ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్న భారత ప్రభుత్వానికి మరో తీపి కబురు అందింది. ఇటీవలే డీఫాల్టర్ నీరవ్ మోదీకి లండన్ కోర్టు షాకివ్వగా.. ఇప్పుడు ఆయన మామ, పీఎన్‌బీ స్కాంలో తోడు దొంగ.. మెహుల్ చోక్సీకి ఆంటిగ్వా భారీ షాక్ ఇఛ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్ల ఎగ్గొట్టి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీకి.. అక్కడి ప్రభుత్వం పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఈ విషయాన్ని సీబీఐ, ఈడీ అధికారులు ధృవీకరించినట్టు తెలుస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి.. భారత్ నుంచి పారిపోయి ఆంటిగ్వాలో దాక్కున్నాడు మెహుల్ చోక్సీ. అక్కడి పౌరసత్వాన్ని కూడా పొందాడు. అయితే, గతేడాదే తన పౌరసత్వాన్ని ఆంటిగ్వా రద్దు చేయడంతో, సెయింట్ జాన్‌లోని సివిల్ కోర్టును ఆశ్రయించాడు. చోక్సీ. అయితే భారత బ్యాంకులను మోసం చేసి, తమ దేశంలో స్థిర పెట్టుబడుల పేరుతో తమ దేశంలో ఆశ్రయం పొందటానికి వీల్లేదన్న అక్కడి ప్రభుత్వ నిర్ణయించింది. దీంతో చోక్సీ పిటిషన్‌ను కొట్టివేసి అవకాశం ఉందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.
అంతేకాదు ఆంటిగ్వా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ గతంలో హామీ ఇచ్చినట్టుగా చోక్సీని భారత్‌కు అప్పగించే చర్యలు త్వరితగతిన ప్రారంభమవు తాయని తెలిపారు. దౌత్యపరమైన ఒత్తిడి తరువాత మెహుల్ చోక్సీ పౌరసత్వ ఉపసంహరణకు ఆంటిగ్వా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ గతంలోనే అంగీకరించారు. నేరస్థులకు, ఆర్థిక నేరాలకు పాల్పడినవారికి తమ దేశంలో చోటు లేదని 2019 జూన్‌లో స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే పీఎన్‌బీ స్కాంకు సంబంధించి లండన్ కోర్టు తీర్పు తర్వాత, ఈ కేసులోప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని దేశానికి తిరిగి రప్పించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే నీరవ్ కోసం ముంబైలోని ఆర్ధర్ రోడ్ జైల్లో సెల్ ను కూడా రెడీ చేశారు అధికారులు.