More

    ఓ దిండు, ఓ దుప్పటి..! నీరవ్ కోసం జైలు గది సిద్ధం..!!

    బ్యాంకులకు ఎగనామం పెట్టి బ్రిటన్ కు చెక్కేసిన నీరవ్ మోదీకి.. ముంబైలో జైలు గది సిద్ధమవుతోంది. తాజాగా, అతన్ని భారత్ కు అప్పగించాలంటూ యూకే కోర్టు తీర్పు చెప్పడంతో.. భారత్‌కు తిరిగి రాకుండా ఉండేందుకు ఆయన చేసిన ప్రయత్నాలన్నింటికీ తెరపడింది. దీంతో ప్రస్తుతం నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న నీరవ్‌ మోదీ.. త్వరలోనే భారత్ కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    బ్యాంకులను మోసం చేసిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకోసం ముంబై ఆర్థర్ రోడ్ జైల్లో ప్రత్యేక సెల్ ను సిద్ధం చేశారు అధికారులు. అతన్ని బ్యారెక్ నెంబర్ 12లోని మూడో సెల్ లో ఉంచుతామని, ఇది భారీ భద్రత కలిగిన బ్యారక్ అని.. ఓ అధికారి స్పష్టం చేశారు. నీరవ్ మోదీని జైల్లో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. ఆయన కోసం జైలు గది సిద్ధంగా వుందని తెలిపారు. ముంబై జైలులో ప్రత్యేక సెల్‌లో నీరవ్‌ మోదీకి మూడు చదరపు మీటర్ల వ్యక్తిగత స్థలం లభించే అవకాశం ఉందని, ఇక్కడ కాటన్ మ్యాట్‌, దిండు, బెడ్‌షీట్, దుప్పటి అందిస్తామని చెప్పారు. సరైన వెంటిలేషన్‌ ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జైళ్లశాఖ కేంద్రానికి గతంలోనే హామీ ఇచ్చిందన్నారు.

    నీరవ్ ను భారత్ అప్పగించాలంటూ బ్రిటన్ కోర్టు తీర్పు చెప్పడంతో.. తప్పించుకోవడానికి ఆర్థిక నేరగాడికి దాదాపు అన్నిదారులూ మూసుకుపోయాయి. అతన్ని భారత్‌కు తెచ్చేందుకు లైన్ క్లియర్ కావడంతో.. ఇండో-బ్రిటన్ దేశాల మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం.. మరికొద్ది రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలావుంటే, నీరవ్ మోదీ వ్యవహారం.. ఆర్థిక నేరగాళ్లకు పెద్ద హెచ్చరికలా మారుతుందని సీబీఐ చెబుతోంది. ఈ కేసులో సాక్షులను నీరవ్ మోదీ బెదిరించి, ప్రలోభాలకు గురిచేస్తున్న విషయాన్ని వెస్ట్ మినిస్టర్ మాజిస్ట్రేట్ కోర్ట్ అంగీకరించింది. మోదీ కేసు కొలిక్కి తెచ్చేందుకు ఇది సానుకూల పరిణామం అయినప్పటికీ అతన్ని భారత్‌కు రప్పించేందుకు చాలా సమయం పట్టొచ్చని తెలుస్తోంది. గత రెండేళ్లుగా నీరవ్ మోదీ కేసు బ్రిటన్ కోర్టుల్లో నానుతుండగా.. తాజాగా ఆయన అక్కడి పైకోర్టులను ఆశ్రయిస్తాడనే సందేహాలు కూడా వున్నాయి..

    2018 ఫిబ్రవరి 14న భారతీయ బ్యాంకులకు అతిపెద్ద షాక్ ఇచ్చిన నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దాదానె 14 వేలకోట్ల రూపాయలు ఎగవేసి బ్రిటన్ కు పారిపోయాడు. నకిలీ బ్యాంక్ గ్యారెంటీలతో నీరవ్ మోదీ భారీ కుట్ర పన్ని బ్యాంకును నిండా ముంచాడు. బ్యాంకు వద్ద తీసుకున్న రుణాన్ని నీరవ్ మోదీ ఎగవేయడంతో PNB కుదేలైంది. దిక్కుతోచని స్థితిలో సీబీఐని ఆశ్రయించి.. ఆ సొమ్ము వసూలు చేయించాలని కోరింది. ముడి వజ్రాల దిగుమతి కోసం రుణం తీసుకున్న ఆయన ఇందుకు విదేశాల్లో చెల్లింపుల కోసం బ్యాంకుకు తప్పుడు లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ లు సమర్పించాడు. ఏళ్లు గడుస్తున్నా నీరవ్ మాత్రం రుణం చెల్లించలేదు.. ఈ నేపథ్యంలోనే బ్యాంకుకు కొత్తగా వచ్చిన సిబ్బంది మొత్తం మోసాన్ని పసిగట్టింది. మొత్తం విషయాన్ని లోతుగా పరిశీలించగా.. 2011-2018 మధ్యకాలంలో కుంభకోణం జరిగినట్లు తేలింది.

    నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయి 73 కోట్ల ఖరీదైన భవంతిలో ఎంజాయ్ చేస్తున్నట్టు బ్రిటన్ మీడియా గుర్తించేవరకు ఆయన పరారీలో ఉన్నట్టు తెలియరాలేదు. అంతేకాదు అక్కడ కూడా వజ్రాల వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించినట్టు లండన్ మీడియా వెలువరించింది. ఎన్నో ఏళ్లుగా వజ్రాల వ్యాపారంలో ప్రీమియం బ్రాండ్‌గా ఉన్న తన సంస్థ కార్యకలాపాలను నీరవ్ మోదీ విస్తరిస్తున్నాడు. అంతేకాదు సరికొత్తగా వజ్రాల వ్యాపారాన్ని మరింత భారీ స్థాయిలో సైలెంట్‌గా చేసుకుని పోతున్నట్టు బ్రిటన్ మీడియా పసిగట్టింది. బిలియనీర్‌గా భారీ సంపదను మూటగట్టుకున్న నీరవ్ మోదీ మాత్రం PNBకి చెల్లించేందుకు అవసరమైన మొత్తం తనవద్ద లేదని తెగేసి చెబుతున్నాడు.

    మనదేశంలో అతి పెద్ద జాతీయ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన నీరవ్ మోడీ బ్రిటన్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతూ, తన గెటప్‌ను మార్చి హ్యాపీగా కొత్త జీవితం గడుపుతున్నట్టు బ్రిటన్ మీడియా బోలెడు సంచలన కథనాలు వెలువరించింది. ఇంత చేస్తూ కూడా తనకు బెయిల్ కావాలని ఐదుసార్లు అక్కడి కోర్టును అభ్యర్థించాడు. తన మానసిక పరిస్థితి బాలేదనే నెపంతో స్వదేశంలో అడుగుపెట్టకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. కాగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, PNBలోని ఉన్నత ఉద్యోగుల సహకారంతోనే నీరవ్ మోదీ ఇదంతా పకడ్బందీగా అమలు చేసినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    మొత్తానికి, నీరవ్ మోదీని భారత్ కు అప్పగించాలంటూ యూకే కోర్టు చెప్పిన తీర్పుతో.. ఆర్థిక నేరగాడిని ఇక్కడి రప్పించేందుకు మార్గం సుగమం అయ్యింది. బ్యాంకులను మోసం చేసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న.. కేటుగాళ్లకు హెచ్చరిక పంపినట్టయింది. ఇదే ఇదే కేసులో నీరవ్ మోదీ సమీప బంధువైన మేహుల్ చోక్సిపై కూడా కుంభకోణానికి సంబంధించిన కేసులు నమోదైంది. దీనిపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఇంటర్ పోల్ కూడా నీరవ్ మోదీపై మనీ లాండరింగ్ కేసు దాఖలు చేసింది. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా మోదీని తీసుకొస్తే కేసు విచారణలో పురోగతి ఉంటుందని చెబుతోంది.

    Related Stories