More

  పాలస్తీనాకు గల్ఫ్ దేశాల షాక్..!

  కొద్దిరోజులుగా అంతర్యుద్ధంతో అట్టుడికిన ఇజ్రాయిల్ – పాలస్తీనా పోరు.. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో సద్దుమణిగింది. పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడికి పాల్పడటం.. దీంతో ఆగ్రహించిన ఇజ్రాయిల్ ప్రతి దాడి చెయ్యడం, ఇలా ఇరు దేశాలు కూడా పరస్పర దాడులకు తెగపడ్డాయి. బాంబులను, క్షిపణులను విసురుకున్నాయి. అయితే, ఇజ్రాయిల్ యుద్ధతంత్రం ముందుకు పాలస్తీనా మరోసారి భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఏదేమైనా అమెరికా, ఈజిప్ట్ దేశాల దౌత్యం ఫలించడంతో పోరుకు తెరపడింది. అయితే, ఇజ్రాయిల్ వెనక్కి తగ్గడం వెనుక అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

  ఇజ్రాయిల్, పాలస్తీనా పరస్పర దాడులు పదిరోజులకు పైగానే సాగాయి. ఇరు దేశాలు భీకర యుద్దంతో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేశాయి. అయితే ఈ పోరును ఆపేందుకు ఐక్యరాజసమితితో పలు పలు దేశాలు గట్టిగానే ప్రయత్నించాయి. అయితే ఇజ్రాయిల్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అయితే ఆ రెండు దేశాల మధ్య వార్ ఇదే రీతిలో కొనసాగితే మూడో ప్రపంచ యుద్దానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని, ఇజ్రాయిల్ వెనక్కి తగ్గాలని మరోసారి ఐక్యరాజ్యసమితి గట్టిగానే సూచింది. అయినా, ఇజ్రాయిల్ తలొగ్గలేదు.

  మరోవైపు పాకిస్తాన్, టర్కీ ఈ వివాదం నుంచి లబ్ధిపొందడానికి హమాస్‌ను ఎగదోశాయి. అయితే, ఇదే సమయంలో అనూహ్యంగా యూఏఈ, సౌదీతో పాటు ఇతర గల్ఫ్ దేశాల నుంచి పాలస్తీనాకు మద్దతు కరువైంది. ఈ దేశాలన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్పితే.. వాటి నుంచి పాలస్తీనాకు ఎలాంటి మద్దతు లభించలేదు. బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, ఖతార్ దేశాల నుంచి కూడా పాలస్తీనాకు పూర్తిస్థాయి మద్దతుగా ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఇప్పుడు ఇదే అంశం పాలస్తీనాతో పాటు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఓవైపు 57 దేశాల ముస్లిం దేశాల కూటమి పాలస్తీనాకు మద్దతుగా ఆందోళన చేస్తున్న సమయంలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వెలువడిన ప్రకటన ఆశ్చర్యపరిచింది. ఇజ్రాయిల్ తో శాంతి ఒప్పందం చేసుకోవాలంటే ముందుగా చొరవచూపాల్సింది హమాసేనని ప్రకటించింది యూఏఈ. ఇలా ఇస్లామిక్ దేశాలకూటమికి భిన్నంగా యూఏఈ స్పందించడంపై పశ్చిమాసియాలోని ముస్లిం దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. యూఏఈ చేసిన ఈ ప్రకటనపై అటు పాలస్తీనీయులు సైతం ఖంగుతిన్నారు.
  అంతేకాదు ఒకవేళ ఇజ్రాయిల్ తో శాంతి ఒప్పందంలో హమాస్ చొరచూపకపోతే.., గాజాలో మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపట్టిన ప్రాజెక్టులకు తమ ఫండింగ్ ను సైతం నిలిపివేస్తామని యూఏఈ హమాస్ ను హెచ్చరించింది. గాజా స్ట్రిప్ లో పాలస్తీనావాసుల కోసం యూఏఈ కొన్నేళ్లుగా ఫండింగ్ చేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు పూర్తికావాలంటే మొదట ఈ ప్రాంతంలో శాంతిసాధన ముఖ్యమని అభిప్రాయపడుతోంది.

  అయితే యూఏఈ హమాస్ ను హెచ్చరిస్తూ చేసిన ప్రకటన వెనుక ఇజ్రాయిల్ హస్తం ఉన్నట్లుగా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో.. యూఏఈ, ఇజ్రాయిల్ కు మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇజ్రాయిల్ తో తనకున్న 49 ఏళ్ల శత్రుత్వాన్ని వీడనాడి యూఏఈ శాంతి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో ఇజ్రాయిల్, యూఏఈ దేశాల మధ్య పూర్తిస్థాయిలో దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి.
  అయితే ఈ ఒప్పందాన్ని అప్పట్లోనే పాలస్తీనా ప్రభుత్వం.. హమాస్ తీవ్రంగా వ్యతిరేకించాయి. యూఏఈ తీరును తప్పుపట్టాయి. పశ్చిమాసియాలోని అరబ్ దేశాల్లో ఇజ్రాయిల్ ను ఒక దేశంగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్న మూడో దేశంగా యూఏఈ నిలిచింది.

  ఈ కారణంగానే యూఏఈతో పాటు.. గల్ఫ్ దేశాలు పాలస్తీనాకు అండగా నిలబడలేదనే వాదన వినిపిస్తోంది. అయితే, ఈజిప్టు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించింది. ఇజ్రాయిల్‌-ఈజిప్టు బంధం చాలా ప్రత్యేకమైంది. క్యాంప్‌ డేవిడ్‌ ఒప్పందంతో ఇజ్రాయిల్‌ను గుర్తించిన తొలి అరబ్‌ దేశం ఈజిప్టు. అరబ్‌ దేశాల గ్రూప్‌ మాటను పక్కనబెట్టి ఈ శాంతి ఒప్పందం చేసుకొంది. గాజా పట్టీతో ఈజిప్టు సరిహద్దులు పంచుకొంటుంది. గాజా మూడు వైపులా ఇజ్రాయిల్‌ ఉంటే ఒక వైపు మధ్యదరా సముద్రం, మరోవైపు ఈజిప్ట్‌ ఉంటాయి. ఈజిప్ట్‌ సహకారంతోనే ఇజ్రాయిల్‌ గాజాపట్టీలోకి ఆయుధాలు, పేలుడు పదార్థాలు రాకుండా చూస్తోంది. 2006లో రహస్య సొరంగం సాయంతో హమాస్‌ కిడ్నాప్‌ చేసిన గిలాద్‌ హమీద్‌ అనే సైనికుడిని కూడా ఐదేళ్ల తర్వాత ఈజిప్టు చర్చలు జరిపి విడిపించిన చరిత్ర ఉంది.

  అటు గాజాపట్టీని పాలిస్తున్న హమాస్‌తో కూడా ఈజప్ట్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయిల్‌-హమాస్‌ ఘర్షణ మొదలైన కొన్ని గంటల్లో ఇరు వర్గాలు శాంతించాలని ఈజిప్ట్‌ కోరింది. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో-ఆపరేషన్‌ సమావేశంలో కూడా టర్కీ, పాక్‌ వలే ఇజ్రాయిల్‌ను బెదిరిస్తూ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇరుపక్షాలు చర్చలు జరిపి శాంతిని స్థాపించాలని కోరింది. ఆ తర్వాత హమాస్‌తో మాట్లాడేందుకు ఓ బృందాన్ని గాజాపట్టీ పంపి హమాస్‌తో చర్చలు జరిపింది. దాని షరతులు తెలుసుకొని ఇజ్రాయిల్‌ వద్దకు వెళ్లింది. కానీ, ఇజ్రాయిల్‌ నిరాకరించింది. మరోపక్క పాలస్తీనా క్షతగాత్రులు, శరణార్థులకు ఈజిప్టు ఆశ్రయం ఇచ్చింది. ఓ పక్క ఇరు పక్షాలతో చర్చలు జరుపుతూనే అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెంచే ప్రయత్నంచేశారు. ఈజిప్టు అధ్యక్షుడు అల్‌సిసి.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ను సాయం కోరారు. దీంతో ఫ్రాన్స్‌ ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఇజ్రాయిల్‌ను కాపాడేందుకు దానిని అమెరికా వ్యతిరేకించింది. కానీ, అగ్రరాజ్యంపై ఒత్తిడి పెరిగడంతో.. బైడెన్‌ కూడా నెతన్యాహుపై ఒత్తిడి పెంచి కాల్పుల విరమణ ప్రకటన చేయించారు.

  అయితే, ఇక్కడ మరోవాదన కూడా వినిపిస్తోంది. ఇజ్రాయిల్ వెనక్కి తగ్గింది అమెరికా, ఈజిప్టు ఒత్తిడి వల్ల కాదని.. అది అనుకున్న పని పూర్తిచేసింది కాబట్టే, కాల్పుల విరమణకు అంగీకరించిందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలను, గాజా లోని ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వాటిని నేలమట్టం చెయ్యడం, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వాటన్నిటిని తుడిచివెయ్యడం పూర్తయింది కాబట్టే ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపేసిందని అంటున్నారు. అంతేగాని, అమెరికా, ఈజిప్టు ఒత్తిడి అనేది కేవలం పైకి కనపబడుతున్న కారణమని చెబుతున్నారు. ఇజ్రాయిల్ అనుకున్నది పూర్తి చేసింది కాబట్టే యుద్ధం ఆపిందన్నది వారి వాదన. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లబడినా.. అది రావణకాష్టంలా రగులుతూనే వుంటుందన్నది జగమెరిగిన సత్యం.

  Related Stories