చైనాకు చెందిన ఎన్నో మొబైల్ ఫోన్స్ ప్రస్తుతం భారత దేశంలో ఉన్నాయి. ఎన్నో వేల కోట్ల ఆదాయాన్ని భారతీయుల నుండి చైనా కంపెనీలు పొందుతూ ఉన్నాయి. ధర తక్కువ.. ఫీచర్స్ ఎక్కువ కావడంతో ప్రజలు ఎక్కువగా చైనా మొబైల్స్ వైపు చూస్తున్నారు. చైనాకు చెందిన ఒప్పో, షావొమీ, వన్‌ప్లస్ మొబైల్ కంపెనీల కార్యాలయాలు, ఉన్నతాధికారుల ఇళ్లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించింది. భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టు నిఘా విభాగం ఇచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు నిర్వహించారు. చైనా మొబైల్ సంస్థల సీఈవోలు, ఇతర ప్రతినిధులను ఐటీ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గ్రేటర్ నోయిడా, కోల్‌కత, గువాహటి, ఇందోర్‌తోపాటు పలు ప్రాంతాల్లో 24కుపైగా కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.
బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఐటీశాఖ ఆధ్వర్యంలో పలు బృందాలు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించాయి. చైనీస్ మొబైల్ కంపెనీలకు చెందిన గోడౌన్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడ నుంచి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉత్పత్తుల సరఫరా, విక్రయం, ఆర్థిక సేవల్లో ఉన్న కొన్ని కంపెనీలూ ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. పన్ను ఎగవేసినట్టు నిరూపించే డిజిటల్ సమాచారాన్ని గుర్తించి, సీజ్ చేసినట్టు సమాచారం. ఐటీ అధికారులకు సహకరిస్తున్నట్టు ఒప్పో సంస్థ వెల్లడించింది. భారతీయ చట్టాలకు అనుగుణంగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నట్టు షావొమీ తెలిపింది.
ఈ ఏడాది ఆగస్టులో చైనాకు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ZTEని గురుగ్రామ్‌లోని ఐటీ విభాగం సోదాలు నిర్వహించింది. ఆ సంస్థ ఇండియా చీఫ్‌ని కూడా ఐటీ శాఖ అధికారులు ప్రశ్నించారు. అనేక పన్ను ఉల్లంఘనలను ఐటీ శాఖ గుర్తించినట్లు వర్గాలు తెలిపాయి. మొబైల్ ఫోన్ల వ్యాపారం, రుణ దరఖాస్తులు మరియు రవాణా వ్యాపారంలో నిమగ్నమైన అనేక చైనా సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు జరుపుతున్నాయి.