 5 బిలియన్‌ డాలర్ల నుంచి 10 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేశారు. 2015లో వస్తువులకు సంబంధించి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతోపాటు పెట్టుబడి, సేవల వాణిజ్యానికి సంబంధించిన ప్రత్యేక ఒప్పందాల కోసం ఇరు దేశాలు చర్చించాయి.

    భారత్‌ నుంచి ఇజ్రాయిల్‌కు జెమ్స్, విలువైన మెటల్స్, నాణేలు, ఆర్గానిక్‌ రసాయనాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మెడికల్, సాంకేతిక పరికరాలు, ప్లాస్టిక్‌ వాహనాలు, యంత్రాలు, టెక్స్‌టైల్స్‌ ఎగుమతి అవుతున్నాయి. ఇజ్రాయిల్‌ నుంచి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఇనుము/ఉక్కు ఉత్పత్తులు, ఎరువులు, యంత్రాలు, ఆర్గానిక్‌ రసాయనాలు, ఇనార్గానిక్‌ కెమికల్స్, ప్లాస్టిక్‌ను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. 2016–17లో భారతదేశానికి ఇజ్రాయిల్‌ 38వ పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది 2016–17లో ఈ రెండు దేశాల మధ్య జరిగిన వాణిజ్య విలువ 5.02 బిలియన్‌ డాలర్లు. 2012–13తో పోల్చితే వాణిజ్య విలువలో పెరుగుదల 18 శాతంగా నమోదైంది.

    2016–17లో భారత్‌కు ఇజ్రాయిల్‌తో జరిగిన వాణిజ్యానికి సంబంధించి వాణిజ్య శేషంలో మిగులు 1.10 బిలియన్‌ డాలర్లు. 2016–17లో భారత్‌ నుంచి ఇజ్రాయిల్‌కు ప్రధానంగా ఖనిజ ఇంధనాలు, చమురు ఎగుమతి అయ్యాయి. మొత్తం భారత ఎగుమతుల విలువలో ఖనిజ ఇంధనాలు, చమురు విలువ 2016–17లో 1.01 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2016–17లో ఇజ్రాయిల్‌ నుంచి భారత్‌ దిగుమతుల్లో నేచురల్‌/కల్చర్డ్‌ పెరల్స్, విలువైన రాళ్లు ప్రధానంగా నిలిచాయి. ద్వైపాక్షిక వాణిజ్యంలో డైమండ్స్‌ వాణిజ్యం 54 శాతంగా నమోదైంది.

    భారత ప్రభుత్వం 2015లో 321 లాంచర్లు; 8,356 మిస్సైల్స్‌ను ఇజ్రాయిల్‌ మిలటరీ నుంచి కొనుగోలు చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ -డీఆర్‌డీవో, ఇజ్రాయిల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ సహకారంతో అభివృద్ధి చేసిన బరాక్‌–8ను భారత్‌  2016, జూన్‌ 30న విజయవంతంగా పరీక్షించింది. బరాక్‌–8ను నౌకాదళంతోపాటు భూభాగం నుంచి ప్రయోగించేలా రూపొందించారు. ఒడిశా లోని చాందీపూర్‌లోని ప్రయోగ పరీక్ష వేదిక నుంచి 2016, సెప్టెంబర్‌ 20న రెండోసారి బరాక్‌– 8 మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించారు.

    2016, మార్చి 30న భారత్‌కు చెందిన రిలయన్స్‌ డిఫెన్స్, ఇజ్రాయిలీ సంస్థ రాఫెల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ మధ్య 10 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు సంస్థలు భారత మిలటరీకి అవసరమైన ఎయిర్‌– టు–ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్, మిస్సైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సంయుక్తంగా ఉత్పత్తి చేయనున్నాయి. దీంతో మధ్యప్రదేశ్‌లోని 3000 మంది భారతీయులకు ఉపాధి లభిస్తుంది.

    2017 ఫిబ్రవరిలో ఇండియన్‌ నేవీ.. ఇజ్రాయిల్‌ అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్‌ అండర్‌ వాటర్‌ హార్బర్‌ డిఫెన్స్‌ అండ్‌ సర్వైలెన్స్‌ సిస్టమ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ముంబై నేవల్‌ హార్బర్‌లో నీటిపైన, నీటి కింద ఉండే ఇండియన్‌ నేవీ వాహనాల నిర్వహణ, భద్రత మెరుగుపడు తుంది. 2017, మే 11న ఇజ్రాయిల్‌ రూపొందించిన సర్ఫేస్‌–టు–ఎయిర్‌.. పైథాన్, డెర్బీ మిసైల్‌ సిస్టమ్‌ను ఇండియన్‌ మిలటరీ విజయవంతంగా పరీక్షించింది.

    గడచిన ఏడేళ్లుగా సాగుతున్న ద్వైపాక్షిక బంధంలో గుణాత్మక మార్పునకు ఈ ఏడాది మరో ముందడుగు వేసింది. రెండు దేశాల రక్షణ శాఖలూ, నిఘా విభాగాలూ ఉమ్మడిగా కృషి చేసేందుకు, ఆయుధ పరిశోధనా రంగంలో మరిన్ని సరికొత్త ఆవిష్కరణలకు సిద్ధమయ్యాయి. అయితే ఈ బంధం అత్యంత సుదీర్ఘమైంది. దశాద్ద కాలం కొనసాగే ఈ ద్వైపాక్షిక బంధంలో భారత రక్షణ రంగంలో, ఇంటలీజెన్స్ రంగంలో అనూహ్యమైన మార్పులు రానున్నాయి.

    యుద్ధ రంగంలో డ్రోన్ల పాత్ర ఊహించనంతగా పెరిగింది. ఇటీవలి కాలంలో భారత్ లోకి పాకిస్థాన్ వైపు నుంచి సుమారు 119 డ్రోన్లు ఆయుధాలను మోసుకు వచ్చాయి. వీటిలో అత్యాధునిక గ్రెనెడ్లు సహా, ఏకే56, ఏకే 47 ఆయుధాలు, నైట్ విజన్ బైనాక్యులర్లు, ఎక్కువ సేపు పోరాడాల్సి వస్తే ఆహారం అవసరం లేకుండా ఉండేందుకు కావాల్సిన టాబ్లెట్లు కూడా ఉన్నాయి. దీంతో సైన్యం అప్రమత్తమైంది. డ్రోన్లను పసిగట్టే ఉప గ్రహ వ్యవస్థ మన వద్ద లేకపోవడంతో బలగాలకు తలనొప్పిగా మారింది. ఇజ్రాయిల్ 2012లో రెండో ఇంతిఫధా కాలంలోనే దూరదృష్టి ఉప గ్రహ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.

    ఆయుధాగారమే రక్షణ కవచమని గుర్తించిన ఇజ్రాయిల్ సైనిక రంగ ఆధునీకరణ కోసం శ్రమను వెచ్చించింది. పొరుగున ఉన్న పాలస్తినా సహా అరబ్బు దేశాల ప్రాబల్యాన్ని నియంత్రించేందుకు అత్యాధునిక ఆయుధ సంపత్తిని సృష్టించడమే మార్గమని ఎంచింది. ఇజ్రాయిల్ ఎయిరో స్పేస్ సంస్థ సరికొత్త యుద్ధకళకు శ్రీకారం చుట్టింది.

    2005లో అమెరికా నుంచి medium-altitude long-endurance unmanned aerial vehicle-UAV లను కొనుగోలు చేసింది. వీటి సాయంతో డ్రోన్లను ఆయుధాలుగా మలచడం ఎలాగో పరిశోధనలు చేసింది. అక్టోబర్ 28న టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ రాసిన కథనం ప్రకారం డ్రోన్లను గుర్తించడం కేవలం భారత్ కు మాత్రమే కాదు, ఏ దేశానికైనా కష్టసాధ్యమే అని ఇజ్రాయిల్ గుర్తించింది. లో అల్టిట్యూడ్ లో ఎగిరే డ్రోన్లను గుర్తించడం కన్నా వాటిని నిరోధించే సాంకేతిక నైపుణ్యాన్ని కనుగొనడమే శ్రేయస్కరమని తేల్చింది.  డ్రోన్ టెక్నాలజీతో ప్రతి దాడి చేయడం, ఐరన్ డోమ్ తో మిసైళ్లను గగనతలంలోనే ధ్వంసం చేయడమే మార్గమని భావించింది. ఇజ్రాయిల్ 2019లో 78 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ డ్రోన్ టెక్నాలజీకి కేటాయించింది.

    భారత్-ఇజ్రాయిల్ ఒప్పందంలో మన రక్షణ రంగంలో వచ్చే మార్పులు పొరుగున పొంచి ఉన్న ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉపకరించే అవకాశాలున్నాయి. అయితే ఐరన్ డోమ్ ను ఎలా, ఎక్కడ వినియోగించాలనే సవాళ్లు ఉన్నాయి. చిన్న దేశమైన ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ ను వాడటంలో, సుమారు 15వేల సరిహద్దు విస్తీర్ణం ఉన్న భారత్ వినియోగంలో సాంకేతిక, అచరణాత్మక సమస్యలున్నమాట నిజమే అయినా, వాటిని పరిష్కరించేందుకు ఇరుదేశాల ఉమ్మడి బృందాలు పరిశోధనలో నిమగ్నమయ్యాయి. ఇరు దేశాలకు చెందిన రక్షణ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలనీ, అవి మనకు రక్షగా ఉండాలనీ కోరుకుందాం.

    Trending Stories

    Related Stories