ట్రంప్ కుటుంబంలో విషాదం.. మొదటి భార్య మృతి..!

0
748

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రుత్ సోషల్‌లో వెల్లడించారు.

న్యూయార్క్ సిటీలో మాన్‌హటన్‌లోని తన నివాసంలో ఆమె మరణించినట్టు వివరించారు. డొనాల్డ్ ట్రంప్, ఇవానా ట్రంప్ 1977లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్‌లు. అనంతరం 1992లో వారు తమ 15 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకున్నారు. విడాకులు ఇచ్చుకున్నారు. ట్రంప్ కుటుంబం కూడా ఇవానా ట్రంప్ మృతిపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఇవానా ట్రంప్ జీవితంలో పోరాడిందని ఈ ప్రకటన పేర్కొంది.

కమ్యూనిజం నుంచి ఆమె తప్పించుకుని ఈ దేశ పురోగతికి దోహదపడిందని వివరించింది. తన పిల్లలకు కటువైన పాఠాలు బోధించిందని తెలిపింది. ఇవానా ట్రంప్ గతంలో చెకోస్లావేకియాగా పేరున్న చోట కమ్యూనిస్టుల పాలన ఉండేది. ఈ పాలనలోనే ఇవానా పెరిగింది. 73 ఏళ్ల వయసులో మరణించిన ఇవానా ట్రంప్ మృతికి గల కారణాలను అటు డొనాల్డ్ ట్రంప్ లేదా ట్రంప్ కుటుంబం కూడా చెప్పలేదు. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి భార్య సహకారంతో ఎంతో ఎదిగారు. ట్రంప్ టవర్, మాన్‌హటాన్‌లోని అవెన్యూ, ఇతర హై ప్రొఫైల్ ప్రాజెక్టులు ఇవానా ట్రంప్ సహకారంతో పూర్తయ్యాయి.

ఇవానా ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ మాజీ భార్య మాత్రమే కాదు.. ఆమె సక్సెస్‌ఫుల్ బిజినెస్ వుమన్. 1980వ దశకంలో మీడియాలో ట్రంప్ క్రేజ్ పెరగడానికి ఇవానా కారణం. ఆమె ద్వారా న్యూయార్క్ సిటీలో పవర్ కపుల్స్‌గా వీరికి పేరు పడింది. తమ తల్లి అద్భుత మహిళ అని, బిజినెస్‌లో ఒక శక్తి అని ట్రంప్ కుటుంబం తెలిపింది. ప్రపంచ శ్రేణి క్రీడాకారిణి అని వివరించింది. మారియా మేపుల్స్‌తో డొనాల్డ్ ట్రంప్ ఎఫైర్ బహిరంగంగా రచ్చ రచ్చ అయిన తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ మారియా మేపుల్‌ను పెళ్లి చేసుకున్నారు. స్థానిక పత్రికల్లో డొనాల్డ్ ట్రంప్ రెండో వివాహం సెన్సేషనల్ న్యూస్‌గా కవర్ అయింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here