More

    హనుమాన్ జయంతి ర్యాలీపై తుపాకీతో కాల్పులు జరిపిన ఆ వ్యక్తి ఎవరు..?

    శనివారం నాడు జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ర్యాలీపై దుండగులు రాళ్లు రువ్వడంతో హింస చెలరేగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులు వాహనాలకు నిప్పుపెట్టడంతో కొన్ని దగ్ధమయ్యాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా కూడా పరిస్థితి అదుపులో ఉందని, ఘటన జరిగిన ప్రాంతంలో అదనపు బలగాలు ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో హోంమంత్రి అమిత్ షా ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితి అదుపులోకి తీసుకోవడంతో పాటు లా అండ్ ఆర్డర్ ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.

    హనుమాన్ జయంతి ఊరేగింపు న్యూఢిల్లీలోని జహంగీర్‌పురి బ్లాక్ సి గుండా వెళుతుండగా జరిగిన హింసాత్మక సంఘటనలో ఒక వ్యక్తి ప్రజల గుంపుపైకి పిస్టల్‌తో కాల్పులు జరుపుతున్న వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. రాళ్లు రువ్వుతున్న జనంలో నుండి ఓ వ్యక్తి వచ్చి పిస్టల్‌తో కాల్పులు జరుపుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.

    కాల్పులు జరిపిన వ్యక్తి గుర్తింపు ఇప్పటికీ స్పష్టంగా లేదు, అతను ఓ క్యాప్ ధరించి ఉన్నట్లు చూడవచ్చు. చిన్న పిల్లలతో పాటు పలువురు వ్యక్తులు రాళ్లు రువ్వడం వీడియోలో చూడవచ్చు. హనుమాన్ జయంతి శోభా యాత్రలో జహంగీర్‌పురి ప్రాంతంలో హింస జరిగింది. ఆ ప్రాంతంలోని సి బ్లాక్‌లోని మసీదు దాటి వెళుతుండగా దాడి జరిగింది. ఈ ఘటనలో తుపాకీ కాల్పులు జరిగాయి, ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మేధా లాల్ మీనా గాయపడ్డారు. గాయం, జరిగిన కాల్పుల గురించి అడిగినప్పుడు, మీనా మాట్లాడుతూ, “గుంపు వైపు నుండి ఎనిమిది నుండి పది రౌండ్లు కాల్పులు జరిగాయి, వాటిలో ఒకటి నా చేతికి తగిలింది.” అని అన్నారు. అయితే పోలీసుల వైపు నుంచి ఎలాంటి కాల్పులు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. సమీపంలోని స్టేషన్‌లోని సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

    ఈ రాళ్లదాడి ఘటనపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. హనుమాన్ జయంతి ఊరేగింపుకు వ్యతిరేకంగా హింసకు పాల్పడినందుకు ఇప్పటివరకూ 20 మందిని పైగా అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌పై కాల్పులు జరిపిన నిందితుడు ఎండీ అస్లాం కూడా పట్టుబడ్డాడు. వీడియోలో ఉన్న వ్యక్తి అస్లామా లేక మరెవరో అనేది అస్పష్టంగా ఉంది. ఈ కేసును ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మరియు క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనపై విచారణకు పది బృందాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జహంగీర్‌పురి సమీపంలోని ప్రాంతాల్లో మరిన్ని బలగాలను మోహరించారు.

    Trending Stories

    Related Stories