ముగ్గురు జైషే మహమ్మద్‌ సానుభూతిపరుల అరెస్ట్.. భారీగా ఆయుధాల పట్టివేత

0
693

జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్ములోని నర్వాల్‌ ప్రాంతంలో ముగ్గురు జైషే మహమ్మద్‌ సానుభూతిపరులను అరెస్టు చేశారు. జైషే మహ్మద్ కు చెందిన ముగ్గురిని బుధవారం జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ట్రక్ డ్రైవర్‌ను పుచిల్ పాంపోరాకు చెందిన మహ్మద్ యాసీన్, అతని ఇద్దరు సహచరులు ఫర్హాన్ ఫరూక్, ఫరూక్ అహ్మద్‌గా గుర్తించారు. ఇద్దరూ డ్రంగ్‌బల్ పాంపోర్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి నార్వాల్ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి వాహనాల కదలికలను క్రమబద్ధీకరిస్తున్న పోలీసు పార్టీతో గొడవకు దిగినందుకు ముగ్గురిని మొదట అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.

నర్వాల్‌లోని జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తుండగా పెట్రోలింగ్‌ పార్టీ ఓ ట్యాంకర్‌ హైవేపై ఆగి ఉండటాన్ని గమనించారు. ఆ ట్యాంకర్ జమ్ముకశ్మీర్‌ రిజిస్ట్రేషన్‌తో ఉంది. అడ్డుగా ఉన్న ట్యాంకర్‌ను అక్కడినుంచి తీయాలని డ్రైవర్‌కు చెప్పారు. అతడు కొద్ది దూరంలో ఉన్న నర్వాల్‌ సిద్రా బైపాస్‌ రోడ్డు వద్ద ఉన్న ఎన్విరాన్‌మెంటల్‌ పార్క్‌ వద్ద ట్యాంకర్‌ను నిలిపాడు. అటుగా వచ్చిన పెట్రోలింగ్‌ పోలీసులు మరోసారి ఆ లారీని అక్కడినుంచి తీయాలని డ్రైవర్‌కు చెప్పారు. అతడు ముందుకు వెళ్లకుండా యూటర్న్‌ తీసుకుని మొదట ఆపి ఉంచిన ప్రాంతానికే వెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు.. డ్రైవర్‌ను ప్రశ్నించారు. అతనితోపాటు ఉన్న ట్యాంకర్‌లో ఉన్న మరో ఇద్దరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌ను మొహమ్మద్‌ యాసిన్‌గా, మరో ఇద్దరిని ఫర్హాన్‌ ఫరూఖ్‌, ఫరూఖ్‌ అహ్మద్‌గా గుర్తించారు. యాసిన్‌ జైషే ఉగ్ర సంస్థకు సానుభూతిపరుడని, ఇప్పటికే అతనిపై యూఏపీఏ సెక్షన్లపై కేసులు నమోదయ్యాయని గుర్తించారు జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన షహబాజ్‌ ఆదేశాల మేరకు ఆయుధాలు తీసుకెళ్లడానికి జమ్మూకి వచ్చానని చెప్పాడు. వాటిని లోయలో ఉన్న ఉగ్రవాదులకు అందించాలని తనను ఆదేశించారని వెల్లడించారు. పోలీసులు ట్యాంకర్‌ను పరిశీలించగా.. అందులో మూడు ఏకే-56 రైఫిళ్లు, పిస్తోల్‌, తొమ్మిది మ్యాగజైన్లు, 191 రౌండ్ల బుల్లెట్లు, ఆరు గ్రనేడ్లు, ఆయుధ సామాగ్రిని గుర్తించారు.