హిందూ మహిళలను లైంగికంగా టార్గెట్ చేస్తున్న టెలిగ్రామ్ యాప్ పై చర్యలు తీసుకోరా..?

0
1173

మహిళలను వారి మతం ఆధారంగా లైంగిక దోపిడీ మరియు వేధింపులకు గురి చేయడంపై మీడియా, సోషల్ మీడియాలో ఎన్నో ప్రకంపనలు సృష్టించింది. లైంగిక వేధింపుల కోసం హిందూ మహిళల చిత్రాలను షేర్ చేస్తున్న కొన్ని యాప్‌లు, ఛానెల్‌లను సోషల్ మీడియా వినియోగదారులు హైలైట్ చేశారు.

ప్రముఖ సోషల్ మీడియా వినియోగదారు అన్షుల్ సక్సేనా ‘Hindu Ran*yan’ అనే టెలిగ్రామ్ ఛానెల్‌ గురించి తెలియజేశాడు. ఇందులో హిందూ మహిళలపై వేధింపులు, అవమానకరమైన, లైంగిక అసభ్యకరమైన సూచనలతో హిందూ మహిళల చిత్రాలను ఉపయోగిస్తున్నారని ప్రజలను అప్రమత్తం చేశారు. దీనిపై అన్షుల్ సక్సేనా ముంబై పోలీసులను ట్యాగ్ చేశారు, ఛానెల్ ద్వారా హిందూ మహిళలపై లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారని వారి దృష్టికి తీసుకువచ్చారు. అన్షుల్ ట్వీట్‌ను పంచుకున్న తర్వాత, అలాంటి ప్లాట్‌ఫారమ్‌లపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చాలా మంది అడగడం ప్రారంభించారు. అన్షుల్ ట్వీట్‌కి ఇప్పటివరకు 6000కు పైగా రీట్వీట్లు వచ్చాయి.

దీనిపై ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ కూడా స్పందించారు. ఆ టెలిగ్రామ్ ఛానెల్‌పై చర్యలు ప్రారంభించానని, అది బ్లాక్ చేయబడిందని ఐటీ మంత్రి బదులిచ్చారు. ఛానెల్ బ్లాక్ చేయబడిందని, ఛానెల్‌కు బాధ్యులైన వ్యక్తులపై తదుపరి చర్యల కోసం భారత ప్రభుత్వం రాష్ట్రాల పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటోందని ఐటీ మంత్రి వైష్ణవ్ తెలిపారు. అన్షుల్ చేసిన అసలు ట్వీట్‌లో ట్యాగ్ చేయబడిన ముంబై పోలీసులు మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు.

అనేక ఇతర ప్లాట్‌ఫారమ్‌లు, ఛానెల్‌లు హిందూ మహిళల చిత్రాలను అవమానకరమైన సందేశాలతో, తరచుగా లైంగికంగా అసభ్యకరమైన రీతిలో పంచుకుంటూ ఉన్నారు. అత్యాచారం, సామూహిక అత్యాచారం బెదిరింపులతో సహా నేరపూరిత ఉద్దేశ్యాలతో వీటిని కొందరు నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి కంటెంట్, లైంగిక చిత్రాలు, హిందూ మహిళలపై బెదిరింపులను షేర్ చేస్తున్న అనేక ఫేస్‌బుక్ పేజీలపై కూడా అన్షుల్ వివరాలని సేకరించాడు. దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ ఇలాంటి వాటిపై ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైందని, ఆ పేజీలను తొలగించాల్సిందిగా ఫేస్‌బుక్‌ను కోరతామని తెలిపారు.