సోనూ సూద్ రూ.20కోట్ల మేర ఆదాయపు పన్ను ఎగవేశాడట

సోనూ సూద్ సుమారు రూ.20కోట్ల మేర ఆదాయపు పన్ను ఎగవేసినట్లు శనివారం ఆదాపన్ను శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సోనూ సూద్ ఇళ్లు, కార్యాలయాల్లో గత మూడు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూషన్ చట్టాన్ని ఉల్లంఘించి సుమారు రూ.2.1 కోట్లు సమీకరించినట్లు తెలిపింది. సోనూ సూద్, అతడి సహచరుల ఇళ్లు, కార్యాలయాల్లో నిర్వహించిన తనిఖీల్లో పన్ను ఎగవేతకు సంబంధించిన అనేక కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీశాఖ చెప్పింది. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో నిరుపేదలకు సహాయపడేందుకు గత ఏడాది జులై నెలలో సూద్ ఛారిటీ ఫౌండేషన్ ను స్థాపించారు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఆ సంస్థ రూ.20 కోట్ల మేర విరాళాల రూపంలో సేకరించినట్లు తెలుస్తోంది. దీంట్లో ఇప్పటి వరకు 1.9 కోట్లను మాత్రమే ఖర్చు చేశారని అధికారులు గుర్తించారు.
ఏకంగా మూడు రోజుల సోనూసూద్ నివాసం, నాగ్‌పూర్, జైపూర్‌లోని కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఇవి సోదాలే(సర్వే)నని దాడులు(రైడ్స్) కావని ఐటీ అధికారులు ప్రకటించారు. ఈ సోదాల్లో అధికారులు భారీ మొత్తంలో పన్ను ఎగవేతను గుర్తించినట్లు తెలిసింది. బాలీవుడ్ చిత్రాలకు సంబంధించి తీసుకున్న పేమెంట్లు, వ్యక్తిగత ఆదాయం, రియల్ ఎస్టేట్‌కు సంబంధించి సోనూసూద్ పన్నులను ఎగవేసినట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. ఆయన చారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. లక్నోలో ఓ స్థిరాస్తి సంస్థతో సోనూసూద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో పన్ను ఎగవేత అనుమానాలున్నాయి. ఆ క్రమంలో బుధవారం నుంచి సర్వే ప్రారంభించాం అని ఐటీ అధికారి ఒకరు విలేకరులకు తెలిపారు.
సోనూసూద్ 20కోట్ల రూపాయలకు పైగా పన్ను ఎగవేసినట్టు ఆధారాలు సేకరించినట్టు అధికారులు వెల్లడించారు. సోనూసూద్ ఆర్థిక లావాదేవీలతో పాటు.. సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించారు. 11 లాకర్లను గుర్తించిన ఐటీ అధికారులు..కోటీ 8లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కరోనా టైమ్‌లో ఎంతోమంది వలస కూలీలను తమ గమ్యస్థానాలకు చేర్చిన సోనూసూద్‌పై ప్రశంసలు కురిశాయి. ఐతే ఆ సమయంలో సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ 18కోట్లకు పైగా విరాళాలు సేకరించింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు కోటీ 90లక్షల రూపాయలు సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేసినట్టు బ్యాంక్ ట్రాన్జాక్షన్స్ లో ఉంది. ఐతే మిగిలిన డబ్బు ఏమైందన్న అంశంపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫాం ను ఉపయోగించి సోనూసూద్ విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించారని ఐటీ శాఖ అధికారులు చెప్పారు. పన్ను ఎగవేత కోసం ఖాతాలను పుస్తకాల్లో రుణాలుగా మభ్యపెట్టారని అధికారులు వెల్లడించారు.