ఐశ్వర్య టు హర్నాజ్..
‘కాస్మెటిక్’ కంపెనీల కన్నింగ్ స్ట్రాటజీ..!!

0
880

భారత్‎ను మరోసారి ‘మిస్ యూనివర్స్’ కిరీటం వరించింది. ఇజ్రాయెల్‎లోని ఎయిలాట్‎లో జరిగిన ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో.. చండీగఢ్‎కు చెందిన ‘హర్నాజ్ కౌర్ సంధు’ విశ్వ సుందరిగా ఎన్నికైంది. భారత్‎కు ఇది మూడో విశ్వసుందరి కిరీటం. అయితే, 90వ దశకంలో వెల్లువలా వరించిన కిరీటాలు.. 2000 సంవత్సరం తర్వాత మందగించాయి. తాజా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకోవడానికి ఈసారి 21 ఏళ్లు పట్టింది. మరీ, ఇంత గ్యాప్ ఎందుకొచ్చిందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న..? చెప్పాలంటే, గత దశాబ్దకాలంలో విశ్వసుందరి పోటీల్లో పాల్గొన్న సుందరీమణుల్లో.. అందాల కిరీటానికి అర్హులైన వాళ్లు ఒక్కరు కూడా లేరా..? అయినా, నైంటీస్‎లో లభించినంత ఆదరణ గత పది సంవత్సరాల్లో ఎందుకు లభించలేదు..? ఈ విషయం అర్థం కావాలంటే, మనం ఓ బిజినెస్ సీక్రెట్‎ను చేధించాల్సివుంటుంది.

అసలు మిస్ యూనివర్స్ పోటీల్లో ఫలితాలను ఎవరు ప్రభావితం చేస్తారో తెలుసా..? వినియోగదారులు, వ్యాపారులు. మీకు ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం..! అదేంటి..? అందాల పోటీల్లోకి వినియోగదారులు, వ్యాపారులు ఎలా వచ్చారు..? అసలు అందాల పోటీలకు వారికి సంబంధమేంటని ఆలోచిస్తున్నారా..? అక్కడే వుంది అసలు కథంతా. అసలు రెండవ, మూడవ ప్రపంచ దేశాలు మాత్రమే, అందాల పోటీల్లో ఎక్కువగా విజయం సాధిస్తాయెందుకు..? అగ్రదేశాలకు అందాల కిరీటాలు ఎందుకు దక్కవు..? ఈ ప్రశ్నలకు కూడా మళ్లీ అదే సమాధానం. వినియోగదారులు, వ్యాపారులు. ప్రపంచంలో ఇప్పుడు కన్జ్యూమరిజమ్ గరిష్టస్థాయికి చేరుకుంది. అగ్రదేశాల్లో సౌందర్య సాధనాలు, చర్మ సంరక్షణ ఉత్పత్తులకు కొత్తగా మార్కెట్ సృష్టించాల్సిన పనిలేదు. సో.. బ్యూటీ ప్రొడక్ట్స్ బ్రాండ్ వాల్యూ పెరగడానికి అక్కడ అవకాశాలు లేవు. అందుకే, రెండవ, మూడవ ప్రపంచ దేశాల నుంచే అందాల భామలు ఎన్నికవుతున్నారు. దీని వెనుకున్న నిగూఢ రహస్యం మీకు ఈపాటికే అర్థమయ్యి ఉంటుంది. ఎస్.. కాస్మెటిక్ మాఫియా. బ్యూటీ ప్రొడక్ట్స్‎ అమ్మకాలతో లక్షల కోట్లు సమకూర్చి పెట్టే మార్కెట్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే వుంది. అందుకే, వారి భాషలో సెకండ్ అండ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచే మిస్ వరల్డ్‎లు, మిస్ యూనివర్స్‎లు ఎన్నికవుతున్నారు.

17వ శతాబ్దం నుంచి ప్రపంచ ఫ్యాషన్‎కు కేరాఫ్‎గా చెప్పుకునే ఫ్రాన్స్,.. అందాల పోటీలు ప్రారంభమైన ఈ 70 ఏళ్లలో రెండంటే రెండు అందాల కిరీటాలు గెలుచుకుంది. 1951లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైన రెండేళ్లకు.. అంటే, 1953లో ఒకే ఏడాది మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ టైటిల్స్ గెలిచింది ఫ్రాన్స్. అంటే, ఫ్యాషన్ రాజధానిగా చెప్పుకునే ఫ్రాన్స్‎లోనే అందగత్తెలు లేరా..? ఉన్నారు, కానీ కారణం అందం కాదు.. వ్యాపారం. సౌందర్య సాధనాల వ్యాపారానికి ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ అందాలభామలు వెలుగులోకి వస్తారు. ఇదీ అసలు బిజినెస్ స్ట్రాటజీ. ఫ్రాన్స్ ఆల్రెడీ ఫ్యాషన్ కేపిటల్. అక్కడ బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్ పెరుగుదలకు ఎలాంటి అవకాశం లేదు. అందుకే, కాస్మెటిక్ మాఫియా కళ్లు.. ఫ్రాన్స్ వంటి అగ్రదేశాలు కాకుండా.. రెండవ, మూడవ ప్రపంచ దేశాలపై పడ్డాయి. ఇందుకు వెనెజులా బెస్ట్ ఎగ్జాంపుల్

వెనెజులా ఒకప్పుడు ఆయిల్ రిచ్ కంట్రీ. ఇటీవలికాలంలో ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది గానీ, అంతకుముందు వరకు అది సంపన్న దేశమే. అప్పట్లో అక్కడి ప్రజలకు కొనుగోలు శక్తి చాలా ఎక్కువగా వుండేది. అందుకే, కాస్మెటిక్ కంపెనీలకు ఆ దేశం టార్గెట్‎గా మారింది. దీంతో, ఏ దేశం గెలుచుకోనన్ని మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటాలు వెనెజులా సొంతమయ్యాయి. 7 మిస్ యూనివర్స్, 6 మిస్ వరల్డ్ కిరీటాలతో ప్రపంచంలో అత్యధిక బ్యూటీ పీజియంట్ టైటిల్స్ సాధించిన దేశంగా వెనెజులా మొదటిస్థానంలో నిలిచింది. చివరిసారిగా 2013లో వెనెజులా మిస్ యూనివర్స్ టైటిల్ నెగ్గింది. కానీ, అప్పటివరకు విరివిగా టైటిళ్లు సాధించిన వెనెజులా 2014 నుంచి ఒక్క టైటిల్‎కు కూడా నోచుకోలేదు. ఎందుకో తెలుసా..? జూన్ 2014లో చమురు ధరలు తీవ్రంగా క్షీణించాయి. దీంతో భౌగోళిక రాజకీయాలు వెనుజులాను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి. ధనవంతుల దేశాన్ని పేదరికంలోకి నడిపించాయి. ఇక, డబ్బుల్లేని పేద దేశంలో కొనుగోలు శక్తి ఏముంటుంది..? అందుకే, కాస్మెటిక్ మాఫియా వెనుజులాకు గుడ్ బై చెప్పింది. దీని ప్రభావమే అక్కడి అందాల రాణులకు ముసుగు వేసింది. వెనెజులా తర్వాత 11 కిరీటాలతో అమెరికా రెండో స్థానంలో, 9 కిరీటాలతో భారత్ మూడో స్థానంలో వుంది. దీనిని బట్టి కాస్మెటిక్ మాఫియా టార్గెట్ ఏంటో క్లియర్‎గా అర్థం చేసుకోవచ్చు. జనాభా, ఆర్థిక వృద్ధి, వినియోగదారుల కొనుగోలు శక్తి ఎక్కడ ఎక్కువగా వుంటే, ఆ దేశాల నుంచే ఎక్కువగా అందాల రాణులు పుట్టుకొస్తారన్నమాట. ఇదీ అసలు సంగతి..!

ఇక, భారత్ విషయానికి వద్దాం. 1966లో బొంబాయికి చెందిన రీటా ఫారియా మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకోవడంతో.. అప్పట్లో భారత్ పేరు మారుమోగింది. అయితే, 70వ, 80వ దశాకాల్లో దేశానికి ఒక్కటంటే ఒక్క టైటిల్ దక్కలేదు. వాస్తవానికి, అందాల పోటీల్లో టైటిల్ గెలిచేందుకు అర్హతగల మహిళలు మన దేశంలో అనేకమంది వున్నారు. కానీ, అప్పట్లో కాస్మెటిక్ ప్రొడక్ట్‎లకు దేశంలో ఎక్కువగా మార్కెట్ లేదు. మన మహిళలంతా సంప్రదాయబద్ధమైన, ప్రకృతి సిద్ధమైన సౌందర్య సాధానాలవైపే మొగ్గుచూపేవారు. 90వ దశకానికి ముందు మన దేశంలో పాశ్చాత్య సౌందర్య సాధనాల వాడకం చాలా తక్కువ. కొంతమంది సంపన్నులు, సినిమా సెలబ్రిటీలు మాత్రమే విదేశాల నుంచి తెప్పించుకుని వాడేవారు. కానీ, నైంటీస్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనికి కారణం లేకపోలేదు.

90వ దశకానికి ముందు మన దేశంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా వుండేది. 1991లో పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేపట్టడంతో విదేశీ కంపెనీలకు ద్వారాలు తెరిచినట్టయింది. దీంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటమే కాకుండా.. వినియోగదారుల కొనుగోలు శక్తి కూడా పెరిగింది. సరిగ్గా ఆర్థిక సంస్కరణలకు పునాది పడిన మూడో ఏట నుంచి మన దేశంలో బ్యూటీ క్వీన్ల హవా మొదలైంది. 1994 నుంచి సగటున ప్రతి మూడేళ్ల కోసారి అందాల కిరీటం మనల్ని పలకరిస్తూవస్తోంది. అది మిస్ యూనివర్స్ కావచ్చు. లేదా మిస్ వరల్డ్ కావచ్చు. 1994లో సుస్మితా సేన్ విశ్వసుందరిగా, ఐశ్వర్య రాయ్ ప్రపంచ సుందరిగా ఎన్నికయ్యారు. 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషీ చిల్లర్ ప్రపంచ సుందరి కిరిటాన్ని గెలుపొందగా.. 2000 సంవత్సరంలో లారా దత్త రూపంలో మరోసారి విశ్వసుందరి కిరీటం దక్కింది. తాజాగా హర్నాజ్ సంధు రూపంలో భారత్‎ను మూడోసారి విశ్వసుందరి కిరీటం వరించింది.

అయితే, ఒకప్పుడు అందాల పోటీల్లో ఎంట్రీలే కరువైన భారత్‎కు.. విరివిగా కిరీటాలు దక్కడం ఆశ్చర్యానికి గురిచేసింది. 1966 రీటా ఫారియాను మినహాయిస్తే 1994 నుంచి ఈ 27 ఏళ్లలో ఏకంగా భారత్ ఏకంగా ఎనిమిది అందాల కిరీటాలను దక్కించుకుంది. దీనికంతటికీ కారణం కాస్మెటిక్ కంపెనీల మార్కెట్ మాయాజాలం. ఎప్పుడైతే పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని.. భారత్‎లో పాశ్చాత్య కంపెనీలకు ద్వారాలు తెరుచుకున్నాయో.. అప్పటి నుంచి మన దేశంలో కాస్మెటిక్ బిజినెస్ ఊపందుకుంది. అప్పటినుంచి ఎన్నో వెస్ట్రన్ ప్రొడక్ట్స్ ఇండియన్ మార్కెట్‎ను ముంచెత్తాయి. లాఓరెల్, లాక్మే, యునీలీవర్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్.. పేరేదైనా.. సహజసిద్ధమైన, ప్రకృతి మిళితమైన పద్దతులను మరిపించి.. సౌందర్య పోషణలో పాశ్చాత్య పోకడలను మనపై బలవంతంగా రుద్దాయి ఈ కంపెనీలు. తద్వారా లక్షల కోట్లు కొల్లగొట్టాయి. ఇందుకోసం మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ టైటిల్స్ ఎరగావేసి.. వారితో మార్కెటింగ్ చేయించి బిజినెస్ చేయడం ప్రారంభించాయి. అందుకే, 90వ దశకంలో మనకు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ టైటిల్స్ దక్కాయి.

అయితే, ఈసారి మనకు మిస్ యూనివర్స్ రావడానికి చాలా సమయం పట్టింది. 2017లో మానుషీ చిల్లర్ మిస్ వరల్డ్ గెలుచుకున్నప్పటికీ.. గడిచిన దశాబ్దకాలంలో మనకు దక్కినవి రెండే అందాల కిరీటాలు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు అందాల పోటీలు మళ్లీ భారత్ వైపు ఎందుకు చూస్తున్నాయి..? అంటే, దీనికి కారణం లేకపోలేదు. 1991 తర్వాత ఆర్థిక సంస్కరణల వల్ల దేశంలో కొనుగోలు శక్తి పెరిగింది. దీంతో అప్పడు అందాల కిరీటాలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కూడా దేశంలో అలాంటి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. మోదీ నేతృత్వంలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా రూపుదిద్దుకుంటోంది. వినియోగదారుల కొనుగోలు శక్తి మునుపెన్నడూ లేనంతగా పెరుగింది. కరోనా మహమ్మారి తర్వాత కూడా భారత్ తన వినియోగదారుల కొనుగోలు శక్తిని నిలుపుకోగలిగింది. ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించుకోగలిగింది. అంతేకాదు, భారత్ యువజన దేశం. దేశంలో ప్రస్తుతం 35 ఏళ్లలోపు జనాభా 65 శాతం. సో, అంతర్జాతీయ సౌందర్య సాధనాల బ్రాండ్‌లు, చర్మ సంరక్షణ ఉత్పత్తులకు ఈ గణాంకాలు బాగా సరిపోతాయి. అంతేకాదు, ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఉద్భవించింది.

నిజానికి, భారతీయ సౌందర్య సాధనాల పరిశ్రమ అంతర్జాతీయ బ్రాండ్‌లకు సానుకూలమైన మార్కెట్. ప్రపంచ సౌందర్య సాధనాల మార్కెట్ పరిమాణం 2019లో 380.2 బిలియన్‌ డాలర్లు. 2027 నాటికి 463.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇక, భారత్ లో సౌందర్య సాధనాల పరిశ్రమ మార్కెట్ విలువ డిసెంబర్ 2020లో 15 బిలియన్ డాలర్ల కంటే కొంచెం ఎక్కువ. 2022 నుంచి ఈ రంగం 2.8 శాతం వృద్ధి చెందుతుందనే అంచనాలున్నాయి. బలపడుతున్న ఆర్థిక వ్యవస్థ, యువ జనాభా, పెరుగుతున్న వినియోగదారుల కొనుగోలు శక్తి, చైనా నుంచి దూరమవుతున్న అంతర్జాతీయ బ్రాండ్లు.. వెరసి భవిష్యత్తులో సౌందర్య సాధనాల పరిశ్రమలో భారత్‎ను అగ్రగామిగా చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే, ఇప్పుడు కాస్మెటిక్ కంపెనీల దృష్టి మళ్లీ భారత్‎పై పడింది. అందాల కిరీటాలతో మార్కెటింగ్ చేసుకుని.. లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు అవి సిద్ధమవుతున్నాయి. అందుకే, నైంటీస్ పరిస్థితులు మళ్లీ పునరావృతం అవుతున్నాయి. ఈ అంచనాలు ఫలిస్తే గనుక.. సమీప భవిష్యత్తులో భారత్ మరిన్ని మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ టైటిళ్లు కొల్లగొట్టడం ఖాయం.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

five + 10 =