భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. అర్ధరాత్రి 12 గంటలా 7 నిమిషాలకు నింగికెగసింది. యూకేకి చెందిన ఉపగ్రహాల్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. 19 నిమిషాల 7 సెకన్లలో ఈ ప్రయోగం పూర్తయింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో సైంటిస్టులంతా హర్షం వ్యక్తం చేశారు. యూకేతో జరిగిన ఒప్పందం ప్రకారం మార్చిలోగా మరో ఆరు ప్రయోగాలు చేయనుంది ఇస్రో. 36 వన్‌వెబ్ ఉపగ్రహాలతో కూడిన మరో సెట్‌ను వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎల్‌విఎం3 ప్రయోగించనున్నట్లు ఆయన తెలిపారు.
న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్, యూకే-ఆధారిత నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ (వన్‌వెబ్ లిమిటెడ్) మధ్య వాణిజ్య ఏర్పాటులో భాగంగా ఈ మిషన్ నిర్వహిస్తున్నారు. స్పేస్ ఏజెన్సీ ప్రకారం, వన్ వెబ్ 36 ఉపగ్రహాలు ఈ మిషన్ కింద తీసుకువెళ్లనున్నారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. LVM3-M2/OneWeb India-1 మిషన్ 36 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశించిన కక్ష్యలోకి చేర్చినట్లు ఇస్రో ధృవీకరించింది. గత అర్ధరాత్రి సరిగ్గా 12.07 గంటలకు చేపట్టిన ఎల్‌వీఎం-3 ప్రయోగం విజయవంతమైంది. వన్‌వెబ్ అభివృద్ధి చేసిన 36 ఉపగ్రహాలతో విజయవంతంగా నింగికెగసిన రాకెట్ వాటిని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.