More

    గోదావరి అన్నపూర్ణమ్మ.. డొక్కా సీతమ్మ..

    అన్ని దానాలకంటే అన్నదానం ముఖ్యం అనిచెబుతారు పెద్దలు.  మనమేదిచ్చినా ఇక చాలు వద్దు అనలేరు కానీ అన్నం విషయం లో మాత్రం కడుపు నిండగానే ఇక చాలు అనే మాట వస్తది.. ఆకలితో ఉంది అన్నప్పుడు ఎవరైనా.. మన ఆకలిని చూస్కొని మనకు సరిపోయిన తరువాత పక్క వాళ్లకి పెడుతుంటారు.  కానీ ఆవిడ మాత్రం తనకోసం చూసుకోకుండా ఉన్నదంతా  ఆకలి అన్న వాళ్లకు పెట్టేసింది.  ఆవిడే నిత్యాన్న దాత, అన్న పూర్ణ గా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ..

    గోదావరి జిల్లాలోని లంకల గన్నవరం అనే ఊరికి ఇల్లాలు గా వచ్చారావిడ. తూర్పు గోదావరి జిల్లా మండపేట అనే ఊళ్లో 1841 అక్టోబరు లో పుట్టారు. తండ్రి భవాని శంకరం తల్లి నరసమ్మ తన భర్త పేరు డొక్కా జోగన్న.

    ఏరోజు కూడా ఆవిడ తమ ఇంటికి వచ్చిన ఎవ్వరికీ కూడా లేదు, కాదు అనకుండా భోజనం పెట్టేవారు అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా…. అలాంటి కొన్ని ఎక్సాంపుల్స్ మీకు చెబుతాను.

    ఒకసారి ఆవిడ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి దర్శనం చేసుకోవడం కోసం  వెళదామనుకొని వెళుతుంటే మధ్యలో పల్లకి ఆపినపుడు…… గన్నవరం సైడ్ కి ఆవిడ ముందు నుండి ఒక పెళ్లి గ్యాంగ్ వెళుతుంది. దాంట్ల ఉన్న పిల్లలు ఆకలేస్తుందీ అని ఏడుస్తుంటే ఆ పిల్లల తల్లులు, ఏడవకండమ్మా… మనం గన్న వరానికి దగ్గరలో ఉన్నం, అక్కడ సీతమ్మ గారుంటారు వెళ్లగానే భోజనం చేద్దాం అన్నారంట…. అది విన్న సీతమ్మ గారు తమ ప్రయాణాన్ని అక్కడే ఆపేసి తిరిగి గన్నవరం వెళ్లి  వాళ్లు వచ్చేలోపు వంట చేసి వాళ్లు రాగానే ఆ బృందానికి కడుపునిండా భోజనం పెట్టారట….  

    ఇంకో సారి రాత్రి విపరీతమైన వర్షం …..తుఫాను గన్నవరం దగ్గర ఒకతను గోదావరిలోని ఒక పాయదాటి ఆచంట వరకు వచ్చాడు. అక్కడ వర్షం పెరిగి గోదావరి ఉధృతి ఎక్కువవడంతో ఆయనకేం చెయాలో తెల్వక ఒక రాయెక్కి నిలబడ్డాడు. ఆకలితో అలమటిస్తూ గట్టిగా సీతమ్మ తల్లి నిన్ను నమ్ముకొని వచ్చాను ఆకలిగా ఉంది తీర్చమ్మ  అన్నాడంట.

     అదే సమయానికి సీతమ్మ గారు నిద్ర లేచి బయటినుండి ఆశబ్దాలు వినబడడంతో  వెంటనే భర్తకి చెప్పి పడవ కట్టించుకొని అక్కడికి వెళ్లి భోజనం పెట్టి అదే పడవలో అతన్ని తీసుకు వచ్చి ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారట.

    ఇలాంటి సంఘటనలు ఆవిడ జీవితంలో ఎన్నో జరిగాయంటారు.  ఈ లక్షణాలు సీతమ్మ గారి తండ్రి ద్వారానే వచ్చాయని చెబుతుంటారు. ఆయన పేరు శంకరం అయినప్పటికీ అందరూ బువ్వన్నా అని పిలిచే వాళ్లంట. అడిగిన వాళ్లకి లేదు అనకుండా భోజనం పెట్టేవారంట.

    సీతమ్మ గారి తల్లి తన చిన్న వయసు లోనే చనిపోవడంతో ఆరేళ్ల వయసునుండే వంట చేయడం నేర్చుకున్నారు. ఆ వయసు నుండే తండ్రి చేసే అన్నదానంలో పాలు పంచుకునేవారు.

    మరోసారి ఇద్దరు ముత్యాల వ్యాపారు లు గన్నవరానికి దగ్గరలోని ఒక సత్రం లో దిగితే ….. అక్కడున్న కొన్ని కారణాల చేత వాళ్లకి మశూచి అనే అంటువ్యాధి వచ్చింది……ఆ సత్రం వాళ్లు వెంటనే వాళ్లని అక్కడినుండి వెళ్లగొడితే  ఎక్కడికెళ్లాలో కూడా తెలియని పరిస్థితుల్లో డొక్కా సీతమ్మ గారికి ఈ విషయం తెలిసి, వాళ్లని తనతో పాటు ఇంటికి తీసుకొస్తే ఇంట్లో భోజనం చేస్తున్న వాళ్లు భయపడ్డారంట. ఆ అంటువ్యాధి మాక్కూడా వస్తుందేమో నని…

    అప్పుడు పక్కనే ఒక రూం రెంట్ కి తీస్కొని వాళ్లని ఆ రూంలో ఉంచి దాదాపు 3 నెల్లు సేవ చేసారంట. వాళ్లు మంచిగయ్యేవరకు.

    ఇలా ఆమె గొప్పతనం ఎక్కడివరకు చేరిందంటే బ్రిటీష్ రాజు అయిన ఎడ్వర్డ్ సెవెన్ ఆమెను తన ప్రమాణ స్వీకారానికి రమ్మని ఢిల్లీకి ఆహ్వానించారు. కానీ సీతమ్మ దానికి వద్దు నేను ఇలాంటివి ఆశించి  అన్నదానం చేయట్లేదు అని చెప్పినపుడు, కనీసం ఆమె ఫోటో అయిన తీసుకురమ్మని బ్రిటీష్ రాజు మద్రాసు కార్యదర్శిని ఆదేశిస్తే ఆ పోటోని ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నపుడు పక్కనే సింహాసనం వేసి దానిపైన పెట్టారట.

    ఆ రాజు రాయల్ ప్యాలెస్ ఆఫ్ లండన్ లో 1903 లో సీతమ్మ గారి ఫోటోని పెట్టారు. 2000 సంవత్సరంలో లోక్ సభ స్పీకరు అయిన జీయంసీ బాలయోగి గారు అక్కడి ఫోటోని చూసి ఆశ్చర్యపోయి డొక్కా సీతమ్మ గారి కీర్తి లండన్ కు వ్యాపించింది కానీ మనమే సరిగా గుర్తించట్లేదు అన్నారంట. అదే టైంలో 45 వేల ఎకరాలకు నీళ్లు అందివ్వడానికి గన్నవరంలో ఒక ఆక్విడెక్ట్ కడుతున్నారు. దానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఆవిడ యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  1909 లో ఆవిడ మరణించారు.

    తమ స్వార్థం కోసం విదేశాల నుండి సేవ ముసుగులో ఆకృత్యాలను చేస్తే  వారిని గుర్తించాం వాస్తవాలను పక్కన బెట్టి వాళ్లని మన నెత్తిన ఎక్కించుకున్నం.

    అలాంటిది డొక్కా సీతమ్మ లాంటి ఎందరో  మహనీయులను గౌరవించుకోవడం పక్కన బెట్టి  కనీసం గుర్తుంచుకోవడం లేదు.  డొక్కా సీతమ్మ  లాంటి వాళ్లు  ఎందరో మన దేశం లో కేవలం రోడ్డు పై విగ్రహాల రూపంలోనే మిగిలిపోయారు.   ఇలాంటి వారి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యతతో పాటు పదిమందికి తెలియపరచాల్సిన కర్తవ్యం మనది.


    Related Stories