International

హెచ్ఐవీకి ఇజ్రాయిల్ ఇంజక్షన్‎తో చెక్..!

వైద్య చరిత్రలో మేలిమలుపు. చికిత్స లేదు నివారణే మార్గమని భావిస్తున్న ఎయిడ్స్‌ వ్యాధిని ఇంజెక్షన్‌తో జయించే రోజులు రాబోతున్నాయి. దశాబ్దాల తరబడి మనిషిని పీడిస్తున్న హెచ్‌ఐవీ ఇక తోకముడవనుంది.

ఎయిడ్స్‌కు కారణమయ్యే ఈ వైరస్‌ను సమూలంగా అంతమొందించే సరికొత్త ఔషధాన్ని ఇజ్రాయెల్‌కు శాస్త్రవేత్తల బృందం జన్యువుల ఎడిటింగ్‌ విధానాన్ని ఉపయోగించి హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌ను కట్టడి చేసే కొత్త వ్యాక్సిన్‌ను కనుగొంది. టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీకి చెందిన న్యూరో బయోలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్‌ శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు నిర్వహించి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. జన్యు మార్పిడి విధానంలో అభివృద్ధి చేసిన ఈ ఔషధాన్ని ఇంజెక్షన్‌ రూపంలో ఒక్కడోసు ఇవ్వడం ద్వారా… హెచ్‌ఐవీని సమర్థంగా అడ్డుకుని, ఎయిడ్స్‌ నుంచి బాధితులకు విముక్తి ప్రసాదించే అవకాశముందని వారు స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఎయిడ్స్‌ పరిశోధనల్లో మేలిమలుపుగా శాస్త్రవేత్తలు దీన్ని అభివర్ణిస్తున్నారు.

పరిశోధన వివరాలను నేచర్‌ జర్నల్‌ ప్రచురించింది. ఈ వ్యాక్సిన్‌ ద్వారా శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీస్‌ అత్యంత సమర్థంగా ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క డోసు వ్యాక్సిన్‌తో హెచ్‌ఐవీ రోగుల్లో వైరస్‌ను తటస్థీకరించేలా చేయడంలో శాస్త్రవేత్తలు తొలి దశలో విజయం సాధించారు. ఈ ఇంజెక్షన్‌తో వైరస్‌ నిర్వీర్యం కావడంతో పాటు రోగుల ఆరోగ్యమూ బాగా మెరుగవుతోంది. ఇంజనీరింగ్‌–టైప్‌ బీ తెల్ల రక్తకణాల ద్వారా రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి హెచ్‌ఐవీ వైరస్‌ను న్యూట్రలైజ్‌ చేసే యాంటీ బాడీలు ఉత్పత్తయేలా ఈ వ్యాక్సిన్‌ పని చేస్తుంది.

ఎముక మజ్జలో బి-టైప్‌గా పిలిచే తెల్ల రక్తకణాలు తయారవుతాయి. పరిపక్వం చెందిన తర్వాత ఇవి ఎముక మజ్జ నుంచి రక్తం, గ్రంథుల వ్యవస్థల్లోకి ప్రవేశిస్తాయి. తర్వాత అక్కడి నుంచి వివిధ అవయవాలకు చేరుకుంటాయి. శరీరంలో బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించే కణాలు కూడా ఇవే! బి-కణాలు ఎదురుపడినప్పుడు హెచ్‌ఐవీ తదితర వైరస్‌లు వాటిపై ప్రభావం చూపి, విచ్ఛిన్నమయ్యేలా ప్రోత్సహిస్తాయి. అయితే, ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు… వైరస్‌లోని కొన్ని భాగాలను ఉపయోగించి ఈ బి-కణాల జన్యువుల్లో మార్పులు చేశారు. ఇలా మార్పులు చేసిన కణాలు… వైరస్‌ ఎదురుపడినా, దాని ప్రభావానికి గురికావు. అలాగే వైరస్‌ ప్రవర్తనను పసిగట్టి, తదనుగుణంగా తమ ప్రవర్తనను కూడా మార్చుకుంటాయి. హెచ్‌ఐవీని అడ్డుకునే యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. వైరస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తాయి.

సీఆర్‌ఐఎస్‌పీఆర్‌ అనే సాంకేతికత సహాయంతో టైప్‌-బి తెల్లరక్త కణాల జన్యువుల్లో మార్పులు చేశామని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ బార్జెల్ తెలిపారు.. తర్వాత వీటిని ప్రయోగశాలలో పరీక్షించగా… వైరస్‌ను సమర్థంగా అడ్డుకునేలా రక్తంలో భారీగా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని వెల్లడించారు.. ఈ ప్రతినిరోధకాలు హెచ్‌ఐవీని అత్యంత సమర్థంగా అడ్డుకోగలవన్న నిర్ధారణకు వచ్చామని తెలిపారు. తాము రూపొందించిన వ్యాక్సిన్ ద్వారా ఉత్పత్తయ్యే యాంటీబాడీలు అత్యంత సురక్షితమైనవి, సమర్థంగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. కేవలం హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ నివారణకే కాకుండా… కేన్సర్‌, రోగనిరోధక వ్యవస్థ స్వీయదాడి చేసుకునే ఆటోఇమ్యూన్‌ వ్యాధుల చికిత్సలోనూ ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుత పరిశోధనలో ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. జన్యు మార్పిడి చేసిన తెల్లరక్త కణాలతో ఎయిడ్స్‌ను నిరోధించే ఔషధాన్ని రూపొందించి, మరింత లోతైన పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందన్నారు. ఇవన్నీ పూర్తిచేసుకుని, ఔషధాన్ని అందుబాటులో తీసుకురావడానికి మరికొన్ని సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. హెచ్ఐవీని మొదటిసారిగా మధ్య ఆఫ్రికాలోని చింపాంజీల్లో గుర్తించారు. దాని నుంచి 1800 సంవత్సరంలో మానవులకు వ్యాపించినట్టు నమ్ముతున్నారు. 90వ దశకంలోనే ఎయిడ్స్‌ను దక్షిణాఫ్రికాలో గుర్తించారు. హెచ్ఐవీ బాధితులతో అరక్షిత శృంగారం, వారి వాడిన సూదులను పంచుకోవడం వ‌ల్ల ఈ వైర‌స్ వ్యాపించే అవ‌కాశాలు ఎక్కువ‌.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

15 − one =

Back to top button