ఇజ్రాయిల్ కొత్త స్ట్రాటజీ..! ‘HAMAS’ నిర్మూలనకు మరో ఎత్తుగడ..!!

0
1194
Israel x Palestine - boxing fists

ఎనభయ్యో దశకం ఆరంభం నుంచీ ‘మెర్కవా’ ట్యాంకులతో నిప్పులు కక్కిన సైన్యం, ఎఫ్-ఫిఫ్టీన్ థండర్ డేగతో గగనతలంలో వైరికి ముచ్చెమటలు పట్టించిన వాయుసేన, జెరికో శతఘ్నులను మోహరించి ‘హమాస్’ ఆటకట్టించిన డిఫెన్స్ ఫోర్స్, డాల్ఫిన్ సబ్ మెరైన్ సాయంతో సాగరమథనం చేసి, వర్తమానంలో పక్షిని పోలిన ఆయుధ ‘డ్రోన్’ను కనిపెట్టిన ఇజ్రాయిల్ రక్షణ బలగం ప్రస్తుతానికి నిలకడ వ్యూహాన్ని ప్రదర్శిస్తోంది. ఇటీవలి ‘వేసవి సాయుధ ఘర్షణ’ల తర్వాత కొత్త రణ తంత్రాన్ని రచిస్తోంది. దశాబ్దాలుగా దన్నుగా నిలిచిన అమెరికా తన ‘సామర్థ్య పున:పరిశీలన’లో పడిన నేపథ్యంలో కొత్త వ్యూహం అవసరాన్ని గుర్తించారు ఇజ్రాయిల్ నూతన ప్రధాని నఫ్టాలీ బెన్నెట్.

బెన్ గొరియన్ వ్యూహాన్ని అనుసరించడమా? బెంజిమిన్ నెతన్యాహూ యుద్ధ కౌశలాన్ని నమ్ముకోవడమా? అనే సందిగ్ధతలో ఉన్నారు కొత్త ప్రధాని బెన్నెట్. ‘‘Israel’s new PM has to choose between Ben Gurion and Netanyahu’s strategies’’ శీర్షికన ఇండియన్ ఎక్స్ ప్రెస్ జూన్ 24న ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.  

ఈ కథనంలో ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించింది…‘‘Around the world and in Israel, there is no topic more frequently discussed than that of the conflict between Israelis and Palestinians’’ అంటే  ఇజ్రాయిల్ లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నిరంతరం చర్చలో ఉండే అంశం ఇజ్రాయిల్-పాలస్తినా అంశమే’’ అని పేర్కొంది.

ప్రపంచంలో ఇజ్రాయిల్ ను అపప్రదపాలు చేసే కుట్ర వెనుక ఉద్దేశాలేంటి? ‘మిలిటరీ ప్రాఫెట్’గా చిత్రించే ప్రయత్నం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయి? ‘పెగాసస్’ స్పైవేర్ ప్రచారం ఇప్పుడే ఎందుకు మొదలైంది? ప్రాభవం కోల్పోయిన పాలస్తినా ఉద్యమం గురించి కొత్త ప్రాపగండాను లంకించుకున్నవామపక్ష మేధావుల ఉద్దేశాలేంటి? రాబోయే రోజుల్లో ఇజ్రాయిల్ అనుసరించే వ్యూహం ఎలా ఉండబోతోంది?

ఇలాంటి ఆసక్తికరమైన అంతర్జాతీయ పరిణామాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆఫ్ఘన్ యుద్ధరంగం నుంచి అమెరికా సేనలు తిరోగమించాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లోగా 2003 నుంచి ఇరాక్ లో ఉన్న బలగాలు సైతం అమెరికా చేరుకుంటాయి. జోబైడెన్ సిరియా విషయంలో అంతర్మథనంలో పడ్డారు. Foreign affairs పత్రిక జూలై 27న ‘‘The Search for a Syria Strategy’’ పేరుతో సిరియా విధాన పునస్సమీక్షపై ఓ కథనాన్ని ప్రచురించింది. సిరియా విషయంలో ఒబామా మొదలు ట్రంప్ వరకూ చేసిన పొరపాట్లను ఈ కథనం ఎత్తి చూపింది. అనవసర జోక్యాల కారణంగా పెనునష్టం పొందిన అమెరికా పరపతి గురించి కొన్ని హెచ్చరికలు చేసింది.

ప్రపంచంలో కేవలం ఇజ్రాయిల్-పాలస్తినా వివాదం మాత్రమే ఎందుకు చర్చలో సజీవంగా ఉంటుంది? అనే ప్రశ్న భౌగోళిక రాజకీయ వివాదాల చరిత్రలో అత్యంత కీలకమైంది. కేవలం పాలస్తినా-ఇజ్రాయిల్ వివాద చరిత్ర  కేంద్రంగా ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే అత్యంత ఆసక్తికరమైన సూత్రీకరణలు చేయవచ్చంటారు నిపుణులు.

పశ్చిమ దేశాలు విశ్వసించే పెట్టుబడి కేంద్రిత తాత్వికత, ఊహాజనిత విశ్వాసాల ఊబిలో కొట్టుకులాడే మార్క్సియన్ గతితార్కిక భౌతికవాదం, ఉగ్రవాదం విశ్వసించే ఇస్లామిక్ ఫండమెంటలిజంల మధ్య జరిగిన మారణహోమమే ఇజ్రాయిల్-పాలస్తినా ఘర్షణగా అభివర్ణిస్తారు నిపుణులు. 

ఈ ఏడాది జూన్ 13న ఇజ్రాయిల్ పార్లమెంట్ ‘కెన్సెట్’లో 59 ఓట్లతో నెగ్గి ప్రధాని పగ్గాలు చేపట్టిన నఫ్టాలీ బెన్నెట్ మారిన ప్రపంచ పరిస్థితుల్లో కొత్త వ్యూహరచనకు సిద్ధమయ్యారు. ఇజ్రాయిల్ ఇండిపెండెంట్ స్ట్రాటజిక్ థింక్ ట్యాంక్ ‘‘The Institute for National Security Studies-INSS’’ సంస్థ ఆగస్ట్ 1వ తేదీన ‘‘Strategic Challenges Facing Israel, and Policy Recommendations: Special Update for the President’’ పేరిట ఓ నివేదికను దేశాధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ కు అందజేసింది.

గడచిన ఆరుమాసాలుగా ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలు, పాలస్తినా ఉగ్రవాద సంస్థ ‘హమాస్’ వ్యూహం-ఎత్తుగడల్లో వచ్చిన మార్పులపై తనదైన శైలిలో చేసిన అధ్యయనాన్ని ప్రభుత్వానికి సమర్పించింది.

అంతమాత్రాన ఇజ్రాయిల్ రక్షణాత్మక వ్యూహాన్ని అనుసరించే అవకాశం లేదు. డిఫెన్స్ స్ట్రాటజీని అవలంబిస్తే చుట్టూ మోహరించిన అరబ్బు దేశాల నుంచి పొంచి ఉన్న ప్రమాద తీవ్రతను తక్కువ అంచనా వేయడమే అంటారు ఇజ్రాయిల్ పై అధ్యయనం చేసిన నిపుణులు. 2000 తర్వాత మొదలైన రెండో ‘ఇంతిఫదా’ 2010 తర్వాత కాస్త నెమ్మదించింది. 2020 తర్వాత పెంటగాన్ తాను అనుసరించిన ‘‘పశ్చిమాసియా వ్యూహం’’ విషయంలో ఆత్మావలోకనంలో పడింది.

మధ్య ఆసియా, దక్షిణాసియాలో చైనా ప్రాబల్యం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలోనే అమెరికా తన వెనుకడుగును ఖరారు చేసింది. పశ్చిమాసియాను తన గుప్పిట్లో పెట్టుకోవాలని అమెరికా చేసిన ప్రయత్నాలన్నీ అత్యంత దారుణంగా విఫలమయ్యాయి. సరిగ్గా ఈ సందర్భంలోనే వామపక్ష వాసనలున్న ప్రభుత్వం ఇజ్రాయిల్ లో అధికార పగ్గాలు చేపట్టింది.

మాజీ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ కొత్త ప్రభుత్వం ఇజ్రాయిల్ కొంపముంచుతుందని నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నారు. నెతన్యాహూ గద్దెదిగేందుకు సరిగ్గా కొన్ని వారాల వ్యవధి ఉండగానే మే మొదటి వారంలో ఇజ్రాయిల్-పాలస్తీనాల మధ్య పరస్పరం భారీ ఎత్తున శతఘ్నుల దాడులు జరిగాయి. మాజీ ప్రధాని నెతన్యాహూ కొత్త ప్రభుత్వాన్ని ‘‘dangerous left-wing government’’ గా అభివర్ణించారు.

ఇందుకు సంబంధించిన కథనం న్యూయార్క్ టైమ్స్, జూలై 4 సంచికలో ‘‘Fragile Israeli Coalition to Oust Netanyahu Faces Growing Pressure’’ శీర్షికన వెలువడింది. ‘‘“dismantling the walls of the country, brick by brick, until our house falls in on us.” అంటూ తాజా స్థితిని వ్యాఖ్యానించారు నెతన్యాహూ. ఈ నేపథ్యంలో బెన్నెట్ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది అనే ప్రశ్న అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

1914 నుంచి 2021 వరకూ అరబ్బుదేశాల దాడిని, ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తమైన తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టిన ఇజ్రాయిల్ 21 శతాబ్దంలో ఇరకాటంలో పడింది. పొరుగుదేశం లెబనాన్ లో హిజ్బుల్లా బలం పుంజుకుంది. పాలస్తినాలోని గెరిల్లా సంస్థ ‘హమాస్’కు ఇరాన్ పూర్తి స్థాయి ఆయుధ సహకారాన్ని అందిస్తోంది. Sub-terranian warfare ను మరింత ఆధునీకరించింది హమాస్. మారిన ఈ నేపథ్యమే ‘మే’ దాడులకు పురికొల్పింది.

Institute for National Security Studies రూపొందించిన నివేదికలో  ‘‘Objectives for Israel’s Grand Strategy’’అనే ప్రత్యేక విభాగంలో కీలక పరిశీలనలు చేసింది. ‘‘Israel’s historical security concept emphasizes deterrence, early warning, defense in all dimensions, and the ability to achieve decisive victory. In recent years this concept has been partially implemented. Peace agreements with Egypt, Jordan, and other regional states as well as the special US-Israel relationship remain pillars of Israel’s national security’’ అంటే…‘‘వైరి నిలువరింపు, ముందస్తు హెచ్చరిక, అన్నివైపులా రక్షణ వలయం అంతిమంగా నిర్ణయాత్మక విజయాన్ని సునాయాసం చేస్తుందని ఉద్ఘాటిస్తుంది ఇజ్రాయిల్ చారిత్రక భద్రతా వ్యూహం. కొన్నేళ్లుగా ఈ విధానాన్ని పాక్షికంగా అమలు చేస్తున్నాం. ఈజిప్ట్, జోర్డాన్ సహా ఇతర అరబ్ దేశాలతో శాంతి ఒప్పందాలు చేసుకోవడంతో పాటు, అమెరికాతో ద్వైపాక్షిక బంధమే అంతిమంగా ఇజ్రాయిల్ భద్రతకు మూలస్థంబాలు’’ అంటూ పేర్కొంది. మొత్తంగా పొరుగున ఉన్న అరబ్ దేశాలతో శాంతిమంత్రం జపించి వ్యూహాత్మక సహనాన్ని పాటించాలని భావిస్తోంది ఇజ్రాయిల్. ప్రధాన శతృవు పాలస్తినాను నిలువరించేందుకు ఇలాంటి వ్యూహమే మేలు చేస్తుందని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ భావిస్తోంది.

‘‘Biden’s decision to try to return to the nuclear deal with Iran, the formation of a new government in Israel, and growing tensions in Israeli society, including clashes between Arabs and Jews in Israeli cities’’-ఇరాన్ తో అణుఒప్పంద పునరుద్ధణకు జో బైడెన్ ప్రయత్నం, ఇజ్రాయిల్ లో నూతన ప్రభుత్వ ఏర్పాటు, ఇజ్రాయిల్ సామాజిక ఉద్రిక్తత, పట్టణ ప్రాంతాల్లో అరబ్బులు, యూదుల మధ్య ఘర్షణ’’ల నేపథ్యంలో కొత్త వ్యూహం అవసరమని Institute for National Security Studies సంస్థ అభిప్రాయపడింది.

‘‘Institute for National Security Studies’’ వెబ్ సైట్ లో మరో ఆసక్తికరమైన కథనం కూడా ఉంది.  ‘‘Lebanon’s Collapse, and the Significance for Israel’’ అనేది ఈ కథనం శీర్షిక. లెబనాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం, ఆర్థిక పతనం, ఘర్షణాత్మక స్థితి క్రమంగా తీవ్రమవుతున్న కారణంగా ఇజ్రాయిల్ కొత్త ప్రభుత్వం వీలైనంత త్వరలో ‘లెబనాన్ విధానాన్ని ఖరారు చేయడం అనివార్యంగా మారింది.

లెబనాన్ అంతర్గత సంక్షోభం పెరుగుతున్నకొద్దీ ‘హిజ్బుల్లా’ ప్రాబల్యం మరింత విస్తరిస్తుంది. ఇది ఇజ్రాయిల్ కు ప్రమాదకరంగా పరిణమిస్తుంది.

మిగతా దేశాల విషయంలో ఎలా ఉన్నా పాలస్తినా విషయంలో మాత్రం ఇజ్రాయిల్ మొదటికన్నా మరింత కఠినంగా ఉండాలని నిర్ణయించింది. ఇరాన్ ను నిలువరిస్తూనే ‘హమాస్’ నుకట్టడి చేయాలని తాజా వ్యూహాత్మక విధానంలో పేర్కొన్నట్టూ సమాచారం. ఇరాన్, ఇరాక్, లెబనాన్, సిరియాల నుంచి వచ్చిపడే క్షిపణులు ఇజ్రాయిల్ వ్యూహాత్మక కేంద్రాలపై దాడి చేసే అవకాశం ఉందని మోస్సాద్ ఇటీవలే హెచ్చరించింది. గాజా, లెబనాన్ ల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు two-front war కు సిద్ధంగా ఉండాలని బలగాలకు సూచించింది.

ఇజ్రాయిల్ వ్యతిరేక వైఖరి ఇటీవలే పెచ్చుమీరడానికి కారణమూ లేకపోలేదు. చైనా దూకుడు, అమెరికా వెనుకడుగూ, రష్యా మౌనం, బ్రిటన్, జర్మనీ, జపాన్ ల వేచి చూసే ధోరణి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరోసారి పాలస్తినా అంశాన్ని తెరపైకి తెస్తున్నారు వామపక్ష మేధావులు.

ప్రధానంగా అమెరికాలోని Massachusetts Institute of Technology –MITలో పనిచేసే ప్రముఖ లింగ్విస్ట్, రచయిత Noam Chomsky లాంటి వారు పనిగట్టుకుని మరీ మరోసారి పాలస్తినా అంశాన్ని లేవదీస్తున్నారు. ఇందులో భాగంగానే భారత్ లో ది వైర్, ప్రింట్ లాంటి పత్రికలు, అంతర్జాతీయ స్థాయిలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ‘పెగాసస్’ స్పైవేర్ అంశాన్ని తెరపైకి తెచ్చి అల్లరి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇజ్రాయిల్ పత్రిక ‘హా ఆర్తెజ్’ ‘‘Why Do Leftists Love a Palestinian Cause That Rejects Their Values?’’ పేరిట ఓ కథనాన్ని ప్రచురించింది. ఆనేక ఆసక్తికరమైన, చారిత్రక అంశాలను ఇందులో ప్రస్తావించింది. ఎనభైల ఆరంభంలో సెక్యూలర్ భావనలతో ఉన్న పాలస్తినా ఉద్యమాన్ని పశ్చిమ దేశాల్లోని వామపక్ష మేధావులు సమర్థించారు.

తొంభైల తర్వాత పాలస్తినా ఉద్యమం క్రమంగా ఇస్లామిక్ ఫండమెంటలిజంవైపు మళ్లిందని ఈ కథనం స్పష్టం చేసింది. మత విశ్వాసాల ప్రాతిపదికన, అర్థరహితమైన హింసను ఆధారం చేసుకుని కొనసాగుతున్న ఉద్యమాన్ని వామపక్ష మేధావులు ఎలా సమర్థిస్తారని ఈ కథనం ప్రశ్నించింది.

‘‘Washington Jewish Week’’ వారపత్రిక జూలై 14 సంచికలో అమెరికా న్యాయవాది, ట్రంప్ సన్నిహితుడు మైఖెల్ కోహెన్  ‘‘The left needs to face the complicated facts about Israel’’ శీర్షికన రాసిన వ్యాసంలో సైతం వామపక్ష మేధావులు అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. వామపక్ష మేధావులు సంక్లిష్టమైన సామాజిక అంశాలను లోతుగా పరిశీలించకుండా సరళరేఖలో చూసి వ్యాఖ్యానించడం, నలుపు, తెలుపుల వర్ణాలు పులిమి సమస్యను అర్థం కాకుండా చేయడంలో దిట్టలనీ విమర్శించారు.

సరిగ్గా ఇదే సందర్భంలో మనదేశంలో సైతం దేశరాజధాని ఢిల్లీ కేంద్రంగా ఆజాద్ కశ్మీర్, పాలస్తినా ఉద్యమ సంఘీభావ సభలు సభలు జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. ‘‘Gaza’s rockets part of resistance’’ అంటూ వ్యాఖ్యానించారు ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్. ప్రతిఘటన యుద్ధంలో భాగంగా గాజా క్షిపణులు ప్రయోగిస్తే-ఇజ్రాయిల్ ప్రతిదాడిని ఏమనాలి అనే ప్రశ్న వేసుకోకపోవడమే వామపక్ష మేధావుల లక్షణం. మొత్తంగా పశ్చిమాసియా నివురు గప్పిన నిప్పులా ఉంది. చమురు దేశాల్లో చెలరేగే కార్చిచ్చు ఆసియాకు వ్యాపిస్తే ఏమవుతుంది? ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు క్రమంగా బలపడటం వల్ల రాబోయే పరిణామాలు భారత్ కు ఎలాంటి ముప్పును తెచ్చిపెడతాయి? ఇలాంటి సందేహాలు విదేశాంగ విధాన నిపుణులనూ, అంతర్జాతీయ విశ్లేషకులను విపరీతంగా ఆలోచింపజేస్తున్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

5 × 3 =